కెప్టెన్‌ 78 మంది ఎమ్మెల్యేల మద్దతు కోల్పోయారు: కాంగ్రెస్

ABN , First Publish Date - 2021-10-03T01:27:48+05:30 IST

పంజాబ్ సీఎం పదవికి కెప్టెన్ అమరీందర్ సింగ్‌ ఏ పరిస్థితుల్లో రాజీనామా చేయాల్సి వచ్చిందో కాంగ్రెస్..

కెప్టెన్‌ 78 మంది ఎమ్మెల్యేల మద్దతు కోల్పోయారు: కాంగ్రెస్

న్యూఢిల్లీ: పంజాబ్ సీఎం పదవికి కెప్టెన్ అమరీందర్ సింగ్‌ ఏ పరిస్థితుల్లో రాజీనామా చేయాల్సి వచ్చిందో కాంగ్రెస్ పెదవి విప్పింది. అమరీందర్ సింగ్ రాజీనామాకు పార్టీ అధ్యక్షురాలు సోనియాగాంధీ ఎంతమాత్రం కారణం కాదని, ఆయనను తొలగించాలని 78 మంది ఎమ్మెల్యేలు కోరడమే కెప్టెన్ రాజీనామాకు దారితీసిందని ఆ పార్టీ సీనియర్ నేత రణ్‌దీప్ సింగ్ సూర్జేవాలా శనివారంనాడు వెల్లడించారు. ఏ ముఖ్యమంత్రి అయినా ఎమ్మెల్యేల విశ్వాసాన్ని కోల్పోయినట్టయితే ఆయన ఆ పదవి నుంచి దిగిపోవాల్సి ఉంటుందని అన్నారు. 79 మంది ఎమ్మెల్యేలలో 78 మంది ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రిని మార్చాలంటూ లేఖలు రాశారని చెప్పారు. అలాంటి పరిస్థితుల్లో సీఎంను మార్చకుంటే అది నియంతృత్వమవుతుందని సూర్జేవాలా పేర్కొన్నారు. ''78 మంది ఎమ్మెల్యేలు ఒకవైపు, సీఎం ఒక్కరూ ఒకవైపు ఉన్నప్పుడు ఎమ్మెల్యేల మాటలు వినాలా వద్దా?'' అని సూర్జేవాలా ప్రశ్నించారు.


కాంగ్రెస్ అధినాయకత్వం తనను అవమానించిందంటూ కెప్టెన్ అమరీందర్ ఇటీవల సీఎం పదవికి రాజీనామా చేసిన అనంతరం వ్యాఖ్యానించారు. అమరీందర్ సింగ్ స్థానంలో చరణ్‌ జిత్ సింగ్ చన్నీ కాంగ్రెస్ లెజిస్లేచర్ పార్టీ నేతగా ఏకగ్రీవంగా ఎన్నికకావడంతో ఆయన సీఎం పగ్గాలు చేపట్టారు.

Updated Date - 2021-10-03T01:27:48+05:30 IST