భారతీయులపై యూఎస్ ప్రయాణ ఆంక్షలు.. వీరికి మాత్రం అవి వర్తించవు!

ABN , First Publish Date - 2021-05-01T21:02:24+05:30 IST

భారత్‌లో కరోనా విలయం సృష్టిస్తోంది. రికార్డు స్థాయిలో కేసులు నమోదవుతున్నాయి. ఈ నేపథ్యంలో అగ్రరాజ్యం అమెరికా కీలక నిర్ణయం తీసుకుంది. భారత్ నుంచి వెళ్లే ప్రయాణికులపై ఆంక్షలు విధిస్తూ ఆదేశా

భారతీయులపై యూఎస్ ప్రయాణ ఆంక్షలు.. వీరికి మాత్రం అవి వర్తించవు!

వాషింగ్టన్: భారత్‌లో కరోనా విలయం సృష్టిస్తోంది. రికార్డు స్థాయిలో కేసులు నమోదవుతున్నాయి. ఈ నేపథ్యంలో అగ్రరాజ్యం అమెరికా కీలక నిర్ణయం తీసుకుంది. భారత్ నుంచి వెళ్లే ప్రయాణికులపై ఆంక్షలు విధిస్తూ ఆదేశాలు జారీ చేసింది. ఈ ఆంక్షలు మే 4 నుంచి అమలులోకి రాబోతున్నట్లు ప్రకటించింది. అయితే ఆంక్షల నుంచి కొందరికి మినహాయింపు ఇచ్చింది. విద్యార్థులు, విద్యావేత్తలు, జర్నలిస్ట్‌లతోపాటు విదేశాల్లో వైద్య సహాయం చేసేందుకు వెళ్లే వైద్యులకు ప్రయాణ ఆంక్షలను నుంచి మినహాయింపునిస్తూ అమెరికా నిర్ణయం తీసుకుంది. 


ఆగస్టు 1 లేదా ఆ తర్వాత నుంచి ప్రారంభమయ్యే అకాడమిక్ ప్రోగ్రాం కోసం ఎఫ్1 మరియు ఎం1 వీసాలు ఇప్పటికే పొందిన విద్యార్థులకు ప్రయాణ ఆంక్షలు వర్తించవని స్పష్టం చేసింది. విద్యార్థులు తమ అకాడమిక్ ప్రోగ్రాం ప్రారంభమయ్యే 30 రోజుల ముందు నుంచే అమెరికాకు చేరుకోవచ్చని తెలిపింది. వీసాలు పొందిన విద్యార్థులు దగ్గర్లోని అమెరికా ఎంబసీ కార్యాలయాను సంప్రదించవలసిన అవసరం లేదని వెల్లడించింది. అయితే కొత్తగా ఎప్1, ఎం1 వీసాల కోసం దరఖాస్తు చేసుకోవాలనుకునే వారు మాత్రం ఎంబసీని సంప్రదించాలని కోరింది. 


ఇదిలా ఉంటే.. భారత్ నుంచి రాకపోకలపై నిషేధం విధిస్తూ బైడెన్ సర్కార్ తీసుకున్న నిర్ణయాన్ని పలువురు రిపబ్లికన్స్ నేతలు విమర్శించారు. "మన సరిహద్దును మెక్సికో కోసం తెరిచి ఉంచినప్పుడు లేనిది.. మన మిత్రదేశానికి ప్రయాణాన్ని పరిమితం చేయడం ఎంతవరకు సమంజసం" అని రిపబ్లికన్ పార్టీ కాంగ్రెస్ సభ్యుడు టిమ్ బుర్చెట్ ట్వీట్ చేశారు. అలాగే మరో రిపబ్లికన్ నేత జాడీ అరింగ్టన్ కూడా బైడెన్ నిర్ణయాన్ని తప్పుబట్టారు.


Updated Date - 2021-05-01T21:02:24+05:30 IST