చేజార్చుకున్నారు..

ABN , First Publish Date - 2022-01-22T09:17:28+05:30 IST

తొలి మ్యాచ్‌లో బ్యాటింగ్‌లో విఫలమైన భారత జట్టు.. ఈసారి బౌలింగ్‌లో తడబడింది.

చేజార్చుకున్నారు..

దక్షిణాఫ్రికాదే వన్డే సిరీస్‌

పార్ల్‌ మైదానంలో జరిగిన 15 వన్డేల్లో ఇదే అత్యధిక లక్ష్య ఛేదన (288)

అదరగొట్టిన మలాన్‌ డికాక్‌

రెండో వన్డేలోనూ భారత్‌ చిత్తు  


తొలి మ్యాచ్‌లో బ్యాటింగ్‌లో విఫలమైన భారత జట్టు.. ఈసారి బౌలింగ్‌లో తడబడింది. బుమ్రా, చాహల్‌ మినహా మిగతా వారంతా ధారాళంగా పరుగులు సమర్పించుకున్నారు. డికాక్‌, బవుమాలతో కలిసి ఓపెనర్‌ యానెమన్‌ మలాన్‌ భారీ భాగస్వామ్యాలు నెలకొల్పడంతో కీలక రెండో వన్డేలోనూ భారత్‌కు నిరాశే మిగిలింది. అంతకుముందు పంత్‌ తుఫాన్‌ ఇన్నింగ్స్‌తో కెరీర్‌ బెస్ట్‌ స్కోరు సాధించినా ఫలితం లేకపోయింది. సిరీస్‌ కోల్పోయిన వేళ ఇక చివరి మ్యాచ్‌ నామమాత్రమే..


పార్ల్‌: దక్షిణాఫ్రికా పర్యటనలో భారత జట్టు పరాజయాల పరంపర కొనసాగుతూనే ఉంది. సిరీ్‌సలో నిలిచేందుకు కచ్చితంగా గెలవాల్సిన రెండో వన్డేలో టీమిండియా 7 వికెట్ల తేడాతో ఓడింది. దీంతో మరో మ్యాచ్‌ ఉండగానే సఫారీలు 2-0తో సిరీస్‌ కైవసం చేసుకున్నారు. ఆదివారం కేప్‌టౌన్‌లో చివరిదైన మూడో వన్డే జరుగుతుంది. ఓపెనర్‌ యానెమన్‌ మలాన్‌ (108 బంతుల్లో 8 ఫోర్లు, 1 సిక్స్‌తో 91) త్రుటిలో శతకాన్ని కోల్పోగా.. డికాక్‌ (66 బంతుల్లో 7 ఫోర్లు, 3 సిక్సర్లతో 78) అర్ధసెంచరీతో విజయంలో భాగమయ్యాడు. ముందుగా బ్యాటింగ్‌కు దిగిన భారత్‌ 50 ఓవర్లలో 6 వికెట్లకు 287 పరుగులు చేసింది. రిషభ్‌ పంత్‌ (85), కెప్టెన్‌ రాహుల్‌ (55) అర్ధసెంచరీలతో రాణించారు. చివర్లో శార్దూల్‌ (40 నాటౌట్‌), అశ్విన్‌ (25 నాటౌట్‌) వేగంగా ఆడి జట్టు భారీ స్కోరుకు దోహదపడ్డారు. షంసీకి రెండు వికెట్లు దక్కాయి. ఆ తర్వాత ఛేదనలో సఫారీలు 48.1 ఓవర్లలో 3 వికెట్లకు 288 పరుగులు చేసి నెగ్గింది. మార్‌క్రమ్‌ (37 నాటౌట్‌), డుస్సెన్‌ (37 నాటౌట్‌) చివరికంటా నిలిచారు. మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌గా డికాక్‌ నిలిచాడు.


