ఆర్థిక ఉద్దీపనలో ఆత్మ వంచన

ABN , First Publish Date - 2020-05-20T09:40:51+05:30 IST

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రకటించిన ఆర్థిక ప్యాకేజీ నిజంగా రూ.20లక్షల కోట్లు ఉంటుందా? మన జీడీపీలో అది వాస్తవంగా 10శాతం ఉంటుందా? దేశంలో ఏ ఆర్థికవేత్తా ఈ విషయంలో ఏకీభావం ప్రకటించలేదు. మెజారిటీ ఆర్థిక వేత్తలు, వివిధ రేటింగ్ సంస్థలు...

ఆర్థిక ఉద్దీపనలో ఆత్మ వంచన

ప్రధానమంత్రి ప్రకటించిన రూ.20 లక్షల కోట్ల ఆర్థిక ప్యాకేజీలో అత్యధిక భాగం బ్యాంకులు ఇచ్చే రుణాలు. కొంత భాగం ఇప్పటికే బడ్జెట్‌లో ప్రకటించిన నిర్ణయాలు. మిగిలిన భాగం పార్లమెంట్‌లో ఆమోదం పొందాల్సిన నిర్ణయాలు. ఈ ఆర్థిక ఉద్దీపన వల్ల విదేశీ రేటింగ్ ఏజెన్సీలు దేశ ఆర్థిక వ్యవస్థకు తక్కువ రేటింగ్ ఇస్తాయన్న భయంతో ఆర్భాటమైన అంకెలు, హామీలు, దీర్ఘకాలిక చర్యలను జోడించి ప్రకటించారని ప్రముఖ ఆర్థిక వేత్త స్వామినాథన్ అయ్యర్ అన్నారు. విదేశీ రేటింగ్ కోసం తాపత్రయపడేవారు ఆత్మ నిర్భర భారత్ ఎలా సాధించగలరని ఆయన ప్రశ్నించారు.


ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రకటించిన ఆర్థిక ప్యాకేజీ నిజంగా రూ.20లక్షల కోట్లు ఉంటుందా? మన జీడీపీలో అది వాస్తవంగా 10శాతం ఉంటుందా? దేశంలో ఏ ఆర్థికవేత్తా ఈ విషయంలో ఏకీభావం ప్రకటించలేదు. మెజారిటీ ఆర్థిక వేత్తలు, వివిధ రేటింగ్ సంస్థలు ఈ ప్యాకేజీ లక్షన్నర కోట్ల నుంచి 4లక్షల కోట్ల కంటే ఎక్కువ ఉండదని, జీడీపీలో ఒకటి రెండు శాతం కంటే ఎక్కువ ఉండే అవకాశాలు లేవని చెబుతున్నారు. ఈ ప్యాకేజీలో కేవలం 10శాతం మాత్రమే బడ్జెట్‌నుంచి అదనంగా ఖర్చు అవుతుందని, దాదాపు 5శాతం ఇప్పటికే బడ్జెట్‌లో చేసిన హామీలని ఒక ఆర్థికవేత్త అన్నారు. ఈ ప్యాకేజీ వల్ల కలిగే ఫలితాల గురించి కనీసం బిజెపి నేతలకు కూడా స్పష్టమైన అవగాహన ఉన్నట్లు లేదు. ‘దేశంలో కోట్లాదిమంది అసంఘటిత రంగ కార్మికులు రోడ్డుపాలయ్యారు. లక్షలాదిమంది ఉపాధి కోల్పో యే ప్రమాదంలో ఉన్నారు. అనేక ఉత్పాదక కంపెనీలు మూత పడ్డాయి.


