వాళ్లను తెచ్చేదెలా?

ABN , First Publish Date - 2020-08-04T09:17:45+05:30 IST

ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ తాజా సీజన్‌కు అంతా ఓకే. సెప్టెంబరు 19 నుంచి నవంబరు 10 వరకు జరిగే ఈ లీగ్‌ కోసం ఆటగాళ్లంతా ...

వాళ్లను తెచ్చేదెలా?

దక్షిణాఫ్రికా క్రికెటర్లపై అనిశ్చితి

ఆరంభ మ్యాచ్‌లకు సందేహమే

న్యూఢిల్లీ: ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ తాజా సీజన్‌కు అంతా ఓకే. సెప్టెంబరు 19 నుంచి నవంబరు 10 వరకు జరిగే ఈ లీగ్‌ కోసం ఆటగాళ్లంతా యూఏఈలో అడుగుపెట్టబోతున్నారు. ఇక్కడి వరకు బాగానే ఉంది కానీ.. దక్షిణాఫ్రికాకు చెందిన పది మంది ఆటగాళ్లను యూఏఈకి రప్పించడమెలా? అని ఆయా ఫ్రాంచైజీలు తీవ్రంగా ఆలోచిస్తున్నాయి. వీరిలో స్టార్‌ ఆటగాళ్లు ఏబీ డివిల్లీర్స్‌, క్రిస్‌ మోరిస్‌, డేల్‌ స్టెయిన్‌ (బెంగళూరు), క్వింటన్‌ డికాక్‌ (ముంబై), ఫా డుప్లెసి, లుంగీ ఎన్‌గిడి (చెన్నై), డేవిడ్‌ మిల్లర్‌ (రాజస్థాన్‌), కగిసో రబాడ (ఢిల్లీ), విలోయెన్‌, కోచ్‌ జాంటీ రోడ్స్‌ (పంజాబ్‌) ఉన్నారు. ముఖ్యంగా డివిల్లీర్స్‌ ఆటకు భారీ సంఖ్యలో అభిమానులు ఉంటారు. అతను లీగ్‌కే ప్రత్యేక ఆకర్షణ. కరోనా కారణంగా దక్షిణాఫ్రికాలో విదేశీ ప్రయాణాలపై కఠిన ఆంక్షలు కొనసాగుతున్నాయి. దీంతో  తొలి అంచె పోటీలకు వీరంతా దూరమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే, స్పిన్నర్‌ ఇమ్రాన్‌ తాహిర్‌ మాత్రం గత నాలుగు నెలలుగా పాకిస్థాన్‌లో చిక్కుకుపోవడంతో అతను పూర్తి ఐపీఎల్‌కు అందుబాటులో ఉండబోతున్నాడు. ఏదిఏమైనా ఈ విషయంలో బీసీసీఐ ఏం చెబుతుందో దానికి తగ్గట్టు నడుచుకుంటామని ఓ ఫ్రాంచైజీ ఉన్నతాధికారి తెలిపాడు. ‘దక్షిణాఫ్రికా ఆటగాళ్లతో సంప్రదింపులు జరుపుతున్నాం. వారందరినీ తీసుకురావడం సవాల్‌తో కూడుకున్నదైనా పరిష్కారం కోసం ఆలోచిస్తున్నాం’ అని చెప్పాడు. మరోవైపు వారిని చార్టెడ్‌ ఫ్లయిట్స్‌లో రప్పించడంపై కూడా జట్లు ఆలోచిస్తున్నాయి. దీంట్లో భాగంగా ఒక్కో జట్టు ఒక్కో విమానం కాకుండా ఒకే విమానంలో అందరినీ తీసుకుని వస్తే ఖర్చు తగ్గుతుందనే భావనలో ఉన్నాయి. 

ఆగస్టు 20 తర్వాతే ప్రయాణం..: అన్ని జట్లు తమ ఆటగాళ్లతో ఆగస్టు 20 లోపు యూఏఈకి వెళ్లాల్సి ఉంటుందని గతంలో కథనాలు వినిపించాయి. దీనికి తగ్గట్టుగానే చెన్నై, ముంబై జట్లు ఆగస్టు 10నే అబుదాబికి వెళతామని ప్రకటించాయి. కానీ ఇప్పుడు ఆగస్టు 20 తర్వాతే ఎవరైనా భారత్‌ నుంచి వెళ్లాల్సి ఉంటుందని ఐపీఎల్‌ పాలక మండలి ఫ్రాంచైజీలకు లేఖ పంపింది. ‘వచ్చే నెల 20 తర్వాతే యూఏఈకి వెళ్లాల్సి ఉంటుందని మాకు అధికారిక సమాచారం అందింది. కాబట్టి అంతకంటే ముందు వెళ్లడమనేది అసంభవం. మేమింకా ఎస్‌ఓపీ జాబితా అందుకోలేదు. వీసా ప్రక్రియను మాత్రం ప్రారంభించమని సూచించారు. ఇప్పటికే హోటళ్లను బుక్‌ చేశాం. కాబట్టి సమస్య లేదు. బ్లూప్రింట్‌ అంతా సిద్ధంగా ఉంది’ అని ఓ ఫ్రాంచైజీ అధికారి చెప్పారు.

