ఆత్మబంధువులు

ABN , First Publish Date - 2020-09-09T05:30:00+05:30 IST

కాలే కడుపులు... చెదిరిన బతుకులు... కరోనా విలయంతో కొడిగట్టిపోతున్న జీవితాలకు వారు ఆధారమవుతున్నారు.

ఆత్మబంధువులు

కాలే కడుపులు... చెదిరిన బతుకులు... కరోనా విలయంతో కొడిగట్టిపోతున్న జీవితాలకు వారు ఆధారమవుతున్నారు. అయినవారే దగ్గరకు రాని వేళ కొవిడ్‌ మృతులకు ‘ఆత్మ’బంధువులై దహన సంస్కారాలు నిర్వహిస్తున్నారు. మానవత్వం పరిమళించే మంచి మనసున్న యువకుల జట్టు ‘విజయవాడ హెల్పింగ్‌ హ్యాండ్స్‌’. ఈ విపత్కాలంలో ఆపన్నులెందరికో మేమున్నామంటూ ధైర్యం చెబుతున్న వారి సేవా స్ఫూర్తి ‘యంగ్‌’కు ప్రత్యేకం.


పేరుకు తగ్గట్టుగానే ‘విజయవాడ హెల్పింగ్‌ హ్యాండ్స్‌’... ఆకలితో ఉన్నవారికి అన్నం పెడుతుంది. అత్యవసర పరిస్థితిలో ఉన్న వారికి వైద్యసాయం అందిస్తుంది. రక్తదానం చేస్తుంది. రోడ్లపైనే బతుకులీడస్తున్న అనాథలను అక్కున చేర్చుకొంటుంది. మారమూల పల్లెల్లో ఉన్న పేదలకు నిత్యావసరాలు ఇస్తుంది. ఎనిమిదేళ్ల కిందట పుట్టిన ఈ సంస్థ ఇప్పటికి ఎన్నో సేవా కార్యక్రమాలను చేపట్టింది. చిన్నచిన్న ఉద్యోగాలు చేసుకుంటూ.. సామాజిక సేవపై ఆసక్తి ఉన్న యువతతో నడుస్తోందీ సంస్థ. వీరు ఎవరి వద్ద నిధులు వసూలు చేయరు. తమకు వచ్చిన కొద్దిపాటి జీతాల్లో తలకొంత వేసుకుని సహాయ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. 



కరోనా మృతులకు... 

ప్రస్తుతం కరోనా అంటేనే వణికి పోతున్నారు జనం. భౌతిక దూరం మనుషుల మధ్యే కాదు... బంధాలు, బంధుత్వాల మఽధ్యనా పెరిగిపోయింది. ఇక కరోనాతో మరణించిన వారి మృతదేహాలను ముట్టుకొనే సాహసం ఎవరు చేస్తారు? కానీ ‘హెల్పింగ్‌ హ్యాండ్స్‌’ సభ్యులు మేమున్నామంటూ ముందుకు వచ్చారు. మృతదేహాన్ని పూర్తిగా కప్పి, అంబులెన్స్‌లో శ్మశాన వాటికకు తరలిస్తున్నారు. పద్ధతిగా దహన సంస్కారాలు నిర్వహిస్తున్నారు. అలా ఇప్పటి వరకు 60 మృతదేహాలకు అంతిమ సంస్కారాలు జరిపించారు. 

‘‘విజయవాడ ప్రభుత్వాసుపత్రి వద్ద కరోనాతో మృతిచెందిన తన కుమారుడిని ఎవరూ ముట్టుకోవడానికి కూడా రావట్లేదని ఓ తల్లి విలపిస్తున్న ఘటన మమ్మల్ని ఎంతో కలిచివేసింది. అప్పుడే నిర్ణయం తీసుకున్నాం... కరోనాతో మృతిచెందిన వారికి దహన సంస్కారాలు నిర్వహించాలని. దీంతో మేము ఇళ్లకు వెళ్లకుండా మా కుటుంబాలకు దూరంగా బతుకుతున్నాం. విడిగా రూమ్‌లు తీసుకుని జీవిస్తున్నాం. కరోనా వచ్చినవారిని అంటురోగులుగా చూడకండి. సరైన జాగ్రత్తలు తీసుకుంటూ వారికి చేతనైనంత సాయం చేయండి’’ అంటారు వెంకట్‌. 


ఉచిత అంబులెన్స్‌ కోసం... 

