లాక్‌డౌన్ కష్టాలు.. లక్షల్లో అప్పులు.. తల్లి ఆత్మహత్య.. 24గంటల్లోనే కొడుకు కూడా..

ABN , First Publish Date - 2020-05-20T17:10:00+05:30 IST

కని పెంచి, ప్రేమను పంచిన అమ్మ తిరిగిరాని లోకాలకు వెళ్లిపోవడంతో ఆ బిడ్డ తల్లడిల్లాడు. అమ్మ లేని జీవితం అంధకారమనుకున్నాడు. తల్లి ఆత్మహత్యను జీర్ణించుకోలేక తానూ ఆత్మహత్య చేసుకున్నాడు. విజయవాడ రూరల్‌ మండలం జక్కంపూడి కాలనీలో జరిగిన ఈ ఘటనలు అక్కడ విషాదాన్ని నింపాయి.

లాక్‌డౌన్ కష్టాలు.. లక్షల్లో అప్పులు.. తల్లి ఆత్మహత్య.. 24గంటల్లోనే కొడుకు కూడా..

మరణంలోనూ పేగు బంధం!

పేద కుటుంబానికి లాక్‌డౌన్‌ కష్టం

ఆర్థిక ఇబ్బందులతో తల్లి ఆత్మహత్య 

మరునాడే కుమారుడి ఆత్మహత్య

జక్కంపూడి కాలనీలో విషాదం


విజయవాడ/చిట్టినగర్‌ (ఆంధ్రజ్యోతి) : కని పెంచి, ప్రేమను పంచిన అమ్మ తిరిగిరాని లోకాలకు వెళ్లిపోవడంతో ఆ బిడ్డ తల్లడిల్లాడు. అమ్మ లేని జీవితం అంధకారమనుకున్నాడు. తల్లి ఆత్మహత్యను జీర్ణించుకోలేక తానూ ఆత్మహత్య చేసుకున్నాడు. విజయవాడ రూరల్‌ మండలం జక్కంపూడి కాలనీలో జరిగిన ఈ ఘటనలు అక్కడ విషాదాన్ని నింపాయి. మరికొద్దిసేపట్లో తల్లి మృతదేహానికి పోస్టుమార్టం జరుగుతుందనగా, తనయుడు తనువు చాలించాడు. వైఎస్సార్‌ కాలనీ బ్లాక్‌ నంబర్‌ 134లో ఉండే షేక్‌ షంషుద్దీన్‌ బంగారం పని చేస్తుంటాడు. ఆయన భార్య కరీమా. పెద్దకుమార్తె రుబియాకు కొద్దినెలల క్రితం వివాహం చేశారు. కుమారుడు నూరుద్దీన్‌, చిన్నకుమార్తె చాందిని ఇంట్లోనే ఉంటున్నారు. తల్లికి చేదోడువాదోడుగా ఉంటారు.


షంషుద్దీన్‌ రెండుసార్లు లక్షల్లో అప్పులు చేయాల్సి వచ్చింది. గడచిన ఏడాది జనవరిలో షంషుద్దీన్‌, కరీమా దంపతులు మచిలీపట్నంలో ఓ వివాహ శుభకార్యానికి వెళ్లారు. తిరిగి వస్తుండగా గుర్తుతెలియని వాహనం ఢీ కొట్టింది. ఈ సమయంలో ఇద్దరికి ఆస్పత్రుల ఖర్చు రూ.3లక్షల వరకు అయ్యాయి. తర్వాత కుమార్తె వివాహం కోసం మరోసారి అప్పులు చేయాల్సి వచ్చింది. లాక్‌డౌన్‌ కారణంగా రెండు నెలలుగా షంషుద్దీన్‌ ఖాళీగా ఉంటున్నాడు. ఇల్లు గడిచే పరిస్థితి కనిపించడం లేదు. ఇంకోవైపు తీసుకున్న అప్పులకు వడ్డీలు చెల్లించాలని ఒత్తిళ్లు పెరిగాయి. ఇవన్నీ ఆ కుటుంబంలో చిచ్చును రేపాయి. భార్యాభర్తలిద్దరి మధ్య వివాదాలకు కారణమయ్యాయి. 


రోడ్డు ప్రమాదం తర్వాత నుంచీ కరీమా నిరుత్సాహంగా కనిపిస్తోందని స్థానికులు చెబుతున్నారు. తొమ్మిదో తరగతి వరకు చదువుకున్న నూరుద్దీన్‌కు తల్లి అంటే అమితమైన ఇష్టం. ఎక్కువ సమయం ఆమెతోనే గడిపేవాడు. సోమవారం సాయంత్రం కరీమా ఇంట్లో ఉన్న బంగారం శుద్ధి చేసే ద్రావణాన్ని తాగి చనిపోయిందన్న విషయం అతడి బాగా కలిచివేసింది. అమ్మే ప్రాణం అనుకున్న అతడు అమ్మ లేని జీవితం తనకు అంధకారం అనుకున్నాడు. కరీమా మృతదేహానికి మంగళవారం పోస్టుమార్టం నిర్వహించాల్సి ఉండగా, తల్లిలాగే తానూ బంగారం శుద్ధి చేసే ద్రావణాన్ని తాగి ప్రాణాలు తీసుకున్నాడు. నూరుద్దీన్‌ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించగా, కరీమా మృతదేహం పోస్టుమార్టం పూర్తిచేసుకుని మంగళవారం సాయంత్రం ఇంటికి వచ్చింది. ఈ ఘటన జక్కంపూడి కాలనీలో ఉన్న కుటుంబాలను కలచివేసింది.

Updated Date - 2020-05-20T17:10:00+05:30 IST