Sonia Angry With Gehlot: సోనియా కన్నెర్ర.. గెహ్లాట్ సీఎం పదవి కూడా కోల్పోతారా?

ABN , First Publish Date - 2022-09-27T21:42:55+05:30 IST

న్యూఢిల్లీ: కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికల వేళ గెహ్లాట్ వర్గం చేసిన ఓవర్ యాక్షన్‌పై సోనియా కన్నెర్ర చేశారా?

Sonia Angry With Gehlot: సోనియా కన్నెర్ర.. గెహ్లాట్ సీఎం పదవి కూడా కోల్పోతారా?

సోనియాతో సచిన్ పైలట్ భేటీ.. ముఖ్యమంత్రి పదవి దక్కేనా? 

న్యూఢిల్లీ: కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికల వేళ గెహ్లాట్ వర్గం చేసిన ఓవర్ యాక్షన్‌పై సోనియా కన్నెర్ర చేశారా? కాంగ్రెస్ అధ్యక్ష పదవి దేవుడెరుగు గెహ్లాట్ సీఎం పదవి కూడా కోల్పోనున్నారా? అక్టోబర్ 17న జరగనున్న కాంగ్రెస్ అధ్యక్ష పదవి రేసులో అందరికంటే ముందున్న అశోక్ గెహ్లాట్‌ తాను ఢిల్లీ వెళ్లిపోయినా రాజస్థాన్‌పై తన పట్టుండాలని కోరుకున్నారు. దీంతో తన వర్గీయుడినే సీఎం చేయాలని అధిష్టానానికి షరతులు పెట్టారు. గెహ్లాట్ మద్దతుదారులైన 93 మంది ఎమ్మెల్యేలు ఇప్పటికే తమ రాజీనామా లేఖలను రాజస్థాన్ స్పీకర్ సీపీ జోషికి అందజేశారు. అంతేకాదు తాము చెప్పినవారినే సీఎం చేయాలని, గతంలో ప్రభుత్వాన్ని కూలగొట్టాలని యత్నించిన సచిన్ పైలట్‌ను మాత్రం చేయవద్దని వారంటున్నారు. నిజానికి సచిన్ పైలట్‌ను సీఎం చేయాలని కాంగ్రెస్ అధిష్టానం యోచించింది. అయితే అందరి సమ్మతితో చేయాలని కోరుకుంది. అందుకే అజయ్ మాకెన్‌ను, మల్లికార్జున ఖర్గేను పరిశీలకులుగా జైపూర్ పంపింది. కానీ ఎమ్మెల్యేలెవ్వరూ వారిని కలవలేదు. పైగా సచిన్ పైలట్ వద్దే వద్దంటూ వారు హోటళ్లకు పరిమితమయ్యారు. ఈ తరుణంలో తాను కూడా ఏమీ చేయలేనంటూ గెహ్లాట్ చేతులెత్తేయడంతో కాంగ్రెస్ అధిష్టానానికి కోపం వచ్చేసింది. పరిశీలకులుగా పంపిన అజయ్ మాకెన్‌ను, మల్లికార్జున ఖర్గేను ఢిల్లీ రావాలని కోరింది. ఢిల్లీ వచ్చిన ఖర్గే, మాకెన్ జరిగిందంతా చెప్పారు. కాంగ్రెస్ అధ్యక్షుడు కాకముందే అశోక్ గెహ్లాట్ వేసిన ఎత్తులు అధిష్టానానికి సహజంగానే కోపం తెప్పించాయి. అందుకే కాంగ్రెస్ అధ్యక్ష పదవికి గెహ్లాట్ కాకుండా ఇతర పేర్లను పరిశీలించడం మొదలుపెట్టింది. కమల్‌నాథ్‌ను ఇప్పటికే  ఢిల్లీకి పిలిచారు. శశిథరూర్ ఈ నెల 30న నామినేషన్ దాఖలు చేయనున్నారు. దిగ్విజయ్ కూడా రంగంలోకి దిగే అవకాశం ఉంది. పవన్ బన్సల్, ముఖుల్ వాస్నిక్, కుమారి సెల్జా పేర్లను కూడా కాంగ్రెస్ అధిష్టానం పరిశీలిస్తోంది. దీంతో అశోక్ గెహ్లాట్ అతి చేసి అడ్డం పడినట్లుగా పరిశీలకులు భావిస్తున్నారు. సచిన్ పైలట్‌కు చెక్ పెట్టాలనుకుని తనకు తానే గొయ్యి తవ్వుకున్నారు. తన చేష్టలతో కాంగ్రెస్ అధిష్టానానికి కోపం వచ్చేలా చేశారు. కాంగ్రెస్ అధ్యక్ష పదవికి ఎన్నికలయ్యేదాకా తానే సీఎంగా కొనసాగుతానని కూడా గెహ్లాట్ చెప్పడంతో అధిష్టానానికి కోపం నషాళానికంటింది. దీంతో గెహ్లాట్‌కు చెక్ పెట్టేందుకు అధిష్టానం వ్యూహం రచిస్తోంది. 


మరోవైపు సచిన్ పైలట్ ఢిల్లీకి చేరుకున్నారు. కాంగ్రెస్ అధిష్టానంతో చర్చల్లో భాగంగా సోనియా, అజయ్ మాకెన్‌, మల్లికార్జున ఖర్గేతో పైలట్ చర్చలు జరపనున్నారు. విధేయంగా ఉన్న పైలట్‌ను సీఎం చేయడం కోసం అశోక్ గెహ్లాట్ వర్గీయులను దారిలోకి తెచ్చుకునే యత్నాలు కాంగ్రెస్ అధిష్టానం ముమ్మరం చేసింది. గెహ్లాట్ సన్నిహితుడైన మంత్రి ప్రతాప్‌ సింగ్‌పై సస్పెన్షన్ వేటు వేసింది. మరికొందరిపైనా వేటుకు రంగం సిద్ధం చేసింది. అధిష్టానం ఆగ్రహం చూసిన గెహ్లాట్ వర్గీయులంతా నెమ్మదిగా దారిలోకి రావడం మొదలుపెట్టారు. బెట్టు సడలించి సచిన్ పైలట్‌‌ను సీఎం చేసేందుకు మద్దతివ్వడానికి సన్నద్ధులౌతున్నారు. 



Updated Date - 2022-09-27T21:42:55+05:30 IST