శివ.. సోనూ...ఓ అంబులెన్స్‌

ABN , First Publish Date - 2021-01-20T13:34:43+05:30 IST

మనసున్న మహారాజు ట్యాంక్‌బండ్‌ శవాల శివ.... తనకు కుటుంబపోషణ కోసం దాతలు ఇచ్చిన విరాళాన్ని దుర్వినియోగం చేయలేదు

శివ.. సోనూ...ఓ అంబులెన్స్‌

 ట్యాంక్‌బండ్‌లో దూకేవారిని కాపాడే శివ ..   

 మరో ఆలోచన.. పేదలకు అంబులెన్స్‌ 

 ప్రారంభించిన నటుడు సోనుసూద్‌  


హైదరాబాద్: మనసున్న మహారాజు ట్యాంక్‌బండ్‌ శవాల శివ.... తనకు కుటుంబపోషణ కోసం దాతలు ఇచ్చిన విరాళాన్ని దుర్వినియోగం చేయలేదు. ఆ విరాళాలతో ఓ అంబులెన్స్‌ కొనుగోలు చేశారు. ఆపదలో ఉన్న నిరుపేదలను ఆదుకోవడానికి ఈ అంబులెన్స్‌ను కొనుగోలుచేశాడు. దానికి ప్రముఖ సినీనటుడు, సమాజ సేవకుడు సోనుసూద్‌ అంబులెన్స్‌ సర్వీస్‌ అని నామకరణం చేశాడు. ఈ అంబులెన్స్‌ ప్రారంభానికి సోనుసూద్‌నే ఆహ్వానించాడు కూడా. షూటింగ్‌లో ఉన్న సోనుసూద్‌ నేరుగా శివ వద్దకు చేరుకొని అంబులెన్స్‌కు పూజలు చేసి ప్రారంభించారు. స్ఫూర్తిని రగిలించే ఈ సంఘటన మంగళవారం ట్యాంక్‌బండ్‌పై లేపాక్షి వద్ద జరిగింది. ట్యాంక్‌బండ్‌పైనే ఒక రూములో నివాసం ఉండే శివ ట్యాంక్‌బండ్‌లోకి దూకి ఆత్మహత్యలు చేసుకునే వారిని ఎంతోమందిని కాపాడాడు. అంతేకాకుండా ట్యాంక్‌బండ్‌లో దూకి చనిపోయిన వారి శవాలను బయటకు తీసుకువస్తాడు. అందుకే అతనికి ట్యాంక్‌బండ్‌ శవాల శివగా పేరు వచ్చింది.  అంతేకాదు.. శివ ఓ అంబులె న్స్‌ ద్వారా ఇప్పటికే సేవలు అందిస్తున్నారు. అమెరికాలో స్థిరపడిన ఓ ప్రవాస భారతీయురాలు శివ సేవలను గుర్తించి బ్యాంక్‌ అకౌంట్‌ తెరిపించింది. ఆమెతోపాటు మరికొంతమంది శివకు సహాయం చేయడానికి ముందుకు వచ్చి విరాళాలు అందించారు. అందిన విరాళాలతో శివ మరొక అంబులెన్స్‌ను కొనుగోలు చేసి దానినీ సేవారంగంలోకి దింపాడు. ఈ అంబులెన్స్‌తో మరికొంతమందికి సేవలు  అందించాలని భావించాడు. ఈ అంబులెన్స్‌కు సినీనటులు సోనుసూద్‌ అంబులెన్స్‌ సర్వీస్‌ పేరు పెట్టడమే కాక ఆయనను స్వయంగా ఆహ్వానించాడు. సినిమాషూటింగ్‌లో భాగంగా విదేశాలకు వెళ్లిన సోనుసూద్‌ నేరుగా హైదరాబాద్‌ ట్యాంక్‌బండ్‌కు వచ్చాడు. తన అభిమాని తన పేరుతో ఏర్పాటు చేసిన అంబులెన్స్‌ను ముషీరాబాద్‌ ఎమ్మెల్యే ముఠాగోపాల్‌తో కలిసి ప్రారంభించారు. అంబులెన్స్‌ ప్రారంభానికి ముందు సోనుసూద్‌ లేపాక్షి వద్ద గల అమ్మవారి ఆలయంలో పూజలు నిర్వహించారు. 


శివను ఆదర్శంగా తీసుకోవాలి..

ఈ సందర్భంగా సోనుసూద్‌ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ శివను ఆదర్శంగా తీసుకొని సేవా కార్యక్రమాలను మరింత  విస్తృతం చేయాలని, నిరుపేదలను ఆదుకోవాలని సూచించారు. సేవా కార్యక్రమాలు చేయడంలో శివకు ఎలాంటి అవసరం ఉన్నా తాను తీరుస్తానని హామీ ఇచ్చారు.  ట్యాంక్‌బండ్‌ శవాల శివ మాట్లాడుతూ లాక్‌డౌన్‌లో ఎంతో మంది నిరుపేదలకు సహాయం అందించిన సోనుసూద్‌ మనిషిరూపంలో ఉన్న దేవుడని అన్నారు. చిన్న మెసేజ్‌ పంపితే ఫోన్‌ చేసి అంబులెన్స్‌ ప్రారంభోత్సవానికి వస్తున్నానని చెప్పి రావడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో టీఆర్‌ఎస్‌ యువజన నాయకులు ముఠా జైసింహ, కట్టమైసమ్మ దేవాలయ అర్చకులు సాత్విక్‌ శర్మ,  ఫిష్‌ వెంకట్‌,  శవాల శివ కుటుంబసభ్యులు, సోనుసూద్‌ అభిమానులు పాల్గొన్నారు. సోనుసూద్‌ ట్యాంక్‌బండ్‌కు వచ్చిన సమయంలో ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పోలీసులు, ట్రాఫిక్‌ పోలీసులు బందోబస్తు నిర్వహించారు.  

Updated Date - 2021-01-20T13:34:43+05:30 IST