Apr 11 2021 @ 14:21PM

మహేష్ కథతో సోనూసూద్..?

సినిమా ఇండస్ట్రీలో ఒక హీరో కోసం అనుకున్న కథ మరొక హీరో చేయడం చాలా కామన్. కథ మొత్తం విన్న తర్వాత ఇది నాకంటే ఆ హీరో అయితే సూపర్ హిట్ అవుతుందని దర్శక, రచయితలకి స్వయంగా హీరోలే సలహాలిచ్చిన సందర్భాలు తరచూ జరుగుతున్నవే. పవన్ కళ్యాణ్ చేయాల్సిన 'పోకిరి' మహేష్ బాబు చేసి ఇండస్ట్రీ హిట్ కొట్టాడు. అలాగే 'ఇట్లు శావణి సుబ్రమణ్యం' సినిమా కథ కూడా ముందు పవన్‌తో చేయాలనుకున్న పూరి.. ఆ తర్వాత రవితేజతో చేసి హిట్ కొట్టాడు. 'అరవింద సమేత' కథ కూడా త్రివిక్రం పవన్ కోసం తయారు చేశాడని అయితే స్వయంగా ఈ కథ నేను చేసే దానికంటే తారక్ చేస్తే చాలా బావుంటుందని పవన్ సలహా ఇచ్చినట్టు వార్తలు వచ్చాయి. నిజంగా తారక్ చేసిన 'అరవింద సమేత' మంచి కమర్షియల్ హిట్‌గా నిలిచింది.

కాగా గత కొంతకాలంగా డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాధ్ 'జనగణమన' సినిమా చేయాలని ప్లాన్ చేసుకుంటున్నప్పటికి ఎందుకనో ఈ ప్రాజెక్ట్ హోల్డ్‌లోనే ఉంటోంది. వాస్తవంగా ఈ కథ మహేష్ కోసం సిద్దం చేశాడు పూరి. కానీ కథ మహేష్‌కి నచ్చలేదన్న కారణంగా హోల్డ్‌లో పడింది. ఆ తర్వాత ఇదే కథని వేరే హీరోలతో చేసేందుకు పూరి జగన్నాధ్ సన్నాహాలు చేస్తునట్టు వార్తలు వచ్చాయి. కానీ అవన్నీ గాసిప్స్‌గానే మిగిలిపోయాయి. తాజాగా పూరి జగన్నాధ్ 'జనగణమన' సోనూసూద్‌తో తీయాలని సన్నాహాలు చేస్తునట్టు సమాచారం. 'జనగణమన' పూరి డ్రీం ప్రాజెక్ట్ అని పలు సందర్భాలలో చెప్పుకొచ్చిన సంగతి తెలిసిందే. మరి ఈ డ్రీం ప్రాజెక్ట్ ఎప్పుడు పట్టాలెక్కనుందో చూడాలి. నిజంగా పూరి గనక 'జనగణమన' సోనూసూద్‌తో చేస్తే సంచలనం అవడం గ్యారెంటీ అంటున్నారు.