చిరంజీవిని బీజేపీలోకి ఆహ్వానించడంపై సోము వీర్రాజు క్లారిటీ

ABN , First Publish Date - 2020-08-08T01:30:41+05:30 IST

మెగాస్టార్ చిరంజీవిని బీజేపీలోకి ఆహ్వానించలేదని రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు తెలిపారు. కేవలం మర్యాదపూర్వకంగానే చిరంజీవిని కలిశానని తెలిపారు.

చిరంజీవిని బీజేపీలోకి ఆహ్వానించడంపై సోము వీర్రాజు క్లారిటీ

అమరావతి: మెగాస్టార్ చిరంజీవిని బీజేపీలోకి ఆహ్వానించలేదని రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు తెలిపారు. కేవలం మర్యాదపూర్వకంగానే చిరంజీవిని కలిశానని తెలిపారు. జనసేన, బీజేపీ కలసి ప్రజా సమస్యలపై పోరాడాలని ఆయన సూచించారని వీర్రాజు పేర్కొన్నారు. చిరంజీవికి వచ్చిన 18 శాతం ఓట్లు, జనసేనకు వచ్చిన 7శాతం ఓట్లు.. భవిష్యత్తులో తమకు అనుకూలంగా మారతాయని జోస్యం చెప్పారు. వైసీపీ, టీడీపీలు కుటుంబ పార్టీలేనని తప్పుబట్టారు. అమరావతి రైతుల పక్షాన జనసేనతో కలసి పోరాడతామని తెలిపారు. త్వరలో బీజేపీలోకి పెద్ద ఎత్తున వలసలు ఉంటాయని జోస్యం చెప్పారు. వివిధ వర్గాలవారిని కలసి బీజేపీకి మద్దతివ్వాలని కోరుతున్నామని, మాజీమంత్రి ముద్రగడ పద్మనాధం, వీవీ లక్ష్మీనారాయణ లాంటి వారిని సైతం కలుస్తానని సోమువీర్రాజు ప్రకటించారు.


రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడుగా ఎంపికైన వీర్రాజు మర్యాద పూర్వకంగా హైదరాబాద్‌లోని చిరంజీవి నివాసానికి వెళ్లి ఆయన్ను కలిసిన విషయం తెలిసిందే. జనసేనానని పవన్‌‌కల్యాణ్‌తో కలిసి ముందుకెళ్లాలని సోము వీర్రాజుకు చిరంజీవి సూచించారు. పెద్దల సహకారం కావాలని ఈ సందర్భంగా బీజేపీ అధ్యక్షుడు వ్యాఖ్యానించారు. స్పందించిన చిరంజీవి... తమ్ముడి సహకారంతో ముందుకెళ్లండి అని సూచించారు. 

Updated Date - 2020-08-08T01:30:41+05:30 IST