Jul 24 2021 @ 00:17AM

కుటుంబ సమేతంగా...

కుటుంబ కథా చిత్రాలు అనగానే ఇంటిల్లిపాది కలసి చూసేవి అని అర్థం కదా!. అయితే ఇప్పుడు టాలీవుడ్‌లో  కొంతమంది అగ్ర కథానాయకులు కుటుంబ కథాచిత్రాలకు సరికొత్త అర్థం చెబుతున్నారు. తమ కుటుంబంలోని సీనియర్‌ నటులతో కలసి సినిమాలు చేస్తూ  వెండితెరపైకి వస్తున్నారు. ‘సకుటుంబ సమేతం’  అంటూ  ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమవుతున్నారు. 


చిరూ చెర్రీ

‘మగధీర’, ‘ఖె ౖదీనంబర్‌ 150’  చిత్రాల్లో చిరంజీవి, రామ్‌చరణ్‌ కలసి తెరపై కొన్ని సెకన్ల పాటు కనిపిస్తేనే మెగా అభిమానులు థ్రిల్‌గా ఫీలయ్యారు.  వారిద్దరూ  పూర్తిస్థాయి పాత్రల్లో కలసి నటిస్తే చూడాలనే కోరిక అభిమానుల్లో చాన్నాళ్లుగా ఉంది.  ఇప్పుడు ‘ఆచార్య’ చిత్రంతో అభిమానులకు స్పెషల్‌ ట్రీట్‌ ఇవ్వబోతున్నారు చిరు, చెర్రీ. కొరటాల శివ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రంలో గురుశిష్యుల పాత్రల్లో కనిపించనున్నారని తెలుస్తోంది.  నక్సలిజం బ్యాక్‌డ్రా్‌పలో తెరకెక్కే ఈ చిత్రంలో రెబలియస్‌ పాత్రలో చిరంజీవి, రామ్‌చరణ్‌ అభిమానులను అలరించానున్నారు. ప్రస్తుతం ‘ఆచార్య’ చిత్రీకరణ చివరిదశలో ఉంది. 


రాధేశ్యామ్‌తో రెబల్‌స్టార్స్‌ 

కృష్ణంరాజు నటవారసుడిగా పరిశ్రమలోకి అడుగుపెట్టిన ప్రభాస్‌ కొద్దికాలంలోనే పాన్‌ ఇండియా స్టార్‌గా ఎదిగారు. ‘బిల్లా’, ‘రెబల్‌’ చిత్రాల్లో కృష్ణంరాజు, ప్రభాస్‌ కలసి నటించారు. అయితే  అవి అభిమానులను అంతగా ఆకట్టుకోలేకపోయాయి. మళ్లీ  వారిద్దరిని కలిపి తెరపై చూడాలన్న అభిమానుల కోరిక త్వరలో తీరబోతోంది.  ‘రాధేశ్యామ్‌’ చిత్రంతో వీరిద్దరూ కలసి అభిమానులకు కనువిందు చేయనున్నారు. వింటేజ్‌ వస్త్రధారణలో ప్రభాస్‌తో కలసి ‘రాధేశ్యామ్‌’ సెట్‌లో దిగిన ఫొటోను కృష్ణం రాజు సామాజిక మాధ్యమాల్లో షేర్‌ చేశారు. ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ తుదిదశలో ఉంది. రాధాకృష్ణకుమార్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో ప్రభాస్‌ సరసన పూజాహెగ్డే కథానాయికగా నటిస్తున్నారు.


నాన్నతో నాగ్‌ చైతన్య

మూడుతరాల అక్కినేని కుటుంబ సభ్యులంతా కలసి ‘మనం’ సినిమాతో వెండితెరపై చేసిన సందడిని  మరచిపోలేం. ఆ తర్వాత  నాగార్జున, నాగచైతన్య, అఖిల్‌ ఎవరి సినిమాలతో వారు బిజీగా ఉండడంతో కలసి నటించడం కుదరలేదు. చాలా కాలం  తర్వాత నాగార్జున, చైతన్య కలసి మళ్లీ అక్కినేని అభిమానులను అలరించడానికి సిద్ధమవుతున్నారు. ‘సోగ్గాడే చిన్ని నాయనా’కు సీక్వెల్‌గా రూపొందే  చిత్రం ‘బంగార్రాజు’లో వీరిద్దరూ కలసి నటించనున్నారు. త్వరలోనే ఈ చిత్రం సెట్స్‌పైకి వెళ్లనుంది. ఇందులో నాగార్జున, నాగచైతన్య తండ్రీ కొడుకులుగా కనిపించనున్నారని సమాచారం. వారి పాత్రలు ఆసక్తికరంగా ఉంటాయని తెలుస్తోంది. కల్యాణ్‌కృష్ణ దర్శకత్వంలో నాగార్జున ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.  


