సోనూసూద్ ఆపన్నహస్తం
ABN , First Publish Date - 2020-12-02T05:30:00+05:30 IST
సోనూసూద్ ఆపన్నహస్తం
షాద్‌నగర్/చౌదరిగూడ: చౌదరిగూడ మండలం వీరన్నపేటకు చెందిన ఓ పేద దంపతులు తమ 11 నెలల బాబు అనారోగ్యం బారిన పడడంతో డబ్బుల్లేక ఆపన్నహస్తం కోసం చూస్తున్నారు. ఈ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా తెలుసుకున్న సినీ నటుడు సోనూసూద్ బాబు చికిత్సకయ్యే ఖర్చు తాను భరిస్తానని ముందుకు వచ్చారు. వీరన్నపేటకు చెందిన రాములు-కవితలకు గత జనవరిలో బాబు పుట్టాడు. మూడు నెలకే అనారోగ్యానికి గురికావడంతో వారు హైదరాబాద్‌లోని ప్రైవేట్ ఆసుపత్రిలో చూపించారు. సుమారు రెండు లక్షల దాకా ఖర్చు చేశారు. బాబు ఆరోగ్యం బాగా లేదని, మరో మూడు లక్షలు ఖర్చవుతాయని వైద్యులు చెప్పారు. రాములుకు సినిమా పరిశ్రమలో పనిచేసే కొందరు తెలిసి ఉండడంతో ఈ విషయాన్ని వారికి చెప్పాడు. బాబు విషయం తెలుసుకున్న సోనూసూద్ బుధవారం సాయంత్రం రాములు, కవితలను బంజారాహిల్స్‌లోని ఓ హోటల్లో కలవమని కబురు పంపాడు. దీంతో వారు నగరానికి వెళ్లి సోనూసూద్‌ను కలిశారు. సోనూసూద్ ఆపోలో ఆసుపత్రి డాక్టర్లతో ఫోన్లో మాట్లాడి మొత్తం ఖర్చు తానే భరిస్తానని బాబుకు వైద్యం చేయాలని కోరారు. దీంతో రాములు దంపతులు ఆయనకు కృతజ్ఞతలు తెలిపారు. గురువారం బాబును అపోలో ఆసుపత్రిలో చేర్పిస్తామని రాములు ఆంధ్రజ్యోతికి తెలిపారు. గతంలోనూ తమకు ఇద్దరు పాపలు జన్మించి 10, 12నెలలలోపే మృతి చెందినట్లు రాములు తెలిపారు.