Abn logo
Sep 19 2021 @ 16:10PM

అప్పుడు మెప్పించి గెలిచాం: సోమిరెడ్డి

అమరావతి: పరిషత్  ఎన్నికల్లో టీడీపీ కంటే వైసీపీ ఎక్కువ స్ధానాలు గెలిచిందని వైసీపీ మంత్రులు మాట్లాడటం హాస్యాస్పదంగా ఉందని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు సోమిరెడ్డి చంద్రమోహనరెడ్డి అన్నారు. పరిషత్ ఎన్నికల్లో అసలు టీడీపీ పోటీనే చేయలేదన్నారు. వైసీపీ అరాచకాలు, దౌర్జన్యాలకు నిరసనగా ఎన్నికలు బహిష్కరిందని చెప్పారు. వైసీపీ నేతలు, కార్యకర్తలు ఎన్నికల్లో దాడులు, దౌర్జన్యాలు, అరచకాలకు పాల్పడి ప్రజలకు అంబేద్కర్ ఇచ్చిన స్వేచ్చను, చివరకు ఓటు హక్కును కూడా హరించారని ఆయన మండిపడ్డారు. టీడీపీ అధికారంలో ఉన్నపుడు జరిగిన ప్రతి ఎన్నికల్లో ప్రజల్ని మెప్పించి గెలిచామని గుర్తుచేశారు. వైసీపీ మాదిరి దాడులు, దౌర్జన్యాలతో ప్రజల్న భయబ్రాంతులకు గురిచేసి గెలవలేదన్నారు. పుంగనూరులో 69 ఎంపీటీసీల్లో 65, తంబళపల్లిల్లో 72 కి 72  శ్రీకాళహస్తిలో 64 కి 63 ఎంపీటీసీలు వైసీపీ బలవంతంగా ఏకగ్రీవం చేసుకుందన్నారు. రాష్ట్రం మెత్తం ఈ విధంగా దాడులు, దౌర్జన్యాలకు పాల్పడి ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసి ఎన్నికల్లో గెలిచామని చెప్పుకోవటం సిగ్గుచేటన్నారు. గతంలో జయలలిత కూడా స్ధానిక ఎన్నికలను బహిష్కరించారని చెప్పారు. రాష్ర్టంలో రాక్షస పాలన సాగుతోందని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. మంత్రులు, ఎమ్మెల్యేలు చేసే అరాచాకాలపై ముఖ్యమంత్రి ఒక్క గంట దృష్టి పెట్టలేరా? అని ప్రశ్నించారు. అన్నపూర్ణగా పేరొందిన ఏపీని బీహార్, యూపీ, పశ్చిమ బెంగాల్ లతో పోటీపడే పరిస్థితి తెచ్చారని పేర్కొన్నారు.