Abn logo
Jan 14 2021 @ 02:54AM

బాగు కోరడమే తప్పైతే క్షమించండి

  • పేదల రక్తం తాగుతున్న సీఎం జగన్‌
  • రాష్ట్రంలో మెగా దోపిడీ... అప్పుల ఊబిలో ఏపీ
  • రైతులకు న్యాయం జరిగే వరకూ పోరాటం
  • అన్నదాత కోసమే పోడియం వద్ద కూర్చున్నా
  • పోలీసులు తమ మనస్సాక్షిని 
  • చంపుకొని పనిచేస్తున్నారు: చంద్రబాబు


కంచికచర్ల, జనవరి 13: ‘‘మీ అందరికీ పూనకం వచ్చింది అప్పుడు. ఓట్లు వేశారో ఏం జరిగిందో నాకైతే తెలియదు. నేను ఏం తప్పు చేశానో నాకు తెలియటం లేదు. మిమ్మల్ని అన్ని విధాలా అభివృద్ధి చేయాలని అనుకోవడమే నా తప్పైతే... క్షమించమని మిమ్మల్నందరినీ మరో సారి కోరుకుంటున్నా’’ అని మాజీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. వైసీపీ ప్రభుత్వ నిర్ణయాలతో అన్ని విధాలుగా దెబ్బతిన్న రైతులకు న్యాయం జరిగేంత వరకు పోరాడతానని ఆయన విస్పష్టంగా ప్రకటించారు. కృష్ణా జిల్లా కంచికచర్ల మండలం పరిటాల గ్రామంలో బుధవారం ఉదయం జరిగిన భోగి సంబరాల్లో చంద్రబాబు పాల్గొన్నారు. భోగిపళ్లు పోసి చిన్నారులను ఆశీర్వదించారు. రైతులకు వ్యతిరేకంగా వైసీపీ ప్రభుత్వం తీసుకొచ్చిన జీఓ ప్రతులను భోగి మంటల్లో దగ్ధం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ‘జగన్‌ దుర్మార్గపు పాలన వల్ల రాష్ట్రంలో రైతులు, కూలీలు చితికిపోయారు. రైతుల కోసం మొదటిసారిగా అసెంబ్లీలో పోడియం వద్ద కూర్చున్నా. దీంతో తెల్లారేటప్పటికీ బీమా ప్రీమియం చెల్లింపు జీఓ ఇచ్చారు. పంటలకు గిట్టుబాటు ధర లభించక రైతులు అల్లాడుతుంటే ప్రభుత్వం పట్టించుకోవటం లేదు. ధాన్యం కొనుగోళ్లు బకాయిలు రూ.2,900 కోట్లు చెల్లించలేదు.


రాష్ట్రానికి రెండు కళ్లయిన అమరావతి, పోలవరాన్ని పొడిచేశారు. అమరావతి రైతులు ఏం ద్రోహం చేశారు?’ అని ప్రశ్నించారు. తాను రైతుల కోసం సుబాబుల్‌ పరిశ్రమ తీసుకువస్తే ప్రభుత్వ విధానాల వల్ల వారు పారిపోయే పరిస్థితి వచ్చిందని చెప్పారు. కేవలం అప్పుల కోసమే వ్యవసాయ మీటర్లు పెడుతున్నారని ఆరోపించారు. పెంపుడు జంతువులపైనా పన్నులు వేస్తున్నారని, చివరకు గాలిపైకూడా వేస్తాడంటూ ఎద్దేవా చేశారు. ఇప్పటికే రాష్ట్రం అప్పుల ఊబిలో కూరుకుపోయిందని, ఒక్కొక్కరిపై 70 వేల భారం పడిందని, అప్పులు తీర్చలేక జీవితాంతం ఊడిగం చేయాల్సిన దుస్థితి తీసుకువచ్చారని మండిపడ్డారు. డెకాయిట్‌ పాలనలో టీడీపీ కార్యకర్తలపై ప్రారంభమైన దాడులకు అంతం లేకుండా పోయిందన్నారు. 1350 దాడులు జరిగాయన్నారు. ఎస్‌సీ, బీసీ, మైనార్టీ వర్గాలపై దాడులు చేస్తున్నారని, దేవుళ్లను కూడా వదలటం లేదని, ఇప్పటికే 150 దేవాలయాలపై దాడులు జరిగాయని చెప్పా రు. బ్రహ్మండమైన పోలీస్‌ వ్యవస్థను భ్రష్టు పట్టించారని, ఉద్యోగం కోసం మనస్సాక్షిని చంపుకుని పోలీసులు విధులు నిర్వర్తిస్తున్నారన్నారు. ‘‘రాష్ట్రంలో మెగా దోపిడీ జరుగుతోంది.

సీఎం జగన్‌ పేదల రక్తం తాగుతున్నాడు. అపరిచితుడులా పైశాచిక ఆనందం పొందుతున్నాడు. కూల్చిన ప్రజావేదిక శిఽథిలాలను ఇంత వరకు తీయలేదు. పాదయాత్రలో ముద్దులు పెట్టాడు. ఇప్పుడేమో పిడి గుద్దులు గుద్దుతున్నాడు. మద్యం, ఇసుక.. అన్నీ దోచుకుంటున్నారు. రేషన్‌కార్డులు రద్దు చేస్తున్నారు. పెన్షన్లు తొలగిస్తున్నారు’’ అని చంద్రబాబు మండిపడ్డారు. కార్యక్రమంలో ఎంపీ కేశినేని నాని, మాజీ మంత్రులు రఘురామ్‌, దేవినేని ఉమా, కొల్లు రవీంద్ర, మాజీ ఎంపీ కొనకళ్ల నారాయణ, సీనియర్‌నేత వర్ల రామయ్య తదితరులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement
Advertisement