ఈ ప్యాకేజీవల్ల పరిస్థితిలో ఏమైనా మార్పు ఉం టుందా’ అన్న ప్రశ్నకు నిర్మలా సీతారామన్ జవాబివ్వకుండా మంచినీళ్లు తాగి రెవిన్యూ సెక్రటరీ వైపు చూశారు. ‘అసలు బడ్జెట్‌పై ఈ ప్యాకేజీ వల్ల పడే ఆర్థిక భారం ఎంత?’ అని అడిగినప్పుడు కూడా ఆమె నేరుగా జవాబివ్వకుండా ప్రభుత్వం సరైనవారికి డబ్బు చేరుకునేలా చూస్తుందని చెప్పారు. నిజానికి ఈ ప్యాకేజీగురించి బీజేపీ వర్గాలు ఉత్సాహం ప్రకటించి పెద్ద ఎత్తున ప్రచారానికి వెంటనే సన్నద్ధమయ్యాయి కాని ఇతర రాజకీయ పార్టీలు కానీ, ఆర్థిక వేత్తలు కానీ, వ్యాపార వేత్తలు కానీ అంత ఉత్సా హం ప్రకటించలేదు. ఆఖరుకు స్టాక్ మార్కెట్ కూడా అంత ఉత్సాహాన్ని ప్రదర్శించలేదు. ‘ప్రభుత్వం ప్రకటించిన చర్యలు మార్కెట్ అంచనాలకు తక్కువే ఉన్నాయి. కుదేలైన ఆర్థిక వ్యవస్థను ఒక కుదుపు కుదిపే చర్యలు ప్రభుత్వం ఏమి తీసుకుంటుందా, వ్యవస్థలో ఊపు ఏవిధంగా వస్తుందా, వినియోగం, పెట్టుబడులు పెద్ద ఎత్తున ఎలా పెరుగుతాయా అని మార్కెట్ ఎదురు చూసింది. కాని ప్రభుత్వం మార్కెట్‌లో బృహత్తరమైన కదలిక తేవడంలో విఫలమైంది’ అని స్టాక్ మార్కెట్ నిపుణులు కూడా వ్యాఖ్యానించారు.


అసలు లాక్‌డౌన్ పూర్తిగా పోయి వ్యాపార సంస్థలు, ఉత్పాదక సంస్థలు తమ కార్యకలాపాల్ని ప్రారంభించి సాధారణ పరిస్థితి రావడానికే ఎన్ని నెలలు పడుతుందో ఎవరూ చెప్పలేని పరిస్థితి నెలకొన్నది. ఈ లోపు బ్యాం కులు ఎంతమందికి ఎంత మేరకు రుణాలు ఇస్తాయో, ఆ రుణాలు మళ్లీ వ్యవస్థ పట్టాల మీదకు రావడానికి ఎంత మేరకు సరిపోతాయో చెప్పడం కష్టం. కనుక వ్యాపార, పారిశ్రామిక సంస్థలు ప్యాకేజీ పట్ల పెద్ద ఉత్సాహం ప్రకటించలేదు. ఆర్థిక ఉద్దీపన పేరుతో ప్రభుత్వం తనను తాను తెగ అమ్ముకునేందుకు సిద్ధంగా ఉన్నా, కొనేందుకు ఎంతమంది సిద్ధంగా ఉన్నారో చెప్పలేము. ఇక పేదల వలస కార్మికులకు ప్రభుత్వం కొన్ని తిండిగింజలు విదల్చడం, ఎంతో కొంత మేరకు కూలీ పనులు సృష్టించే అవకాశాలు కల్పించడం తప్ప ఏమీ చేయగలిగిన స్థితి లేదు. దాన్నే బృహత్తర ప్యాకేజీగా చెప్పుకునే పరిస్థితిలో ప్రభుత్వం ఉన్నది. పోనీ మధ్యలో రాష్ట్ర ప్రభుత్వాలేమైనా ఈ ప్యాకేజీ గురించి సంతృప్తి ప్రకటించాయా అంటే అదీ లేదు.


గత రెండునెలలుగా కరోనాను ఎదుర్కోవడంలో రాష్ట్ర ప్రభుత్వాలే ఏదో ఒకస్థాయిలో ప్రజలను ఆదుకుంటూ వస్తున్నాయి. ఈ రెండు నెలలుగా రాష్ట్ర ప్రభుత్వాలు కోల్పోయిన ఆదాయాలను కేంద్ర ప్రభుత్వం ఏమైనా పూడ్చే పరిస్థితిలో ఉన్నదా అంటే ఈ ప్యాకేజీలో ఆ ప్రస్తావన ఏ మాత్రం లేదు. పైగా చివరి రోజు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఏదో ఉదారంగా రాష్ట ప్రభుత్వాలు తమ జీఎస్‌డీపీలో 5 శాతం మేరకు అప్పులు చేసుకోవచ్చన్నట్లు ప్రకటించారు. కాని ఆ వెంటనే షరతులు వర్తిస్తాయని చెప్పారు. ఏ షరతులూ లేకుండా కేవలం 0.5 శాతం మాత్రమే అప్పులు చేసుకోవచ్చని అన్నారు. షరతులకు లోబడడమంటే రాష్ట్ర ప్రభుత్వాలు తమ అధికారాలను, హక్కులను, సమాఖ్య స్ఫూర్తిని కేంద్ర ప్రభుత్వానికి తాకట్టు పెట్టడమన్నమాట.


