ఒలికిపోయిన పాట

ABN , First Publish Date - 2020-09-26T06:10:11+05:30 IST

గళంలో అమృతాన్ని నింపుకుని గానంలోకి దాన్ని వొంపి స్వరఝరీనాదమైంది నీ గాత్రం హలో గురు మకోసమేరా అంటూ యవ్వనాన్ని చైతన్యపరిచినా...

ఒలికిపోయిన పాట

గళంలో అమృతాన్ని నింపుకుని

గానంలోకి దాన్ని వొంపి 

స్వరఝరీనాదమైంది నీ గాత్రం


హలో గురు ప్రేమకోసమేరా

అంటూ యవ్వనాన్ని చైతన్యపరిచినా..

ఏ దివిలో విరిసిన పారిజాతమో

అని ఊహల్లో సుందరస్వప్నాలు గీసినా..

అంతర్యామీ అలసితినంటూ

వైరాగ్యాన్ని ఓ ప్రవాహంలా జాలువార్చినా

ఎన్నెన్ని తీరాల్లో మనసును లాలించిందో నీ గాత్రం


హుషారు ఉప్పొంగి ఊరంతా ఊరేగే వేళా

ఉత్సాహం ఆవిరై

బతుకు మీద విరక్తి చెందిన వేళా

ఎదనంటి సాగింది నీ పాట


ఎన్నెన్ని వైరుధ్యాలు

ఎన్నెన్ని మధురసాలు 

మాటలకున్న బాషల్ని చెరిపేసి

నీ గళం వైవిధ్యాలు పోతుంటే

వాయిద్యాలు సైతం విస్మయం చెందాయేమో 


గోదారి పిల్లతెమ్మెరలను

కృష్ణమ్మ గలగలలను 

కోకిల కంజీరవాలను 

ఉషోదయ నులివెచ్చ కిరణాలను..

సమస్త ప్రకృతి పరవశాన్ని

పాటలో పొదివిన నీ కంఠం 

వినమరుగు కానేకాదు


నీవెళ్లిపోయినా 

మా హృదయాంతరాలలో వెల్లువై 

పాటలతోటలకు ప్రాణాలూదే నీ కంఠం 

ఇక గరళకంఠుని ఎదుట

నిరతం కచేరీలు చేస్తుందేమో.. 


– గంగాడి సుధీర్

Updated Date - 2020-09-26T06:10:11+05:30 IST