మృత్యువులోనూ తండ్రి వెంటే.. స్ర్కాప్‌ మాటున.. మృత్యువు కాటు

ABN , First Publish Date - 2020-09-04T14:29:53+05:30 IST

స్ర్కాప్‌ వ్యాపారం చేసే తండ్రికి తోడుగా ఉందామని వెళ్లిన బిడ్డ తండ్రితోపాటే కానరాని లోకాలకు వెళ్లిపోయాడన్న వార్త ఆ తల్లికి తీరని దుఃఖాన్ని మిగిల్చింది. సూరంపల్లి పారిశ్రామికవాడలో గురువారం జరిగిన పేలుడులో అజిత్‌సింగ్‌నగర్‌ వాంబేకాలనీకి చెందిన తండ్రీ కొడుకులు

మృత్యువులోనూ తండ్రి వెంటే.. స్ర్కాప్‌ మాటున.. మృత్యువు కాటు

తండ్రి, తోడుగా వెళ్లిన కుమారుడు పేలుళ్లలో మృతి

వాంబేకాలనీలో విషాద ఛాయలు

కన్నీరుమున్నీరవుతున్న తల్లి


అజిత్‌సింగ్‌నగర్‌ (కృష్ణ): స్ర్కాప్‌ వ్యాపారం చేసే తండ్రికి తోడుగా ఉందామని వెళ్లిన బిడ్డ తండ్రితోపాటే కానరాని లోకాలకు వెళ్లిపోయాడన్న వార్త ఆ తల్లికి తీరని దుఃఖాన్ని మిగిల్చింది. సూరంపల్లి పారిశ్రామికవాడలో గురువారం జరిగిన పేలుడులో అజిత్‌సింగ్‌నగర్‌ వాంబేకాలనీకి చెందిన తండ్రీ కొడుకులు మృతి చెందడంతో ఆ ప్రాంతంలో విషాదం అలముకుంది. అజిత్‌సింగ్‌నగర్‌ వాంబేకాలనీ ఏ బ్లాకులో నివసిస్తున్న అంధవరపు కోటేశ్వరరావు గన్నవరం మండలం సూరంపల్లి మహిళా పారిశ్రామికవాడలో స్ర్కాబ్‌ కొనుగోలు చేసి, ఆటోనగర్‌లో విక్రయిస్తుంటాడు. ఇతనికి భార్య, కుమారుడు, కుమార్తె ఉన్నారు. కుమార్తెకు ఇటీవలే వివాహం చేశాడు. కుమారుడు చిన్నారావు (17) పదవ తరగతితోనే చదువు ఆపేసి, నగరంలోని ఓ హోటల్లో పని చేసేవాడు. లాక్‌డౌన్‌ కారణంగా హోటళ్లు మూతపడటంతో ఇంటివద్దే ఉంటున్న చిన్నారావు స్ర్కాప్‌ వ్యాపారం చేస్తున్న తండ్రికి చేదోడువాదోడుగా ఉంటున్నాడు.


రోజూ మాదిరిగానే గురువారం ఉదయం సూరపంపల్లి బయలు దేరిన తండ్రికి తోడుగా చిన్నారావు కూడా వెళ్లాడు. అక్కడ స్ర్కాప్‌లో వచ్చిన ఖాళీ రెసీన్‌ కెమికల్‌ డబ్బాల మధ్య బరువుగా ఉన్న ఒక డబ్బాను పగలగొడుతుండగా జరిగిన పేలుడులో తండ్రీ బిడ్డలిద్దరూ మృతి చెందడంతో ఆ ఇంటికి మగదిక్కు లేకుండా పోయింది. ఇంటి నుంచి నవ్వుతూ వెళ్లిన తండ్రీ బిడ్దలు తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయారన్న విషాద వార్త ఆ కుటుంబంతో పాటు వాంబే కాలనీవాసులను తీవ్ర దిగ్ర్భాంతికి గురి చేసింది. భర్తనూ, బిడ్డనూ కోల్పోయి కన్నీరు మున్నీర వుతున్న కోటేశ్వరరావు భార్య ప్రభావతిని చూసి స్థానికులు కంటతడి పెట్టారు.

Updated Date - 2020-09-04T14:29:53+05:30 IST