భర్తకు ఒంటె గుండెను వాలెంటైన్స్ డే గిఫ్ట్‌గా ఇచ్చిన భార్య

ABN , First Publish Date - 2021-02-24T17:34:52+05:30 IST

ప్రేమికుల రోజున నచ్చిన వారికి వినూత్నమైన బహుమతిని ఇవ్వాలని ప్రేమికులు భావిస్తుంటారు. దక్షిణ ఆఫ్రికాకు చెందిన మెరెలైజ్

భర్తకు ఒంటె గుండెను వాలెంటైన్స్ డే గిఫ్ట్‌గా ఇచ్చిన భార్య

కేప్‌టౌన్: ప్రేమికుల రోజున నచ్చిన వారికి వినూత్నమైన బహుమతిని ఇవ్వాలని ప్రేమికులు భావిస్తుంటారు. దక్షిణ ఆఫ్రికాకు చెందిన మెరెలైజ్ అనే యువతి కూడా ఇలానే అనుకుని ఒంటె గుండెను భర్తకు బహుమతిగా ఇచ్చింది. వివరంగా చెప్పాలంటే.. ట్రోఫీ హంటింగ్ కింద చాలా దేశాల్లో వేటగాళ్లు జంతువులను చంపుతుంటారు. హంటింగ్‌కు, ట్రోఫీ హంటింగ్‌కు తేడా ఏంటంటే.. హంటింగ్ ఆహారం కోసం చేస్తే ట్రోఫీ హంటింగ్ జంతువులు లేదా వాటి శరీర భాగాలను గుర్తుగా దాచుకునేందుకు చేస్తుంటారు. ట్రోఫీ హంటింగ్ అనేది చాలా దేశాల్లో లీగల్. ఈ కారణంగా ఆయా దేశ ప్రభుత్వాలకు వేటగాళ్లు భారీ మొత్తంలో నగదును చెల్లించి జంతువులను వేటాడుతూ ఉంటారు. 


భర్తకు ఒంటె గుండెను బహుమతిగా ఇచ్చిన మెరెలైజ్ అనే యువతి కూడా ఒక ట్రోఫీ హంటర్. ఆమె తన జీవితంలో ఇప్పటివరకు 500కు పైగా జంతువులను వేటాడింది. ఫిబ్రవరి 14న వాలెంటైన్స్ డే కావడంతో తన భర్తకు ఒంటె గుండెను బహుమతిగా ఇవ్వాలని నిర్ణయించుకుంది. దక్షిణ ఆఫ్రికాలోని ఓ అడవిలో ముసలి ఒంటెను వేటాడి చంపింది. అనంతరం ఒంటె గుండెను బయటకు తీసి ఫొటోకు ఫోజిచ్చింది. ఆ ఫొటోను తన సోషల్ మీడియా ఖాతాలో పోస్ట్ చేసి ‘ఒంటె గుండె ఇంత పెద్దగా ఉంటుందని ఎప్పుడైనా ఊహించారా?’ అంటూ రాసుకొచ్చింది. 


ఈ పోస్ట్‌ను చూసిన జంతు ప్రేమికులందరూ ఆమెపై తీవ్రంగా మండిపడ్డారు. భర్త కోసం వెరైటీ గిఫ్ట్‌లు ఇవ్వొచ్చు కానీ, గిఫ్ట్ పేరిట ఇలాంటి పిచ్చిచేష్టలు చేయకూడదని ఆగ్రహం వ్యక్తం చేశారు. కానీ మెరెలైజ్ మాత్రం విమర్శకుల మాటలను ఏమాత్రం పట్టించుకోలేదు. తన పనిని సమర్థించుకుంటూ వృద్ద ఒంటెలను వేటాడడం వల్ల కొన్ని జాతులను కాపాడిన వాళ్లమవుతామని చెబుతోంది.

Updated Date - 2021-02-24T17:34:52+05:30 IST