కొత్త జానర్‌లో 

టాలీవుడ్‌ ప్రముఖ సినీ కుటుంబాల్లో రామానాయుడు ఫ్యామిలీ ఒకటి. ఆయన తనయుడు వెంకటేశ్‌ కథానాయకుడిగా ప్రేక్షకులను అలరించారు. ఆయన బాటలోనే సురేశ్‌బాబు తనయుడు రానా ‘బాహుబలి’ చిత్రంతో దేశవ్యాప్తంగా అభిమాన గణాన్ని సంపాదించుకున్నారు. ఇప్పుడు రానా తమ్ముడు అభిరామ్‌ నటుడిగా కొత్త ప్రయాణం మొదలుపెట్టారు. తేజ దర్శకత్వంలో అతను కథానాయకుడిగా వెండితెరకు పరిచయమవుతున్నారు. వెంకటేశ్‌, రానా, అభిరామ్‌ కలసి నటిస్తే చూడాలనే ఆకాంక్ష అభిమానుల్లో ఉంది. ‘వారి కోరిక త్వరలోనే నెరవేరబోతోంది’ అంటున్నారు రానా. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ‘‘మా కుటుంబంలోని నటులందరం కలసి త్వరలోనే ఒక సినిమా చేస్తాం. అయితే ఆ సినిమా ‘మనం’ తరహాలో కాకుండా, కొత్త జానర్‌లో వినూత్న కథాంశంతో రూపుదిద్దుకుంటుంది’’ అని చెప్పారు. 


తెరపై ఆనాటి అనుబంధం

ఒకే కుటుంబంలోని రెండు తరాలకు చెందిన హీరోలు కలసి నటించడం ఇప్పుడే కొత్తగా ప్రారంభమైంది కాదు. గతంలో రామారావు, బాలకృష్ణ..., నాగేశ్వరరావు, నాగార్జున, నాగచైతన్య, అఖిల్‌..., కృష్ణ, రమేశ్‌బాబు, మహేశ్‌బాబు..., మోహన్‌బాబు, విష్ణు, మనోజ్‌... కలసి పూర్తిస్థాయి చిత్రాల్లో నటించారు. అలాగే చిరంజీవి, నాగబాబు కలసి కొన్ని సినిమాలు చేశారు. కొన్ని చిత్రాల్లో పవన్‌కల్యాణ్‌, రామ్‌చరణ్‌ కొన్ని క్షణాల పాటు చిరంజీవితో కనిపించి ఆకట్టుకున్నారు.


పరభాషల్లోనూ...

కుటుంబంలోని నటులు కలసి నటించడం దక్షిణాదిన కొనసాగుతూ వస్తున్నదే. తాజాగా తమిళంలో విక్రమ్‌, ఆయన తనయుడు ధ్రువ్‌ విక్రమ్‌ కలసి ఓ చిత్రం చేస్తున్నారు. అలాగే మలయాళంలో మోహన్‌లాల్‌ ఆయన తనయుడు ప్రణవ్‌ మోహన్‌లాల్‌ ‘మరక్కార్‌: అరబ్బీ కడలింటి సింహమ్‌’ చిత్రంలో కలసి కనిపించనున్నారు. 2007లో వచ్చిన ‘అప్నే’ చిత్రంలో ధర్మేంద్ర తనయులు సన్నీడియోల్‌, బాబీడియోల్‌తో కలసి కనిపించారు. ఇప్పుడు తనయులతోపాటు మనవడు కరణ్‌డియోల్‌తో కలసి ‘అప్నే’ సీకె ్వల్‌లో మరోసారి కలసి నటించబోతున్నారు ధర్మేంద్ర. వచ్చే ఏడాది ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.