ఓపెనర్ల జోరు:

288 పరుగుల ఛేదన కోసం బరిలోకి దిగిన దక్షిణాఫ్రికా ఆరంభం నుంచే లక్ష్యం వైపు వేగంగా సాగింది. ఓపెనర్‌ డికాక్‌ రెండో ఓవర్‌లోనే 4,6,4తో 16 పరుగులు రాబట్టి తన ఉద్దేశాన్ని చాటాడు. ఎనిమిదో ఓవర్‌లో స్టంప్‌ అయ్యే ప్రమాదం తప్పించుకున్న డికాక్‌ ఆ తర్వాత కూడా జోరును కొనసాగించాడు. అతడికి మరో ఎండ్‌లో ఓపెనర్‌ యానెమన్‌ సహకరించడంతో రన్‌రేట్‌ ఓవర్‌కు ఆరు పరుగులతో సాగింది. ముఖ్యంగా భువనేశ్వర్‌ వీరి ధాటికి బలయ్యాడు. 36 బంతుల్లో హాఫ్‌ సెంచరీ చేసిన డికాక్‌ 16వ ఓవర్‌లో భారీ సిక్సర్‌తో జట్టు స్కోరును వంద దాటించాడు. ఇక వికెట్‌ కోసం భారత బౌలర్లు అలసిపోయిన వేళ 22వ ఓవర్‌లో శార్దూల్‌ మురిపించాడు.


రివ్యూ ద్వారా డికాక్‌ వికెట్‌ లభించడంతో తొలి వికెట్‌కు 132 పరుగుల భారీ భాగస్వామ్యం ముగిసింది. కానీ ఆ తర్వాత మలాన్‌ చెలరేగడంతో భారత్‌ ఆశలు ఆవిరయ్యాయి. అతడికి జతగా కెప్టెన్‌ బవుమా ఉండడంతో 34వ ఓవర్‌లోనే స్కోరు 200కి చేరింది. అయితే సెంచరీ వైపు దూసుకెళుతున్న మలాన్‌ను 35వ ఓవర్‌లో బుమ్రా బౌల్డ్‌ చేయడంతో రెండో వికెట్‌కు 80 పరుగుల భాగస్వామ్యం ముగిసింది. ఆ వెంటనే బవుమా (35)ను చాహల్‌ వెనక్కి పంపాడు. ఈ దశలో క్రీజులో నిలదొక్కుకునేందుకు మార్‌క్రమ్‌, డుస్సెన్‌ కాస్త సమయం తీసుకున్నారు. అటు బుమ్రా, చాహల్‌ కట్టుదిట్టమైన బం తులతో ఒత్తిడి పెంచారు. అయితే భువీ బౌలింగ్‌కు దిగడం తో మార్‌క్రమ్‌ 2 ఫోర్లతో 12 పరుగులు సాధించాడు. ఇక ఆ తర్వాత ఎలాంటి ఇబ్బంది లేకుండా ఈ ఇద్దరే మ్యాచ్‌ను ముగించారు.


పంత్‌ బాదుడు:

టాస్‌ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన భారత్‌కు ఓపెనర్లు రాహుల్‌, ధవన్‌ (29) శుభారంభం అందించారు. పవర్‌ప్లేలో ధవన్‌ ధాటిగా పరుగులు సాధించాడు. అయితే తొలి వన్డే మాదిరే మార్‌క్రమ్‌ మరోసారి తమ జట్టుకు తొలి వికెట్‌ను అందించాడు. ఊపు మీదున్న ధవన్‌ స్లాగ్‌ స్వీప్‌నకు ప్రయత్నించి క్యాచ్‌ అవుట్‌ కావడంతో తొలి వికెట్‌కు 63 పరుగుల భాగస్వామ్యం ముగిసింది. ఆ వెంటనే కోహ్లీని కేశవ్‌ డకౌట్‌ చేయడంతో నాలుగో నెంబర్‌ బ్యాటర్‌గా క్రీజులోకి వచ్చిన పంత్‌ అదరగొట్టాడు. అటు రాహుల్‌ ఆచితూచి ఆడినా.. మరో ఎండ్‌లో పంత్‌ తన బ్యాట్‌ను ఝుళిపించాడు. 15వ ఓవర్‌లో ఫీల్డర్ల వైఫల్యంతో రాహుల్‌ సులువైన రనౌట్‌ నుంచి తప్పించుకున్నాడు. పంత్‌ మాత్రం మీడియం పేసర్లు, స్పిన్నర్లను ఓ ఆటాడుకుంటూ స్కోరును చకచకా పెంచాడు.

