ప్రధాన మంత్రిపై అవినీతి ఆరోపణలు.. సస్పెండ్ చేసిన దేశాధ్యక్షుడు

ABN , First Publish Date - 2021-12-27T17:54:01+05:30 IST

సోమాలియా ప్రధాన మంత్రి మహమ్మద్ హుస్సేన్ రోబుల్‌ను

ప్రధాన మంత్రిపై అవినీతి ఆరోపణలు.. సస్పెండ్ చేసిన దేశాధ్యక్షుడు

మొగదిషు : సోమాలియా ప్రధాన మంత్రి మహమ్మద్ హుస్సేన్ రోబుల్‌ను సస్పెండ్ చేసినట్లు ఆ దేశాధ్యక్షుడు మహమ్మద్ అబ్దుల్లాహి మహమ్మద్ సోమవారం ప్రకటించారు. ప్రధాన మంత్రిపై వచ్చిన అవినీతి ఆరోపణలపై విచారణ పూర్తయ్యే వరకు ఈ సస్పెన్షన్ కొనసాగుతుందని తెలిపారు. చాలా కాలం నుంచి ఎన్నికల నిర్వహణలో జాప్యం జరుగుతుండటంపై వీరిద్దరూ ఆదివారం చర్చించారు. అయితే వీరు ఏకాభిప్రాయానికి రాలేకపోయారు. 


దేశాధ్యక్షుని కార్యాలయం సోమవారం విడుదల చేసిన ప్రకటనలో తెలిపిన వివరాల ప్రకారం, ప్రధాన మంత్రి మహమ్మద్ హుస్సేన్ రోబుల్‌ తనపై వచ్చిన భూ కబ్జా ఆరోపణలపై దర్యాప్తులో జోక్యం చేసుకుంటున్నారు. ఈ దర్యాప్తు పూర్తయ్యే వరకు ఆయన అధికారాలను నిలిపేయాలని దేశాధ్యక్షుడు మహమ్మద్ అబ్దుల్లాహి మహమ్మద్ నిర్ణయించారు. 


సోమాలియాలో ఎన్నికలు నిర్వహించాలని ప్రధాని ఆదేశాలు జారీ చేశారు. ఈ ఆదేశాలను దేశాధ్యక్షుడు ఉపసంహరించారు. దీంతో ఎన్నికల నిర్వహణ చాలా సంక్లిష్టంగా మారింది. ఫలితంగా దేశంలో స్థిరత్వం ఏర్పడటంపై భయాందోళనలు పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో దేశాధ్యక్షుడు, ప్రధాన మంత్రి ఆదివారం చర్చలు జరిపారు. కానీ వీరిద్దరి మధ్య ఏకాభిప్రాయం కుదరలేదు. ఎన్నికల ప్రక్రియకు దేశాధ్యక్షుడు విఘాతం కలిగిస్తున్నారని ప్రధాని ఆరోపించారు. 


ఇదిలావుండగా, తన సస్పెన్షన్‌పై రోబుల్ సోమవారం స్పందించలేదు. కానీ దేశంలో విశ్వసనీయమైన ఎన్నికల నిర్వహణ జరగాలని దేశాధ్యక్షుడు కోరుకోవడం లేదన్నారు. 


Updated Date - 2021-12-27T17:54:01+05:30 IST