కారు స్టీరింగ్‌ ఎవరికో?

ABN , First Publish Date - 2021-09-02T05:13:13+05:30 IST

వరుస విజయాలతో మంచి..

కారు స్టీరింగ్‌ ఎవరికో?

టీఆర్‌ఎస్‌ పార్టీ జిల్లా అధ్యక్షుడి రేసులో నలుగురు నేతలు

ఎమ్మెల్యేల మద్దతుపై కొనసాగుతున్న సస్పెన్షన్‌

కమిటీల్లో బడుగు బలహీన వర్గాలకే పెద్దపీట

నేటి నుంచి టీఆర్‌ఎస్‌ సంస్థాగత ఎన్నికల సందడి షురూ


ఆదిలాబాద్‌(ఆంధ్రజ్యోతి): వరుస విజయాలతో మంచి స్పీడుతో కనిపిస్తున్న కారు పార్టీ స్టీరింగ్‌ ఎవరికన్నదే జిల్లాలో చర్చనీయాంశంగా మారింది. పార్లమెంట్‌ మినహా అసెంబ్లీ స్థానాలు, జడ్పీ, మున్సిపల్‌, మెజార్టీ మండల పరిషత్‌, ఎంపీటీసీ, సర్పంచ్‌ స్థానాలను కైవసం చేసుకుని జోష్‌లో కనిపిస్తున్న టీఆర్‌ఎస్‌ పార్టీ సంస్థాగత ఎన్నికలపై సీరియస్‌గా దృష్టి సారించింది. ఇందులో భాగంగానే గురువారం నుంచి ప్రతి గ్రామం, పట్టణం, వార్డుల్లో పార్టీ జెండా పండుగను నిర్వహించేందుకు సిద్ధమవుతోంది. జిల్లాలో ఆదిలాబాద్‌, బోథ్‌ నియోజక వర్గాలు పూర్తి స్థాయిలో ఉండగా ఖానాపూర్‌, ఆసిఫాబాద్‌ నియోజక వర్గాలు పాక్షికంగా కొనసాగుతున్నాయి. ఇప్పటికే భారీ సభ్యత్వాన్ని పూర్తి చేసుకున్న టీఆర్‌ఎస్‌ సంస్థాగతంగా పార్టీని మరింత బలోపేతం చేసే దిశగా అడుగులు వేస్తోంది. ప్రత్యక్ష ఎన్నికల్లో పదవులకు దూరమైన వారందరికి పార్టీ పదవులను ఇచ్చేందుకు సిద్ధమవుతోంది.


జిల్లాలో కొంత బలంగానే కనిపిస్తున్నా అధికార పార్టీ కాంగ్రెస్‌, బీజేపీల దూకుడుకు అడ్డుకట్ట వేసే ప్రయత్నాలు మొదలు పెట్టింది. కొంత కాలంగా జిల్లాలో పార్టీని ముందుకు నడిపించే నాయకుడే లేకపోవడంతో అన్ని తామై ఎమ్మెల్యేలే ముందుకు నడిపిస్తున్నారన్నారు. అయితే ఈ నెల 12 వర కు గ్రామ, వార్డు కమిటీలను పూర్తిచేసి 12 నుంచి 20 వరకు మండల, పట్టణ కమిటీలను ఏర్పాటు చేయనున్నారు. ఆ తర్వాత జిల్లా పార్టీ పగ్గాలను సమర్థవంతమైన నాయకుడికి అప్పగించేందుకు పార్టీ అధిష్ఠానం సిద్ధమవుతోంది. ఇప్పటికే రాష్ట్ర నాయకత్వం ఆదేశాలు ఇవ్వడంతో జిల్లా సారథి ఎవరన్నది ప్ర స్తుతం జిల్లా రాజకీయాల్లో హాట్‌ టాపిక్‌గా మారింది.


అధ్యక్షుడి వేటలో అధిష్ఠానం..