షంసీ ఓవర్‌లో మూడు ఫోర్లు బాది 43 బంతుల్లో అర్ధసెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఆ తర్వాత రాహుల్‌ 71 బంతుల్లో ఈ ఫీట్‌ సాధించాడు. మూడో వికెట్‌కు ఈ జోడీ 115 పరుగులు అందించాక వరుస ఓవర్లలో ఈ రెండు వికెట్లు కోల్పోవడంతో భారత్‌ స్కోరులో వేగం తగ్గింది. పంత్‌ అవుటయ్యే సమయానికి 33 ఓవర్లలో జట్టు స్కోరు 183 పరుగులు ఉండగా, 300 ఖాయమే అనిపించింది. కానీ శ్రేయాస్‌ (11), వెంకటేశ్‌ (22) స్పిన్‌ను ఎదుర్కోవడంలో తడబడ్డారు. చివర్లో శార్దూల్‌, అశ్విన్‌ బంతులను వృథా చేయకుండా వీలైనంత వేగంగా ఆడడంతో భారత్‌ కాస్త మంచి స్కోరునే సాధించగలిగింది.


స్కోరుబోర్డు

భారత్‌:

రాహుల్‌ (సి) డుస్సెన్‌ (బి) మగల 55; ధవన్‌ (సి) మగల (బి) మార్‌క్రమ్‌ 29; కోహ్లీ (సి) బవుమా (బి) కేశవ్‌ 0; పంత్‌ (సి) మార్‌క్రమ్‌ (బి) షంసీ 85; శ్రేయాస్‌ (ఎల్బీ) షంసీ 11; వెంకటేశ్‌ (స్టంప్‌) డికాక్‌ (బి) ఫెలుక్వాయో 22; శార్దూల్‌ (నాటౌట్‌) 40; అశ్విన్‌ (నాటౌట్‌) 25; ఎక్స్‌ట్రాలు: 20; మొత్తం: 50 ఓవర్లలో 287/6. వికెట్ల పతనం: 1-63, 2-64, 3-179, 4-183, 5-207, 6-239. బౌలింగ్‌: ఎన్‌గిడి 8-0-35-0; మగల 8-0-64-1; మార్‌క్రమ్‌ 8-0-34-1; కేశవ్‌ 9-0-52-1; ఫెలుక్వాయో 8-0-44-1; షంసీ 9-0-57-2. 


దక్షిణాఫ్రికా:

మలాన్‌ (బి) బుమ్రా 91; డికాక్‌ (ఎల్బీ) శార్దూల్‌ 78; బవుమా (సి అండ్‌ బి) చాహల్‌ 35; మార్‌క్రమ్‌ (నాటౌట్‌) 37; డుస్సెన్‌ (నాటౌట్‌) 37; ఎక్స్‌ట్రాలు: 10; మొత్తం: 48.1 ఓవర్లలో 288/3; వికెట్ల పతనం: 1-132, 2-212, 3-214. బౌలింగ్‌: బుమ్రా 10-0-37-1; భువనేశ్వర్‌8-0-67-0; అశ్విన్‌ 10-1-68-0; చాహల్‌ 10-0-47-1; శార్దూల్‌ 5-0-35-1; వెంకటేశ్‌ 5-0-28-0; శ్రేయాస్‌ 0.1-0-1-0.

Updated Date - 2022-01-22T09:17:28+05:30 IST