కోవిడ్-19 కట్టడికి గట్టి చర్యలు తీసుకోవాలి : సోనియా గాంధీ

ABN , First Publish Date - 2021-04-17T20:00:21+05:30 IST

కోవిడ్-19 మహమ్మారి సెకండ్ వేవ్‌ను ఎదుర్కొనేందుకు పటిష్ట

కోవిడ్-19 కట్టడికి గట్టి చర్యలు తీసుకోవాలి : సోనియా గాంధీ

న్యూఢిల్లీ : కోవిడ్-19 మహమ్మారి సెకండ్ వేవ్‌ను ఎదుర్కొనేందుకు పటిష్ట వ్యూహాలను రూపొందించాలని కేంద్ర ప్రభుత్వాన్ని కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ డిమాండ్ చేశారు. దేశవ్యాప్తంగా వైద్య రంగంలో మౌలిక సదుపాయాలు, వ్యాక్సిన్లు, మందుల కొరత తీవ్రంగా ఉందని దుయ్యబట్టారు. శనివారం జరిగిన కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ) సమావేశంలో కోవిడ్-19 మహమ్మారిపై చర్చించారు. ఈ సమావేశంలో వయనాద్ ఎంపీ రాహుల్ గాంధీ, కాంగ్రెస్ జనరల్ సెక్రటరీలు, రాష్ట్రాల కాంగ్రెస్ ఇన్‌ఛార్జులు పాల్గొన్నారు. 


కోవిడ్-19 మరింత విస్తరించకుండా తీసుకోవలసిన చర్యల గురించి ఈ సమావేశంలో చర్చించారు. కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులతో సమావేశమైన తర్వాత సోనియా గాంధీ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి రాసిన లేఖపై కూడా చర్చ జరిగింది. సహాయం అందించాలని కాంగ్రెస్ ముఖ్యమంత్రులు ప్రధాని మోదీని కోరారని, సంబంధిత మంత్రికి కూడా లేఖలు రాశారని సోనియా గాంధీ చెప్పారు. కొన్ని కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో వ్యాక్సిన్ల కొరత చాలా ఉందని తెలిపారు. కొద్ది రోజులకు సరిపడినంత వ్యాక్సిన్ మాత్రమే అందుబాటులో ఉందని, ఆక్సిజన్ లేదని, వెంటిలేటర్లు లేవని చెప్పారు. ప్రభుత్వం మాత్రం చాలా నిశ్శబ్దంగా ఉందని ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వం నుంచి కొన్ని రాష్ట్రాలకు ప్రాధాన్యం దక్కుతోందని మండిపడ్డారు. 


ప్రతిపక్షం నిర్మాణాత్మక సలహాలు ఇస్తోందని, ఈ సలహాలను వినకుండా, సలహాలిస్తున్న ప్రతిపక్షాలపై దాడి చేసేందుకు కేంద్ర మంత్రులను నియోగిస్తున్నారని దుయ్యబట్టారు. ఈ విధంగా ‘‘నువ్వా, నేనా’’ అనే చర్చలు సమంజసం కాదన్నారు. ఇటువంటి చర్చలు అవసరం లేదన్నారు. 


Updated Date - 2021-04-17T20:00:21+05:30 IST