‘‘ప్రస్తుతం కరోనా బాధితులను గానీ, మృతులను గానీ తీసుకెళ్లాలంటే అంబులెన్స్‌ కూడా దొరకని పరిస్థితి నెలకొంది. ఒకవేళ దొరికినా వేలకు వేలు సమర్పించుకోవాల్సి వస్తోంది. పేదలకు అలాంటి దుస్థితి రాకుండా ఉచితంగా ఒక అంబులెన్స్‌ తిప్పాలని మేము ఆలోచిస్తున్నాం.  అందుకోసం స్నేహితులమంతా కలిసి డబ్బు కూడబెడుతున్నాం. త్వరలోనే అంబులెన్స్‌ను అందుబాటులోకి తెస్తాం. ఎవరైనా కరోనాతో చనిపోతే వారిని అనాథ శవాల్లా వదిలేయకుండా మా 9949926465 నెంబర్‌కు ఫోన్‌ చేయండి. మేము వచ్చి మృతదేహాన్ని దహన వాటికకు తరలిస్తాం. దగ్గరుండి అంత్యక్రియలు నిర్వహిస్తాం. అదీ ఉచితంగా’’ అంటారు వెంకట్‌.     

వేలాల నవదుర్గారావు  


అలా మొదలైంది... 

‘‘ఎనిమిదేళ్ల కిందటి విషయం ఇది. మందులకు రూ.7,400 లేక విజయనగరంలో ఓ బిడ్డ చనిపోయాడు. ఆ ఘటన నన్నెంతో కలచివేసింది. అప్పటి నుంచి మా సేవా కార్యక్రమాలు కొనసాగిస్తున్నాం. మొదట్లో అక్కడి ‘మహరాజా కాలేజీ’ విద్యార్థుల సహకారంతో సేవా కార్యక్రమాలకు శ్రీకారం చుట్టాం. క్రమంగా రాష్ట్రమంతటా విస్తరించాం’’ అంటారు ‘విజయవాడ హెల్పింగ్‌ హ్యాండ్స్‌’ అధ్యక్షుడు చందన వెంకట్‌. అతను తన వ్యాపారంలో వచ్చే ఆదాయంలో 40 శాతం సేవా కార్యక్రమాలకు వినియోగిస్తున్నారు. అతనే కాదు... సంస్థలోని ఇతర సభ్యులు కూడా తమ తమ జీతాల్లో కొంత మొత్తాన్ని వెచ్చిస్తున్నారు. 


ఫేస్‌బుక్‌ కలిపింది...  

వెంకట్‌తో మొదలైన ఈ సేవా కార్యక్రమాలను అతడి స్నేహితులు ఫేస్‌బుక్‌లో చూశారు. మిత్రుడు చేస్తున్న మంచి పనిలో వారూ భాగస్వాములయ్యారు. వీరిని చూసి ఆకర్షితులైన మరెంతో మంది యువత ఈ సేవాయజ్ఞంలో పాలుపంచుకొంటున్నారు. ఇప్పుడు ఈ సంస్థలో రాష్ట్రవ్యాప్తంగా 225 మంది సభ్యులున్నారు. దీనికి పి.ఫణీంద్ర సెక్రటరీ. అంబటి ఆనంద్‌, పి.హరిరామకృష్ణ, మనోజ్‌, మౌనిక, దేవకి ముఖ్య సభ్యులు. 


ఎవరికి ఏ కష్టం వచ్చినా... 

ఎక్కడ ఎవరు ఇబ్బందుల్లో ఉన్నా ‘హెల్పింగ్‌ హ్యాండ్స్‌’ సభ్యులు ఠక్కున వాలిపోతారు. తమకు తోచిన సాయం చేస్తారు. పదుల సంఖ్యలో పేద విద్యార్థులు చదువుకోవడానికి ఆర్థిక సాయం చేశారు. పసిబిడ్డలకు అత్యవసర వైద్య సేవలు అందించి ప్రాణాలు నిలిపారు. రాష్ట్రంలో ఎక్కడ ప్రకృతి విపత్తు సంభవించినా ఈ బృందం అక్కడ ప్రత్యక్షమవుతుంది. విజయవాడు, ఏలూరు నుంచి వెళ్లిన బృందాలు చెన్నై, కేరళ వరదలు, హుదూద్‌ తుఫాను సమయంలో నిత్యావసరాలు పంపిణీ చేశారు. కొందరికి ఇళ్లు కట్టించి ఇచ్చారు. లాక్‌డౌన్‌ సమయంలో విజయవాడ, ఏలూరు, రాజమండ్రి, విశాఖపట్నంలో రోజుకు 200 మందికి తగ్గకుండా భోజనం పెట్టారు. వలస కుటుంబాలకు బియ్యం, నిత్యావసర సరుకులు ఇచ్చారు. ప్రాణాపాయంలో ఉన్న ఎంతో మందికి రక్త దానం చేశారు. 

Updated Date - 2020-09-09T05:30:00+05:30 IST