Abn logo
Jul 10 2021 @ 13:52PM

HYD : వామ్మో.. లిఫ్ట్ ప్లీజ్ అని అడిగి ‘కిలేడీలు’ ఏం చేస్తున్నారో చూడండి!

  • లిఫ్ట్‌ అడిగి వేధిస్తున్న మహిళా నేరగాళ్లు


చీకటిపడగానే రోడ్డుపైకొస్తున్నారు.. లిఫ్ట్‌ ప్లీజ్‌ అంటూ వేడుకుంటున్నారు.. అయ్యో  పాపం ఒంటరి మహిళ అని లిఫ్ట్‌ ఇస్తే.. నిండా ముంచేస్తున్నారు. అత్యాచారయత్నం కేసు పెడతామంటూ బ్లాక్‌మెయిలింగ్‌కు దిగుతున్నారు. ఇలాంటి మహిళల ముఠా  బారిన పడుతున్న వారి సంఖ్య ఇటీవల పెరుగుతోంది. పరువు, కేసుల భయంతో చాలా మంది అడిగింది ఇచ్చి వారిని వదిలించుకుంటున్నారు. కొందరు పోలీసులకు ఫోన్‌లో ఫిర్యాదులు చేస్తున్నారు. ఈ తరహా కేసులపై వారు స్పందించడం లేదని బాధితులు వాపోతున్నారు. 


హైదరాబాద్‌ సిటీ : ఒంటరిగా ఉన్న మహిళ లేదా యువతి రోడ్లపై అంతగా జన సంచారం లేని ప్రాంతంలో లిఫ్ట్‌ అడుగుతుంది. సీసీ కెమెరాలు లేని ప్రాంతాలను ఎంచుకుంటుంది. ముఖాన్ని అంతగా గుర్తించకుండా ఫేస్‌మాస్కుతో పాటు తలపై ఏదో ఒక వస్త్రాన్ని కప్పుకుంటుంది. ఇబ్బందుల్లో ఉన్న యువతిని కాస్త ముందుకు తీసుకెళ్లి డ్రాప్‌ చేద్దామనే ఆలోచనతో వాహనదారుడే ఇబ్బందుల్లో చిక్కుకుంటున్నాడు. వాహనం ఆపగానే ఎక్కి కూర్చునే మహిళ కాస్త దూరం డ్రాప్‌ చేయమంటుంది. ముందుకు వెళ్లాక ‘ఎక్కడ డ్రాప్‌ చేయాలి’ అని వాహనదారుడు అడగ్గానే తన స్వరాన్ని మార్చేస్తుంది. ‘ముందు డబ్బులివ్వు.. ఆ తర్వాతే దిగుతా’ అని చెబుతుంది. డబ్బులెందుకని ప్రశ్నిస్తే.. ‘ఎందుకు కూర్చోబెట్టుకున్నావు. మర్యాదగా డబ్బులివ్వు, లేదంటే నాపై దాడి చేశావని, అత్యాచార యత్నం చేయబోయావని కేసు పెడతా’ అని బెదిరిస్తుంది. చాలా మంది అలాంటి వారి బ్లాక్‌మెయిలింగ్‌కు భయపడి ఎంతోకొంత ఇచ్చి వెళ్లిపోతారు.

ఆ రెండు జోన్లలో అధికం..

పోలీసులు డెకాయ్‌ ఆపరేషన్‌లు చేపడితే అలాంటి మహిళలను గుర్తించే అవకాశముంది. పురుష పోలీసు సిబ్బంది అనుమానాస్పద మార్గాల్లో బైకుల మీద తిరిగితే, ఇలాంటి నేరగాళ్లు పట్టుబడే అవకాశం ఉంది. వెస్ట్‌జోన్‌, ఈస్ట్‌జోన్‌లో ఇలాంటి సంఘటనలు జరుగుతున్నట్లు సమాచారం. 


గ్యాంగులుగా.. ఒక్క మహిళే కదా అనుకునే పరిస్థితి కూడా లేదని బాధితులు చెబుతున్నారు. ఆమె లిఫ్టు అడిగిన తర్వాత దిగిన దాకా ఆమె గ్యాంగు సభ్యులు ఫాలో చేయడం.. లేదా డ్రాపింగ్‌ వద్ద గొడవ ముదిరితే ఆమెను రక్షించడానికి, వాహనదారుడిదే తప్పు అని నిరూపించడానికి వెంబడిస్తుంటారు. కొన్ని సందర్భాల్లో చేతులకు, కాళ్లకు కావాలని దెబ్బలు తగిలించుకుని వాహనదారుడు దాడి చేశాడని స్థానికుల నుంచి సానుభూతి పొందుతుంటారు. ‘లిఫ్టు అడిగిన మహిళపై జాలి కలిగితే ఆటో ఎక్కించి డబ్బులు చెల్లిస్తే బెటర్‌. కానీ సొంత వాహనం మీద లిఫ్టు ఇచ్చి ఇబ్బందులు తెచ్చుకోకండి’ అని పోలీసులు చెబుతున్నారు.

పోలీసుల స్పందన అంతంతే..

ఇబ్బందుల్లో డయల్‌ 100కి కాల్‌ చేసినా, పోలీస్‌ స్టేషన్‌కు ఫోన్‌ చేసినా పోలీసులు స్పందించలేదని ఓ బాధితుడు ఆరోపించాడు. వారం రోజుల క్రితం ఓ వ్యక్తి ద్విచక్ర వాహనంపై వెళ్తుండగా షేక్‌పేట్‌.. పాస్‌పోర్టు కార్యాలయం ఎదురుగా బురఖా ధరించిన మహిళ లిఫ్టు అడగడంతో అతను వాహనాన్ని ఆపాడు. ఆ మహిళ కూర్చున్న తర్వాత దిగమంటే డబ్బులు డిమాండ్‌ చేసిందని, ఇవ్వకపోతే పరువు తీస్తా..? అని బెదిరించిందని పేర్కొన్నారు. తన వద్ద ఉన్న రూ. 200 ఇచ్చేసినా ఇంకా డబ్బులు కావాలని మొండికేసిందని చెప్పాడు. అంతలోనే మరి కొందరు అక్కడ జమ అయి మహిళను ఎందుకు వేధిస్తున్నావని ప్రశ్నించడంతో భయపడ్డానని పేర్కొన్నాడు. వాహనాన్ని రోడ్డుపైనే వదిలి, పక్కనే ఉన్న హోటల్‌ లోపలికి దూరి హుమాయున్‌నగర్‌ పోలీసులకు ఫోన్‌ చేస్తే స్పందించలేదని వాపోయాడు. వాహనాన్ని వదిలి పోలీస్‌స్టేషన్‌కు వచ్చి ఫిర్యాదు చేయమనడంతో హోటల్‌ సిబ్బంది సాయాన్ని కోరానన్నాడు. వారు కలగజేసుకుని తనను గొడవ నుంచి రక్షించారని బాధితుడు వివరించాడు.