ఈ నేపథ్యంలో లాక్‌డౌన్ ప్రకటించిన తర్వాత దాదాపు రెండు నెలల పాటు ఊరించి, ఊరించి, అయిదు ముఖ్యమంత్రుల సమావేశాలు ఏర్పాటు చేసి, అనేకమందితో సమావేశమై, చర్చలు జరిపిన తర్వాత నరేంద్రమోదీ సర్కార్ ప్రకటించే ఆర్థిక ప్యాకేజీ బ్రహ్మాండంగా ఉంటుందని ఊహించిన వారికి పెద్దగా ఆనందం కలిగినట్లు కనపడడం లేదు. ప్రధానమంత్రి ప్రకటించిన రూ.20లక్షల కోట్ల ప్యాకేజీ గురించి వివరించడానికి ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వరుసగా అయిదు రోజులు ఎందుకు తీసుకున్నారు? బహుశా ఒకే రోజు సుదీర్ఘంగా కేంద్ర బడ్జెట్ చదివినట్లు చదివితే గత ఫిబ్రవరి 1వ తేదీన జరిగినట్లు అస్వస్థతకు గురయ్యే అవకాశాలున్నాయని ఆమె భావించి ఉంటారు.


అయితే అయిదురోజుల కాలం వృథా చేసే బదులు ఒక్కరోజులోనే ఆ ప్యాకేజీ గురించి చెప్పేందుకు అవకాశం ఉన్నప్పటికీ మోదీ ప్రభుత్వం వ్యూహాత్మకంగా అయిదు రోజుల పాటు తీసుకోవడానికి ఇతర కారణాలున్నాయని విశ్లేషకులు భావిస్తున్నారు. తాము ప్రకటించే ప్యాకేజీ గురించి వివిధ వర్గాలను ఊరించి, వేచి చూసేలా చేయడం, తామేదో అద్భుతమైన ప్యాకేజీ ప్రకటిస్తున్నట్లుగా సీన్ సృష్టించడం, చాప క్రింద నీరు లాగా ప్యాకేజీ పేరుతో తాము అనుకున్న సంస్కరణలను ప్రకటించడం, రాష్ట్ర ప్రభుత్వాలను తన నియంత్రణలోకి తీసుకురావడం, ఈ దేశాన్ని తామే ఉద్ధరిస్తున్నామన్న భ్రమలు కల్పించడం ఈ వ్యూహంలో భాగమన్న విషయం స్పష్టమవుతోంది.


అసలు ప్యాకేజీ ప్రకటించమని అడిగితే సంస్కరణలు ఎందుకు ప్రకటించాలి? ప్రస్తుత కరోనా వైరస్ సృష్టించిన ఆర్థిక సంక్షోభానికి, ఈ సంస్కరణలకు సంబంధం ఏమిటి? వాటిని ఇదివరకు కానీ, తర్వాత కానీ అందరు ముఖ్యమంత్రులతో చర్చించి ప్రకటిస్తామంటే ఎవరైనా అడ్డుకునేవారా? దేశమంతటికీ వర్తించే ఈ సంస్కరణల గురించి మోదీ సర్కార్ ఎవరితోనైనా వాటి గురించి పార్లమెంట్‌లో కానీ, ముఖ్యమంత్రులతో కానీ, జాతీయ అభివృద్ధి మండలిలో కాని చర్చించిందా? నిర్మలా సీతారామన్ పాల్గొన్న విలేఖరుల సమావేశాలను ప్రతి రోజూ గమనిస్తే ఆమె ప్రసంగాన్ని ఊకదంపుడు అని మాత్రం పూర్తిగా చెప్పలేం. సుదీర్ఘ ఉపోద్ఘాతం, స్వోత్కర్ష తర్వాత మెల్లిగా ప్రకటనలు చేసి ఆమె ముగించడం, తాను చెప్పలేని జవాబులను అధికారులకు అప్పగించడం ప్రతి రోజూ కనపడింది. పైగా తన సహాయమంత్రిని హిందీ అనువాదకుడుగా పెట్టుకోవడంతో వినేవారికి నిరీక్షణ తప్పలేదు.


