త్వరలో డీకేటీ స్థలాల క్రమబద్ధీకరణ

ABN , First Publish Date - 2021-08-04T06:19:51+05:30 IST

డీకేటీ స్థలాలను క్రమబద్ధీకరించే దిశగా వారం రోజుల్లో ఉత్తర్వులు వెలువడనున్నాయని మున్సిపల్‌ శాఖామంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు.

త్వరలో డీకేటీ స్థలాల క్రమబద్ధీకరణ
అధికారులతో సమీక్షిస్తున్న మంత్రి బొత్స సత్యనారాయణ

వారంరోజుల్లో ఉత్తర్వులు జారీ చేస్తామన్న మంత్రి 

మఠం స్థలాల జోలికి వెళ్లలేమన్న బొత్స 


తిరుపతి, ఆగస్టు 3 (ఆంధ్రజ్యోతి): డీకేటీ స్థలాలను క్రమబద్ధీకరించే దిశగా వారం రోజుల్లో ఉత్తర్వులు వెలువడనున్నాయని మున్సిపల్‌ శాఖామంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు.  జీవో వచ్చాక ఆసక్తి గలవారు ప్రభుత్వం నిర్ణయించిన ధర చెల్లించి పట్టా తీసుకోవచ్చన్నారు. దీనికి సంబంధించి జియోట్యాగింగ్‌ కూడా చేయాల్సి ఉంటుందన్నారు. తిరుపతిలో జరుగుతున్న అభివృద్ధి పనులపై మంగళవారం ఆయన కార్పొరేషన్‌ కార్యాలయంలో మేయర్‌ శిరీష, డిప్యూటీ మేయర్లు ముద్రనారాయణ, భూమన అభినయ్‌రెడ్డి, కమిషనర్‌ గిరీషతో కలసి సమీక్షించారు. తిరుపతిలో మఠం స్థలాలనూ పరిశీలించగా అభినయ్‌ కోరగా.. ఆ స్థలాల జోలికి మనం వెళ్లలేమని, న్యాయపరమైన సమస్యలు ఉన్నట్టు మంత్రి చెప్పినట్టు సమాచారం. మురికి వాడల్లోని నివాస ప్రాంతాల్లో రూ50, ఇతర ప్రాంతాల్లో రూ90 చొప్పున యూజర్‌ ఛార్జీలు వసూలు చేయాలని ఉత్తర్వులుంటే.. తిరుపతిలో మాత్రం రూ40, రూ60 చొప్పున వసూలు చేయాలని కౌన్సిల్‌లో ఎలా తీర్మానం చేస్తారని మంత్రి ప్రశ్నించినట్టు తెలిసింది. దీనివల్ల పారిశుధ్యానికి అవసరమయ్యే నిధులు ఎలా సమకూరుతాయని అసంతృప్తి వ్యక్తం చేసినట్టు సమాచారం. అంతకుముందు కమిషనర్‌  పవర్‌పాయింట్‌ ప్రజెంటేషన్‌ ద్వారా తిరుపతి స్మార్ట్‌సిటీ అభివృద్ధి పనులను వివరించారు. ప్రకాశం, పద్మావతి పార్కులు అభివృద్ధి చేశామని, వినాయకసాగర్‌, గొల్లవానిగుంట లేక్‌ల అభివృద్ధి త్వరలో పూర్తవుతాయన్నారు. సెప్టెంబరు నెలాఖరుకు బస్టాండు నుంచి కపిలతీర్థం వరకు గరుడవారధిని ప్రారంభించడానికి చర్యలు చేపడుతున్నామన్నారు. సోలార్‌రూఫ్‌ ఎనర్జీ, ఫ్లోటింగ్‌ సోలార్‌ తదితరాలతో విద్యుత్‌ చార్జీలు ఆదా చేస్తున్నామని తెలిపారు. భూగర్భ విద్యుత్‌ కేబులింగ్‌ గుర్తించిన 27వీధుల్లో 60:40నిష్పత్తితో ఎస్‌పీడీసీఎల్‌ సహకారంతో చేపడుతున్నదని వివరించారు. తూకివాకం వద్ద ట్రీట్మెంట్‌ ప్లాంట్‌ నిర్మించామని 25ఎంఎల్‌డీ నీరు పరిశ్రమలకు సరఫరా చేస్తామన్నారు. కొర్లగుంట హైస్కూల్‌ 900మంది చదివేలా భారీ నిర్మాణం చేపట్టామని, కొవిడ్‌కు ముందు బడిపిల్లల కోసం ఈ-హెల్త్‌ ప్రోగ్రాం జరపాలని తెలిపారు. మల్టీ లెవల్‌ కార్‌ పార్కింగ్‌, సిటీ ఆపరేషన్‌ సెంటర్‌, కార్పొరేషన్‌ నూతన భవన నిర్మాణంకు ప్రతిపాదనలు పూర్తయినట్లు వివరించారు. ఈ సమీక్షలో ఏడీసీ హరిత,  స్మార్ట్‌సిటీ కార్పొరేషన్‌ జీఎం చంద్రమౌళి, కార్పొరేటర్లు రామస్వామి వెంకటేశ్‌, తమ్ముడగణేష్‌,  ఎక్స్‌ అఫిసియో మెంబర్‌ రుద్రరాజు శ్రీదేవి, డీసీ చంద్రమౌళీశ్వర్‌రెడ్డి, హెల్త్‌ ఆఫీసర్‌ హరికృష్ణ, మున్సిపల్‌ ఇంజనీర్లు చంద్రశేఖర్‌, వెంకటరామిరెడ్డి, ఇతర అధికారులు పాల్గొన్నారు.  


