వాజపేయి సుపరిపాలనకు ఆదర్శంగా నిలిచారు: సోము వీర్రాజు

ABN , First Publish Date - 2021-12-25T18:13:00+05:30 IST

మాజీ ప్రధాని వాజపేయి సుపరిపాలనకు ఆదర్శంగా నిలిచారని ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు అన్నారు.

వాజపేయి సుపరిపాలనకు ఆదర్శంగా నిలిచారు: సోము వీర్రాజు

అమరావతి: మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజపేయి సుపరిపాలనకు ఆదర్శంగా నిలిచారని ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు అన్నారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ..‘‘వాజపేయి సభలో మాట్లాడుతుంటే అందరూ ఆసక్తిగా వినేవారు.. నేడు పార్లమెంటు‌లో కాగితాలు చింపి గోల చేస్తున్నారు. ఏపీ అసెంబ్లీ‌లో అయితే ఏకంగా బూతులే మాట్లాడుతున్నారు. నేడు వాజపేయిని అందరూ ఎందుకు గుర్తు చేసుకుంటున్నారో నేటి నేతలు ఆలోచించాలి.  నేడు ఏపీలో రోడ్లు వేయాలంటే... కాంట్రాక్టర్ల నుంచి డబ్బులు తీసుకుంటారు. గ్రామీణ సడక్ యోజన‌కింద వాజపేయి రోడ్లు వేశారు. సీఎం జగన్మోహన్‌రెడ్డి మాత్రం గంపెడు మట్టి కూడా వేయలేకపోయారు. ఏదైనా పనికి కాంట్రాక్ట‌ర్‌ని పిలిస్తే... రాలేని దుస్థితి ఏపీలో ఉంది. జగన్మోహన్‌రెడ్డి అధికారంలోకి వచ్చాక...‌ప్యాలెస్ వీడటం లేదు... రోడ్డు మీదకు రావడం లేదు.


గతంలో వంట గ్యాస్ కోసం ప్రజలు అనేక పాట్లు పడేవారు.దీపం పథకం కింద వాజపేయి ప్రతి ఇంటికి గ్యాస్ అందించారు.ఏపీలో గత సీఎం, ప్రస్తుత సీఎం ప్రజలకు చేసిందేమీ లేదు. గత పాలకులు  గ్రాఫిక్స్‌తో మాయ చేస్తే...‌నేటి పాలకులు మాటలతో మోసం చేస్తున్నారు.ఏపీలో ఎలాంటి అభివృద్ధి పనులు చేశారో చెప్పాలి. అభివృద్ధిని చేసే వాటిని బ్లాక్ మెయిల్ చేస్తున్న పార్టీలు ఏపీలో ఉన్నాయి.గత సీఎం, ఇప్పటి సీఎంకు అభివృద్ధి చేసే దమ్ముందా. పనులు చేయరు...‌చేసే వారిని అడ్డుకుంటారా..? మీలాంటి వారికి తగిన బుద్ధి చెప్పే రోజులు త్వరలోనే వస్తాయి.వాజపేయి వచ్చే వరకు ఎస్టీలకు క్యాబినెట్‌లో ‌చోటు లేదు. ఎస్టీల కోసం వాజపేయి ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేశారు.వాజపేయి వచ్చాకే చాలా మెడికల్ కాలేజీలు వచ్చాయి. పథకం‌ కేంద్రానిది అయితే.. చిన్న బొమ్మ వేస్తారు... రంగులు మాత్రం వారి పార్టీవి వేస్తారు.


రాష్ట్రంలో పౌష్టికాహారం పేరుతో కుళ్లిన గుడ్లు పెడతారా..?. దేశంలో కమ్యూనిస్టులు కమీషన్ల ఏజెంట్లుగా మారారు. దేశంలో విద్యా వ్యవస్థను కమ్యూనిస్టులే నాశనం చేశారు.అంబేద్కర్ గురించి అద్భుతంగా మాట్లాడటం కాదు..వారి ఆలోచనలను ఆచరణలో పెట్టాలి.సమాజాన్ని మేల్కొలిపే విధంగా మా వంతు కార్యక్రమాలు చేపడతాం’’ అని సోము వీర్రాజు వ్యాఖ్యానించారు. 

Updated Date - 2021-12-25T18:13:00+05:30 IST