ఐపీఎల్‌ను బహిష్కరించాలి..: దేశమంతా చైనా కంపెనీలపై వ్యతిరేకత వ్యక్తమవుతున్నా బీసీసీఐ మాత్రం వాటినే కొనసాగించడంపై విమర్శలు వస్తున్నాయి. ఐపీఎల్‌ టైటిల్‌ స్పాన్సర్‌గా వివో కొనసాగుతున్న విషయం తెలిసిందే. అయితే, ఇంత స్వల్ప కాలంలో మరో కంపెనీ దొరకడం సాధ్యం కాదని బోర్డు భావిస్తోంది. అయితే, ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోపోతే ఐపీఎల్‌ను బహిష్కరించాలంటూ దేశ ప్రజలకు ఆర్‌ఎ్‌సఎస్‌ అనుబంధ సంస్థ స్వదేశీ జాగరణ్‌ మంచ్‌ (ఎస్‌జేఎం) పిలుపునిచ్చింది. దేశంలో చైనా ఉత్పత్తులకు వ్యతిరేకంగా ఈ సంస్థ పెద్ద ఎత్తున ఆందోళన చేస్తోంది. ప్రపంచమంతా చైనాకు వ్యతిరేకంగా ఉంటే బీసీసీఐ మాత్రం వారికి అండగా నిలుస్తోందని ఎస్‌జేఎం కో-కన్వీనర్‌ అశ్వినీ మహాజన్‌ విమర్శించాడు. అలాగే అఖిల భారత వర్తక సమాఖ్య (సీఏఐటీ) ఇప్పటికే హోం, విదేశాంగ శాఖలకు తమ నిరసన తెలుపుతూ లేఖలు రాసింది. ఈ అంశంపై జమ్మూ కశ్మీర్‌ మాజీ సీఎం ఒమర్‌ అబ్దుల్లా కూడా ట్విటర్‌లో అసంతృప్తి వ్యక్తం చేశాడు. ‘ప్రజలంతా చైనా ఉత్పత్తులను బాయ్‌కాట్‌ చే స్తుంటే బీసీసీఐ మాత్రం వివోను  స్పాన్సరర్‌గా కొనసాగిస్తోంది’ అని ఎద్దేవా చేశాడు. ‘చైనా ఆదాయంతో లబ్ధి పొందే క్రికెట్‌కు స్వాగతం. ఇది బీజేపీ ద్వంద్వ ప్రమాణాలకు నిదర్శనం’ అంటూ కాంగ్రెస్‌ విరుచుకుపడింది.

చెన్నైకి రాకముందే కరోనా టెస్టులు

ఐపీఎల్‌పై మరింత స్పష్టతతో పాటు ఎస్‌ఓపీ మార్గదర్శకాలపై చెన్నై జట్టు (సీఎస్‌కే) ఐపీఎల్‌ పాలక మండలిని సంప్రదించింది. ఈ నేపథ్యంలో గురువారం ఎస్‌ఓపీని విడుదల చేసే అవకాశముందని సీఎ్‌సకే తెలిపింది. ఇదే వారంలో ఫ్రాంచైజీలతో సమావేశం కూడా ఉండబోతోందని పేర్కొంది. ఓవరాల్‌గా ఈ వారాంతానికి తమ సందేహాలన్నీ తీరుతాయని చెన్నై జట్టు అధికారి తెలిపాడు. అందరికన్నా ముందే యూఏఈకి వెళ్లాలనుకున్నా బోర్డు సూచనను పాటించాల్సిందేనని చెప్పాడు. ఇక ఆటగాళ్లంతా కరోనా టెస్టులు చేయించుకున్నాకే చెన్నైకి చేరుకుంటారని, ఆ తర్వాత 48 గంటల్లో యూఏఈకి వెళతామని వెల్లడించాడు.

Updated Date - 2020-08-04T09:17:45+05:30 IST