జొన్న కొనుగోళ్లను వెంటనే ప్రారంభించాలి

ABN , First Publish Date - 2021-05-11T06:01:13+05:30 IST

జొన్న కొనుగోళ్లను వెంటనే ప్రారంభించాలి

జొన్న కొనుగోళ్లను వెంటనే ప్రారంభించాలి
రైతులతో మాట్లాడుతున్న ఎంపీ సోయం బాపూరావు

ఎంపీ సోయం బాపూరావు

బోథ్‌ రూరల్‌, మే 10: ప్రభుత్వ సూచనల మేరకే జొన్న పంటను సాగుచేసిన రైతులను రాష్ర ప్రభుత్వం నష్టపరిచే విధంగా వ్యవహరిస్తోందని ఎంపీ సోయం బాపూరావు ఆన్నారు. సోమవారం ఆయన బీజేపీ జిల్లా అధ్యక్షుడు పాయల శంకర్‌తో కలిసి మండలంలో కుచులాపూర్‌, ధన్నూర్‌ గ్రామాల్లోని జొన్న పంటను పరిశీలించి రైతులతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేసీ ఆర్‌ మాయ మాటలు చెప్పి ఇప్పటికే నిరుద్యోగులను, ఉద్యోగులను మోసం చేశారని ఇప్పుడు రైతులను కూడా మోసం చేస్తున్నారని ఆరోపించారు. చేతికొ చ్చిన్న జొన్న పంటను చేనులోనే కుప్పలుగా పోసి అకాల వర్షాలతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, రాష్ట్ర ప్రభుత్వం నేటికీ కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయకపోవడంతో విధిలేని పరిస్థితిలో ప్రైవేట్‌లో తక్కువ ధరకే అమ్ముకుని రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని ఆయన అన్నారు. ప్రభుత్వం తక్షణం స్పందించి మద్దతు ధరతో రైతుల దగ్గర ఉన్న ప్రతి గింజనూ కొనుగోలు చేయాలని లేదంటే రైతులతో కలిసి బీజేపీ ఆధ్వర్యంలో ఆందోళన చేపడుతామని హెచ్చరించారు. బీజేపీ జిల్లా అధ్యక్షుడు పాయల శంకర్‌ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం రైతులపై కక్ష గట్టి వారిని ఇబ్బందులకు గురిచేస్తోందని రైతులు ధర్నా చేస్తే తప్ప ఏ పంటనూ స్వచ్ఛందంగా కొనుగోలు చేయడం లేదని పేర్కొన్నారు. ప్రభుత్వం చెప్పిన పంటను సాగుచేసినా రైతులకు ఇబ్బందులు తప్పడం లేదన్నారు. జొన్న రైతులతో కలిసి మంగళవారం కలెక్టరేట్‌ ఎదుట ధర్నా చేపట్టనున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు రాజు యాదవ్‌, జీవీ, రమణ, వెండి సోమేశ్వర్‌ తదితరులు పాల్గొన్నారు.

ప్రభుత్వం సత్వరమే జొన్న కొనుగోళ్లు చేపట్టాలి..

బోథ్‌ : జిల్లా వ్యాప్తంగా రైతులు యాసంగి కింద సాగు చేసిన జొన్న పంటను ప్రభుత్వం తక్షణమే కొనుగోళ్లు చేపట్టాలని సీపీఐ నాయకులు డిమాండ్‌ చేశారు. సోమవారం విలేకరులతో మాట్లాడుతూ పంట చేతికి వచ్చి 15 రోజులవుతుందని పండించిన పంటంతా చేలలోనే నిలువ ఉంచామని రైతులు వాపోతున్నారన్నారు. గిట్టుబాటు ధరలో పంటను కొనుగోలు చేసి రైతులను ఆదుకోవాలని కోరారు. లేకుంటే రైతుల పక్షాన తమ పార్టీ ధర్నా కార్యక్రమాలను చేపడతామన్నారు. కార్యక్రమంలో సీపీఐ జిల్లా సహాయ కార్యదర్శి బి.గోవర్ధన్‌, నాయకులు ఎస్‌.దాస్‌, ఎస్‌కే శామీర్‌ పాల్గొన్నారు.

Updated Date - 2021-05-11T06:01:13+05:30 IST