కొత్త పన్ను విధానంపై వ్యతిరేకత లేదు 

‘కొత్త ఆస్తి పన్ను విధానంలో 300చదరపు అడుగుల ఇళ్లకు కేవలం రూ.350 నిర్ణయించాం. తిరుపతిలోని 50 నుంచి 60శాతం ప్రజలు ఇందులోకే వస్తారు. తమిళనాడు, మహారాష్ట్ర కన్నా తక్కువగా కాపిటల్‌ మీద గృహాలకు 0.10నుంచి 0.20 శాతం, కమర్షియల్‌ భవనాలకు 0.20నుంచి 2.0శాతంగా పన్ను నిర్ణయించడంపై ప్రజల నుంచి వ్యతిరేకత లేదు. దీనివల్ల ప్రజలకు ఎంతో మేలు జరుగుతుంది’ అని మంత్రి బొత్స సత్యనారాయణ మీడియా సమావేశంలో అన్నారు. ప్రతి ఇంటిని డిజిటలైజ్‌ చేసి ఆస్తి బదలాయింపులో వారికి ఇబ్బంది లేకుండా ఉండేలా రూపొందించామన్నారు. తిరుపతి స్మార్ట్‌సిటీ అభివృద్ధి పనులకు ముఖ్యమంత్రి మరో రూ.153 కోట్లు విడుదల చేశారన్నారు. నగరాల అభివృద్ధికి, పరిశుభ్రతకు ప్రాధాన్యం ఇస్తున్నట్లు చెప్పారు. తిరుపతిలో ఇంటింటికి చెత్తసేకరణ జరుగుతోందని, దీనిని ఆదర్శంగా తీసుకుని రాష్ట్రమంతా అమలు చేస్తామన్నారు. మేయర్‌, కార్పొరేటర్లు, మున్సిపల్‌ అధికారులు ఉదయం 6 నుంచి 8గంటల వరకు వార్డుల్లో పర్యటించి పరిశుభ్రతపై దృష్టి పెట్టాలని సూచించారు. ఇంకేమైనా అవసరాలను గుర్తించి అభివృద్ధి పనులకు కార్పొరేషన్‌ ప్రతిపాదనలు పంపితే అమలు చేయడానికి సిద్ధంగా ఉన్నామని తెలిపారు. 

Updated Date - 2021-08-04T06:19:51+05:30 IST