అవమానం ఎదుర్కొన్నచోటనే.. అదరగొట్టిన స్మిత్!

ABN , First Publish Date - 2020-02-22T22:37:12+05:30 IST

క్రికెట్ ప్రపంచంలో ఆస్ట్రేలియా బ్యాటింగ్ సంచలనం స్టీవ్ స్మిత్ గురించి తెలియని వారుండరు.

అవమానం ఎదుర్కొన్నచోటనే.. అదరగొట్టిన స్మిత్!

జొహన్నెస్‌బర్గ్: క్రికెట్ ప్రపంచంలో ఆస్ట్రేలియా బ్యాటింగ్ సంచలనం స్టీవ్ స్మిత్ గురించి తెలియని వారుండరు. రెండేళ్ల క్రితం దక్షిణాఫ్రికా పర్యటనకు వెళ్లి బాల్ ట్యాంపరింగ్ వివాదంలో చిక్కుకుని ఏడాదిపాటు క్రికెట్‌కు దూరమయ్యాడు. ఈ క్రమంలో ఇంటా బయట ఎన్నో అవమానాలు ఎదుర్కొన్నాడు. అయితే, క్రికెట్‌పై అతడికున్న ప్రేమ వాటిని తట్టుకుని నిలబడగలిగేలా చేసింది. ఏడాది నిషేధం తర్వాత ఇటీవలే జట్టులోకి తిరిగి వచ్చిన స్మిత్.. తనలో చేవ ఏమాత్రం తగ్గలేదని నిరూపించాడు. పరుగుల వరద పారిస్తూ మునుపటి ఫామ్‌ను కొనసాగించాడు.

 

ఇప్పుడు ఈ ఉపోద్ఘాతమంతా ఎందుకంటే.. 2018లో ఏ దేశంలో అయితే బాల్ ట్యాంపరింగ్ ఆరోపణలు ఎదుర్కొని నిషేధానికి గురయ్యాడో.. ఇప్పుడదే దేశంలో ఆడుతున్నాడు. దక్షిణాఫ్రితో జొహన్నెస్‌బర్గ్‌లో జరిగిన తొలి టీ20లో జట్టును గెలిపించడంతో కీలక పాత్ర పోషించాడు. ఈ మ్యాచ్‌లో 45 పరుగులు చేసి జట్టులో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. బాల్ టాంపరింగ్ స్కాండల్ తర్వాత స్మిత్ మళ్లీ దక్షిణాఫ్రికాలో ఆడడం ఇదే తొలిసారి. గత జ్ఞాపకాలు కళ్లముందు కదలాడుతున్నా ఏమాత్రం తొణికిసలాడని స్మిత్ బ్యాట్‌తో రాణించాడు.


దక్షాణాఫ్రికా అభిమానులు కొందరు స్టేడియంలో స్మిత్‌ను దారుణంగా ట్రోల్ చేశారు.  ‘శాండ్ పేపర్ ఫర్ సేల్’ అంటూ ప్లకార్డులు ప్రదర్శించి మానిన గాయాన్ని తిరిగి రేపే ప్రయత్నం చేశారు. ఇదే స్కాంలో ఆరోపణలు ఎదుర్కొన్న డేవిడ్ వార్నర్ నాలుగు పరుగులకే అవుటవగా స్మిత్ మాత్రం నిలకడగా ఆడాడు. 32 బంతుల్లో 5 ఫోర్లు, సిక్సర్‌తో 45 పరుగులు చేశాడు. ఈ మ్యాచ్‌లో ఆసీస్ 107 పరుగుల తేడాతో విజయం సాధించింది.

Updated Date - 2020-02-22T22:37:12+05:30 IST