Abn logo
Oct 24 2021 @ 11:05AM

పోలీసు వ్యవస్థపై హైకోర్టు తీవ్రమైన అభిసంసన చేసింది: సోమిరెడ్డి

అమరావతి: ఆంధ్రప్రదేశ్ పోలీసు వ్యవస్థపై రాష్ట్ర హైకోర్టు తీవ్రమైన అభిసంసన చేసిందని టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ట్విట్టర్ వేదికగా పేర్కొన్నారు. సీఎంకి ఒక చట్టం, హైకోర్టు న్యాయమూర్తులకు మరో చట్టమా? అనే ప్రశ్నను లేవనెత్తిందన్నారు. చట్టబద్దమైన పాలనపై గౌరవం లేదా.. కోర్టు ఆదేశాలంటే నవ్వులాటా..అని నిలదీసిందన్నారు. హైకోర్టు జడ్జీలు, ఇతర రాజ్యాంగబద్ద పదవుల్లో ఉన్నవారిని దూషించిన వారిపై చర్యలు తీసుకోవడంలో లేని ఉత్సాహం ఇప్పుడేందుకని ఎత్తిచూపిందన్నారు. హైకోర్టు నమ్మకం కోల్పోయిన తర్వాత  పోలీసు వ్యవస్థకు ఇక విలువ ఏముంటుందన్నారు. డీజీపీ అనే అధికారి ఇంత తీవ్రమైన అభిసంసనకు కూడా స్పందించకుండా అదే సీటులో కొనసాగడం పోలీసు శాఖ ప్రతిష్టకే మాయనిమచ్చన్నారు. ఈ అంశంలో డీజీపీ ఆత్మవిమర్శ చేసుకుంటే సముచితంగా ఉంటుందని సోమిరెడ్డి వ్యాఖ్యానించారు.