జాతి యావత్తూ కార్మికుల కష్టాలు గుర్తించింది... కానీ కేంద్రం మాత్రం : సోనియా గాంధీ

ABN , First Publish Date - 2020-05-28T18:54:35+05:30 IST

కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వంపై కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ మరోసారి ధ్వజమెత్తారు. లాక్‌డౌన్

జాతి యావత్తూ కార్మికుల కష్టాలు గుర్తించింది... కానీ కేంద్రం మాత్రం : సోనియా గాంధీ

న్యూఢిల్లీ : కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వంపై కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ మరోసారి ధ్వజమెత్తారు. లాక్‌డౌన్ కారణంగా తీవ్రంగా ఇబ్బందులు పడుతున్న వలస కార్మికుల దుస్థితి కేంద్రానికి ఏమాత్రం పట్టడం లేదని తీవ్రంగా మండిపడ్డారు. దేశంలోని ప్రతి పేద కుటుంబానికి వచ్చే ఆరు నెలల పాటు 7,500 రూపాయల చొప్పున నగదును కేంద్రం ఉదారంగా అందించాలని ఆమె డిమాండ్ చేశారు.


కాంగ్రెస్ పార్టీ గురువారం నుంచి దేశ వ్యాప్తంగా పేదలు, కార్మికులు, చిన్న, మధ్య తరహా పరిశ్రమల దురవస్థపై గొంతెత్తే క్రమంలో భాగంగా ఓ క్యాంపేయిన్‌ను చేపట్టింది. అందులో భాగంగా సోనియా గాంధీ పై కామెంట్లు చేశారు. దేశంలో కరోనా వ్యాప్తి సోకడంతో కేంద్రం లాక్‌డౌన్ విధించిందని, దీంతో రెండు నెలలుగా దేశ ఆర్థిక వ్యవస్థ ఊబిలో కూరుకుపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు.


‘‘వలస కార్మికులు పాదాలకు ఎలాంటి రక్షణా లేకుండా, పాద రక్షలు లేకుండా వందల కిలోమీటర్లు నడిచి వెళ్ళిపోతున్నారు. వలస కార్మికులు, పేద ప్రజలు నానా అవస్థలూ పడుతున్నారు. దేశానికి స్వాతంత్య్రం సిద్ధించిన తర్వాత ఇంతటి వ్యధ అనుభవించడం ఇదే ప్రథమం. వలస కార్మికుల దీనావస్థ, దుస్థితి దేశం మొత్తం గ్రహించింది. కానీ కేంద్రం మాత్రం గ్రహించడం లేదు.’’ అని సోనియా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.


లాక్‌డౌన్ కారణంగా చాలా పరిశ్రమలు మూతపడ్డాయని, చాలా మంది తమ ఉద్యోగాలను కోల్పోయి రోడ్డున పడ్డారని, రైతులు కూడా చాలా ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు. దేశంలోని పేదలు, వలస కార్మికుల అవస్థలను దూరం చేయాల్సిన సమయం ఇదేనని, కాంగ్రెస్ నేతలు, మేధావులు, దేశంలోని ప్రముఖులు మొదటి నుంచీ మొత్తుకుంటూనే ఉన్నారని, మోదీ ప్రభుత్వం మాత్రం వారికి సహాయం చేయడానికి ఏమాత్రం సిద్ధంగా లేదని విమర్శించారు. కాంగ్రెస్ పక్షాన పేద ప్రజల గొంతుక వినిపించడానికి తాము సిద్ధమయ్యామని సోనియా స్పష్టం చేశారు.


పేద ప్రజల కుటుంబాలకు, వలస కార్మికుల కుటుంబాలకు మరో ఆరు నెలల పాటు నెలకు 7,500 రూపాయలను అందించాలని, అంతేకాకుండా వారి వారి బ్యాంకు అకౌంట్లలో పదివేల చొప్పున కేంద్రం జయ చేయాలని ఆమె డిమాండ్ చేశారు. లాక్‌డౌన్ కారణంగా తీవ్రంగా ఇబ్బందులు పడుతున్న వలస కార్మికులు తమ తమ స్వస్థలాలకు కేంద్రమే ఉచితంగా చేర్చాలని, వారు క్షేమంగా చేరుకునేలా చూసే బాధ్యత కేంద్రానిదే అని, అలాగే వారికి ఉపాధి అవకాశాలు కూడా కేంద్ర ప్రభుత్వమే కల్పించాలని సోనియా గాంధీ డిమాండ్ చేశారు. 

Updated Date - 2020-05-28T18:54:35+05:30 IST