సంస్థాగత ఎన్నికల్లో గ్రామ, మండల, పట్టణ కమిటీలను స్థానిక ఎమ్మెల్యేలు, సీనియర్‌ నేతల పరిధిలోనే జరగనున్నాయి. కానీ పార్టీ జిల్లా అధ్యక్షున్ని మాత్రం రాష్ట్ర అధిష్ఠానమే ప్రకటించే అవకాశం ఉంది. దీంతో సరైన నాయకుని కోసం అధిష్ఠానం వేట మొదలు పెట్టినట్లుగా తెలుస్తోంది. ఇప్పటికే కొందరు నేతల పేర్లను పరిశీలిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. నిఘా వర్గాల ద్వారా నేతల పలుకుబడి, వ్యక్తిగత సమాచారాన్ని రహస్యంగా సేకరిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే ఓసీ సామాజిక వర్గానికి చెందిన మున్సిపల్‌ మాజీ చైర్‌పర్సన్‌ రంగినేని మనీషా భర్త రంగినేని పవన్‌రావు పేరుతో పాటు జైనథ్‌ మండలానికి చెందిన సీనియర్‌ నేత రోకండ్ల రమేష్‌రావు,  ప్రస్తుత జడ్పీటీసీ నేరడిగొండ మండల కేంద్రానికి చెందిన అనిల్‌జాదవ్‌, ఉట్నూర్‌ మండలానికి చెందిన మాజీ ఐటీడీఏ చైర్మన్‌ లక్కేరావ్‌ల పేర్లు ప్రధానంగా వినిపిస్తున్నాయి. అయితే రాష్ట్ర వ్యాప్తంగా సామాజిక వర్గాల వారీగానే జిల్లా పార్టీ అధ్యక్షుడిని ఎన్నుకునే అవకాశం కనిపిస్తోంది. ఇప్పటికే టీఆర్‌ఎస్‌లో ఉద్యమ బ్యాచ్‌, బీటీ బ్యాచ్‌ అనే వర్గ విభేదాలు కనిపిస్తున్నాయి. ప్రత్యక్ష ఎన్నికల్లో అవకాశం దక్కని ఉద్యమ నేతలంతా నిరాశతో అంతర్గతంగా పార్టీపై దిక్కార స్వ రంతో ఎదురు దాడి చేసేందుకు సిద్ధమవుతున్నారు. కనీసం పార్టీ పదవుల్లోనైనా అవకాశం దక్కుతుందో లేదోనన్న ఆవేదన వారిలో కనిపిస్తోంది.


ఎమ్మెల్యేల కనుసన్నల్లోనే..

పార్టీ పదవుల కేటాయింపులు అంతా జిల్లా ఎమ్మెల్యేల కనుసన్నల్లోనే జరగనుంది. జిల్లా పార్టీ అధ్యక్షుడి పేరును అధిష్ఠానం పెద్దలు ప్రకటించిన జిల్లా ఎమ్మెల్యేల సమ్మతి మేరకే నిర్ణయం తీసుకునే అవకాశం ఉంటుంది. అయితే తమకు దగ్గరి అనుచరులకే పార్టీ జిల్లా అధ్యక్ష పదవిని కట్టబెట్టేందుకు ఎమ్మెల్యేలు ప్రయత్నాలు మొదలు పెట్టారు. జిల్లా ఎంపికపై ఎమ్మెల్యేలతో పాటు సీనియర్‌ నాయకులు గేడం నగేష్‌, లోక భూమారెడ్డి, మరికొంత మంది సీనియర్‌ నాయకుల అభిప్రాయాలను తీసుకునే అవకాశం ఉంది. ఎమ్మెల్యేల మధ్య ఏకాభిప్రాయం కుదరకుంటే ఉమ్మడి జిల్లా మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి చొరవతో పార్టీ అధ్యక్షుడి పేరును ఫైనల్‌ చేసే అవకాశాలున్నాయి. ప్రస్తుతం ఎవరికి వారే ధీమా వ్యక్తం చేస్తున్న ఎమ్మెల్యేల మద్దతు మాత్రం ఎవరికన్నదే సస్పెన్షన్‌గా కనిపిస్తోంది. జిల్లాలో లంబాడా, ఆదివాసీ సామాజిక వర్గాల మధ్య ఉద్యమపోరు కొనసాగుతున్న నేపథ్యంలో ఈ అంశాన్ని పరిగణలోకి తీసుకునే అవకాశాలు లేక పోలేదు. 


వెనకబడిన వర్గాలకే పెద్దపీట..

ప్రస్తుతం రాష్ట్రంలో నెలకొన్న రాజకీయ పరిస్థితుల దృష్ట్యా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ సామాజిక వర్గాల వారికే పార్టీ పదవుల్లో ప్రాధాన్యం కల్పించేందుకు  పార్టీ అధిష్ఠానం నిర్ణయించింది. కమిటీల్లో 51శాతం మంది ఈ వర్గాలకు చెందిన వారే తప్పని సరిగా ఉండాలన్న నిబంధనను విధించింది. ఒకవేళ ఎమ్మెల్యేలు ఒంటెద్దు పోకడలతో ఈ నిబంధనను అతిక్రమించి కమిటీలను ఏర్పాటు చేస్తే అలాంటి కమిటీలను పరిగణలోకి తీసుకొనబడవని షరతు విధించింది. టీఆర్‌ఎస్‌ పార్టీ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, మహిళలకే ఎక్కువ ప్రాధాన్యత కల్పిస్తుందన్న వాదనను ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తోంది. ప్రతి కమిటీని 15 మంది సభ్యులతో ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. ఒక వేళ అవసరమైతే ఈ సంఖ్యను 33 వరకు పెంచుకునే అవకాశం అధిష్ఠానం కలిపించింది. కానీ సగానికి పైగా పార్టీ పదవులను వెనకబడిన సామాజిక వర్గాల వాను కేటాయించేందుకుపార్టీ అధిష్ఠానం నిర్ణయించింది.

Updated Date - 2021-09-02T05:13:13+05:30 IST