త్వరలో గ్రీన్‌జోన్‌

ABN , First Publish Date - 2020-05-09T10:16:03+05:30 IST

జిల్లాలో కరోనా పూర్తిస్థాయిలో కట్టడిలో ఉండడంతో త్వరలో గ్రీన్‌జోన్‌లోకి మారనున్నది.

త్వరలో గ్రీన్‌జోన్‌

23 రోజుల్లో కొత్తగా కరోనా కేసు నమోదు కాలేదు

జగిత్యాల లింక్‌లో ఐదుగురికి నెగెటివ్‌ 

లాక్‌డౌన్‌ సడలింపులతో తెరుచుకున్న దుకాణాలు 


(ఆంధ్రజ్యోతి ప్రతినిధి, కరీంనగర్‌): జిల్లాలో కరోనా పూర్తిస్థాయిలో కట్టడిలో ఉండడంతో త్వరలో గ్రీన్‌జోన్‌లోకి మారనున్నది. వరుసగా 21 రోజుల్లో కొత్తగా ఒక్క కరోనా కేసు నమోదు కాని పక్షంలో ప్రస్తుతం ఉన్న ఆరెంజ్‌ జోన్‌ను కేంద్ర ప్రభుత్వం గ్రీన్‌జోన్‌గా మార్చుతుంది. గడిచిన 23 రోజులుగా ఒక్క కరోనా పాజిటివ్‌ కేసు కూడా నమోదు కాకలేదు. దీనితో రాష్ట్ర ప్రభుత్వం జిల్లాలోని తాజా పరిస్థితులను కేంద్ర ప్రభుత్వానికి నివేదించిన వెంటనే రెండు, మూడు రోజుల్లో కరీంనగర్‌ గ్రీన్‌జోన్‌గా మారుతుందని భావిస్తున్నారు. జిల్లాకు మత ప్రచారం కోసం వచ్చిన ఇండోనేషియన్ల బృందంతోపాటు మర్కజ్‌కు వెళ్ళి వచ్చిన వారి లింక్‌తో కలిపి జిల్లాలో మొత్తం 19 మంది కరోనా వ్యాధి సోకగా 18 మంది చికిత్స తర్వాత కోలుకొని డిశ్చార్జి అయ్యారు.


గత నెల 15వ తేదీన చిట్టచివరి పాజిటివ్‌ కేసు వచ్చిన ఒకే ఒక వ్యక్తి మాత్రమే హైదరాబాద్‌ గాంధీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. జిల్లాలో కరోనా వ్యాధి పూర్తిగా కట్టడిలోకి వచ్చిందని అంతా భావిస్తున్న తరుణంలో జగిత్యాల జిల్లాకు చెందిన ఒకరికి ఈ నెల 3వ తేదీన కరోనా వ్యాధి సోకడం, ఆ వ్యక్తి కరీంనగర్‌లోని ఓ ప్రైవేట్‌ ఆసుపత్రిలో ఐదురోజులపాటు చికిత్స పొందడంతోపాటు ఓ ప్రైవేట్‌ డయాగ్నస్టిక్‌ సెంటర్‌లో పరీక్ష చేయించుకోవడంతో జిల్లాలో మరోసారి కలకలం మొదలైంది. అయితే కరోనా పాజిటివ్‌ వచ్చిన వ్యక్తికి ప్రైవేట్‌ ఆసుపత్రిలో చికిత్స చేసిన డాక్టర్లు, పారామెడికల్‌ సిబ్బందితోపాటు ఆయనతో సన్నిహితంగా మెదలిన మరో ఇద్దరు, వారి కుటుంబసభ్యులను క్వారంటైన్‌కు తరలించారు.


వీరిలో ఐదుగురి అనుమానితుల నమూనాలను సేకరించి పరీక్ష కోసం పంపించగా శుక్రవారం వారందరికీ కరోనా నెగెటివ్‌ రిపోర్టు రావడం కొంత ఊరట కలిగిస్తున్నది. ప్రస్తుతం జిల్లాలో కరోనా చికిత్సపొందుతున్నది ఒక్కడే కావడం, వరుసగా 21 రోజుల వరకు కొత్తగా ఒక్క పాజిటివ్‌ కేసు కూడా నమోదు కాక పోవడంతో ఈ జిల్లాను గ్రీన్‌జోన్‌లోకి మార్చే అవకాశమున్నది. జిల్లాను రెడ్‌జోన్‌ నుంచి ఆరెంజ్‌ జోన్‌గా తర్వాత గ్రన్‌జోన్‌గా మారు తుండటం జిల్లా ప్రజలకు ఊరటనిచ్చే అంశం.

  

మార్కెట్లలో మొదలైన అమ్మకాలు 

లాక్‌డౌన్‌ సడలింపులతో 45 రోజుల తర్వాత పట్టణాల్లో దుకాణాలు తెరుచుకున్నాయి. రెండురోజులుగా దుకాణాలను తెరచినప్పటికీ ఎండల తీవ్రత, కరోనా భయం నేపథ్యంలో అమ్మకాలు ఇప్పుడిప్పుడే ప్రారంభమయ్యాయని, గతంలో మాదిరిగా అమ్మకాలు జరుగడం లేదని వ్యాపారులు తెలిపారు. భవన నిర్మాణ రంగ పనులు ప్రారంభం కావడంతో దినసరి కూలీలు, కార్మికులు పనులకు వెళ్తూ కొంత ఉపశమనం పొందుతున్నారు. మండల, గ్రామస్థాయిలో లాక్‌డౌన్‌ నిబంధనలను పూర్తిగా సడలించడంతో ఉపాధి హామీ పనులు, వ్యవసాయ పనులతో పల్లెవాసులు బీజీ అయ్యారు. 


 మాస్క్‌లు, భౌతిక దూరానికి చెల్లుచీటి : 

ఈ నెల 29వ తేదీ వరకు లాక్‌డౌన్‌ కొనసాగుతుందని, కరోనా నియంత్రణకు ప్రతి ఒక్కరూ విధిగా మాస్క్‌లు ధరించాలని, భౌతిక దూరం  పాటించాలని ప్రభుత్వం విధించిన నిబంధనలకు ప్రజలు చెల్లుచీటి ఇచ్చారు. 60శాతం మంది మాస్క్‌లు ధరిస్తున్నా దుకాణాలు, మార్కెట్లలో భౌతిక దూరం పాటించడం లేదు. దీనితో కరోనా వైరస్‌ మళ్లీ వ్యాప్తి చెందుతుందని ప్రజలు భయాందోళన చెందుతున్నారు. 


Updated Date - 2020-05-09T10:16:03+05:30 IST