డీజీపీని వెంటనే తొలగించాలి: సోమువీర్రాజు

ABN , First Publish Date - 2021-01-17T16:13:58+05:30 IST

డీజీపీ గౌతమ్ సవాంగ్‌పై ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోమువీర్రాజు ఆగ్రహం వ్యక్తం చేశారు.

డీజీపీని వెంటనే తొలగించాలి: సోమువీర్రాజు

అమరావతి: డీజీపీ గౌతమ్ సవాంగ్‌పై  ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోమువీర్రాజు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆదివారం సోమువీర్రాజు మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రంలో ఆలయాలపై  వరుసగా జరుగుతున్న  దాడుల వెనుక బీజేపీ, టీడీపీ ఉందన్న డీజీపీ వ్యాఖ్యలను ఆయన ఖండించారు. డీజీపీని వెంటనే తొలగించాలని సోము వీర్రాజు డిమాండ్ చేశారు. డీజీపీ హిందువుల మనోభావాలు దెబ్బతీయాలనుకుంటున్నారా అని ప్రశ్నించారు. క్షేత్రస్థాయిలో ఏం జరుగుతోందో డీజీపీకి తెలుసా అని నిలదీశారు. విగ్రహాల ధ్వంసం కేసును ప్రభుత్వం సీరియస్‌గా  ఎందుకు తీసుకోవడం లేదని  ప్రశ్నించారు. తిత్లీ తుఫాన్‌లో విగ్రహం ధ్వంసమైందని సోషల్‌మీడియాలో పెడితే కేసు పెట్టారన్నారు.


బీజేపీ నాయకులు ధ్వంసం చేశారని నిరాధార ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. ఎప్పుడో ధ్వంసమైన విగ్రహాలకు సంబంధించి.. ఇప్పుడు బీజేపీ  శ్రేణులపై కేసులు పెడుతున్నారని సోము వీర్రాజు ఆగ్రహం వ్యక్తం చేశారు. కేసును దారి మళ్లించేందుకే ప్రదీప్ చక్రవర్తి వీడియో బయటపెట్టారన్నారు. మతం మార్పిస్తున్నారని వైసీపీ ప్రభుత్వం పాస్టర్లకు జీతాలు ఇస్తుందా అని ప్రశ్నించారు. చర్చిల ఆస్తులపై కేంద్ర హోంశాఖకు నివేదిక పంపుతామని చెప్పారు. దళిత క్రిస్టియన్ అనేది రాజ్యాంగ విరుద్ధమన్నారు. వైసీపీ నాయకులు హిందూ ఆలయాల ఆస్తులపై ఆరా తీస్తున్నారు.. ఇతర మతాల ఆస్తులను ఎందుకు పట్టించుకోవడం లేదని సోము వీర్రాజు నిలదీశారు.

Updated Date - 2021-01-17T16:13:58+05:30 IST