చిరుతను బంధించేందుకు పాట్లు

ABN , First Publish Date - 2022-01-19T04:53:02+05:30 IST

మండల పరిధిలోని నానక్‌నగర్‌, పిల్లిపల్లిలో చిరుతపులి

చిరుతను బంధించేందుకు పాట్లు

  • బోను, సీసీ కెమెరాలను ఏర్పాటు చేసిన అధికారులు 
  • పశువుల కొట్టాల వద్ద మంటలు


యాచారం :  మండల పరిధిలోని నానక్‌నగర్‌, పిల్లిపల్లిలో చిరుతపులి కలకలంతో ఆ ప్రాంత రైతులు వణికిపోతున్నారు. చిరుత వరుసగా దాడులు చేసి మూగజీవాలను బలి తీసుకుంటుండటంతో స్థానికులు భయపడుతున్నారు. చిరుత నుంచి పశువులకు హాని జరగకుండా ఉండేందుకు సోమవారం రాత్రి దొడ్ల వద్ద మంటలు పెట్టి ఇంటికి చేరుకున్నారు. మంటలకు భయపడి చిరుత రాదనే ఉద్దేశంతో రైతులు ఈ పని చేశారు. కాగా, అటవీశాఖ అధికారులు చిరుతపులిని బంధించడం కోసం  పిల్లిపల్లిలో బోన్‌ను ఏర్పాటు చేశారు. అందులో ఆవుదూడ కళేబరంతోపాటు కుక్కను బోన్‌లో ఉంచారు. మూడు చోట్ల సీసీ కెమెరాలు బిగించారు. కానీ చిరుతపులి ఆ ప్రదేశానికి రాలేదు. కాగా, ఆవుదూడను సగానికి పైగా తినడంతో దానికి ఆకలి వేయక తిరిగి రాకపోయించడొచ్చని అటవీశాఖ రేంజర్‌ నిఖిల్‌రెడ్డి తెలిపారు. బోన్‌ను మంగళవారం రాత్రి కూడా ఆదే ప్రదేశంలో ఉంచామని ఆయన చెప్పారు. కాగా చిరుతపులి భయంతో రైతులు సాయంత్రం ఆరుగంటలకే ఇంటిదారి పడుతున్నారు. రాత్రివేళ పిల్లిపల్లి, తాడిపర్తి, నానక్‌నగర్‌ తదితర గ్రామాలలో పెట్రోమొబైల్‌ టీం పర్యటించి పరిస్థితిని సమీక్షిస్తోంది. రైతులు అప్రమత్తంగా ఉండాలని యాచారం తహసీల్దారు నాగయ్య, సీఐ లింగయ్య విజ్ఞప్తి చేశారు. 


Updated Date - 2022-01-19T04:53:02+05:30 IST