కాని తీరా అంతా పూర్తయిన తర్వాత సమీక్షిస్తే అందులో ప్యాకేజీ పాలు తక్కువ, ప్రకటనలు, ప్రచారం పాలు ఎక్కువ అన్న విషయం వాటిని విన్నవారెవరికైనా అర్థమవుతుంది. నిజానికి ప్రభుత్వం పెద్ద ఎత్తున సంస్కరణలను ప్రవేశపెట్టేందుకు సిద్ధంగా ఉన్నదని గత సెప్టెంబర్‌లోనే నిర్మలా సీతారామన్ ముంబైలో ప్రకటించారు. తమకు రెండోసారి ప్రజల తీర్పు అద్భుతంగా వచ్చినందువల్ల ఈ సంస్కరణలు తేనున్నామని ఆమె చెప్పారు. చివరకు ‘వన్ నేషన్ వన్ రేషన్ కార్డ్‌’ అన్న పథకం గురించి కూడా 2019 జూన్‌లోనే రాం విలాస్ పాశ్వాన్ ప్రకటించారు. 2020 మే లో దాన్ని నిర్మలా సీతారామన్ కరోనా ప్యాకేజీలో చేర్చారు. విద్యుత్ సంస్కరణలు కూడా కేంద్రం ముందు నుంచి సంసిద్ధం చేస్తున్నవే. ఇవాళ రాష్ట్రాలు అధిక రుణం చేసుకునే వెసులుబాటును అడిగాయి కదా అని ఆ సంస్కరణలకూ రుణానికీ ముడిపెట్టి దాన్ని కూడా ప్యాకేజీలో చేర్చిన ఘనత ఈ ప్రభుత్వానిది.


కనుక కరోనా వైరస్‌ను ఎదుర్కొనే ప్యాకేజీతో సంస్కరణలను ముడిపెట్టడం అసంబద్ధం. మోదీ ప్రభుత్వం 2014లో అధికారంలోకి వచ్చినప్పటి నుంచీ ఏదో రకంగా రాష్ట్ర ప్రభుత్వాలను పూర్తిగా తమ పట్టులోకి తీసుకువచ్చేలా చర్యలు తీసుకోవడం ప్రారంభించింది. రాష్ట్రాలు కేంద్రానికి జవాబుదారీగా ఉండాలి కాని కేంద్రం ఎవరికీ జవాబుదారీగా ఉండనక్కర్లేదన్నది సారాంశం. ఉదాహరణకు కంపెనీలు తమ సామాజిక బాధ్యతగా పిఎం కేర్ నిధికి మాత్రమే విరాళాలు ఇవ్వాలి కాని రాష్ట్ర ప్రభుత్వాలకు ఇవ్వకూడదు– అని కేంద్రం నిబంధన విధించింది. అంటే రాష్ట్రాల్లో నడిచే కంపెనీలు తమ రాష్ట్ర ప్రభుత్వాల పట్ల సామాజిక బాధ్యతగా పనిచేయనవసరం లేదా? పిఎం కేర్ క్రింద ఎంత డబ్బు వచ్చిందో చెప్పడానికి కూడా ప్రధానమంత్రి కార్యాలయం నిరాకరించింది. ప్రధానమంత్రి జాతీయ సంక్షేమ నిధి ఇప్పటికే ఉండగా, మరో నిధి ఎందుకు ఏర్పాటు చేశారు? ఎవరికి కేటాయిస్తున్నారు? అన్న ప్రశ్నలకు జవాబులు లేవు. ఎన్నికల నిధులు ఇచ్చిన వారి పేర్లను రహస్యంగా ఉంచినట్లుగా పిఎం కేర్ నిధి వివరాలను కూడా గుప్తంగా ఉంచడం వెనుక మతలబు ఏమిటి?


ప్యాకేజీలో అత్యధిక భాగం బ్యాంకులు ఇచ్చే రుణాలు. కొంత భాగం ఇప్పటికే బడ్జెట్‌లో ప్రకటించిన నిర్ణయాలు. మిగిలిన భాగం పార్లమెంట్‌లో ఆమోదం పొందాల్సిన నిర్ణయాలు. ఈ ఆర్థిక ఉద్దీపన వల్ల విదేశీ రేటింగ్ ఏజెన్సీలు దేశ ఆర్థిక వ్యవస్థకు తక్కువ రేటింగ్ ఇస్తాయన్న భయంతోనే ఆర్భాటమైన అంకెలు, హామీలు, దీర్ఘకాలిక చర్యలను జోడించి ప్రకటించారు కాని రూ.20 లక్షల కోట్ల ప్యాకేజీ ప్రకటించామంటే గోరంతలు కొండంతలు చేసినట్లేనని ప్రముఖ ఆర్థికవేత్త స్వామినాథన్ అంక్లేసరీయ అయ్యర్ అన్నారు. విదేశీ రేటింగ్ కోసం తాపత్రయపడేవారు ఆత్మ నిర్భర భారత్ ఎలా సాధించగలరని ఆయన ప్రశ్నించారు. ఆత్మవంచన చేసుకునే వారు ఏ నినాదమైనా సృష్టించగలరని, ఎవరినైనా మభ్య పెట్టగలరని అర్థమవుతోంది.


ఎ. కృష్ణారావు

(ఆంధ్రజ్యోతి ఢిల్లీ ప్రతినిధి)

Updated Date - 2020-05-20T09:40:51+05:30 IST