Jul 18 2021 @ 01:40AM

అంతరిక్షమే హద్దు!

నేల విడిచి సాము చేయవద్దని పెద్దలు చెబుతుంటారు కానీ కొందరు దర్శకులు మాత్రం  నింగిలో సాగే కథలకు పెద్దపీట వేస్తున్నారు. ఒక్క మాటలో చెప్పాలంటే .. అంతరిక్ష నేపథ్యంలో భారీ బడ్జెట్‌తో రూపొందే పాన్‌ ఇండియా చిత్రాలకు శ్రీకారం చుడుతున్నారు. సస్పెన్స్‌, క్రైమ్‌, హారర్‌ జానర్‌ చిత్రాలకు భిన్నంగా అంతరిక్షం, గ్రహాంతరవాసులు, వాళ్లతో యుద్ధం  లాంటి ఇతివృత్తాలతో  కథలు సిద్ధం చేసుకుంటున్నారు.  భారీ బడ్జెట్‌తో పాన్‌ ఇండియా స్థాయిలో తెరకెక్కుతున్న ఈ తరహా చిత్రాలపై ఓ లుక్కేద్దాం.

హృతిక్‌ రోషన్‌ సినిమా అనగానే భారీ అంచనాలు ఉంటాయి. ఆ అంచనాలకు మించి రూపొందుతున్న చిత్రం ‘ఫైటర్‌’. అంతరిక్ష యుద్ధం నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో హృతిక్‌ వాయుసేన అధికారిగా నటిస్తున్నారు. ఈ సినిమాలో యాక్షన్‌ ఘట్టాలన్నీ మిస్సైల్స్‌, యుద్ధ విమానాల మధ్యన అంతరిక్షంలో సాగుతాయి. భారీ యాక్షన్‌ చిత్రాలను తెరకెక్కించడంలో మాస్టర్‌గా పేరుపొందిన సిద్ధార్థ్‌ ఆనంద్‌ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఇండియాలో ‘ఫైటర్‌’ తొలి ఏరియల్‌ మూవీ అని ఆయన చెపుతున్నారు. ఏరియల్‌ యాక్షన్‌ సాంకేతికతో రూపొందుతున్న ఈ చిత్రం ప్రేక్షకులకు గొప్ప అనుభూతిని కలిగిస్తుంద ని దర్శకుడు చెపుతున్నారు. ప్రపంచస్థాయి యాక్షన్‌ చిత్రాల సరసన ‘ఫైటర్‌ను నిలబెట్టేలా రూపొందిస్తాం. వెండితెరపై ఈ చిత్రం ప్రేక్షకులకు మంచి అనుభూతిని పంచుతుంది’’ అని ఆయన చెప్పారు. హృతిక్‌తో ఆయనకిది మూడో చిత్రం. వీరిద్దరి కలయికలో వచ్చిన ‘వార్‌’  రికార్డులు సృష్టించింది. హృతిక్‌కి జోడీగా దీపికా పడుకోన్‌ నటిస్తున్నారు. వచ్చే ఏడాది ఈ సినిమా సెట్స్‌పైకి వెళ్లనుంది.

ఏలియన్స్‌పై...

కథానాయిక ప్రాధాన్య చిత్రాలు చేస్తూ వరుస విజయాలను అందుకుంటున్నారు తాప్సీ. గ్రహాంతర వాసుల నేపథ్యంలో రూపొందుతున్న పాన్‌ ఇండియా చిత్రం ‘ఏలియన్‌’లో నటిస్తున్నారు. భరత్‌ నీలకంఠన్‌ దర్శకత్వం వహిస్తున్నారు. అంతరిక్ష జీవుల నేపథ్యంలో పాన్‌ ఇండియా స్థాయిలో ఈ చిత్రం తెరకెక్కుతోంది. భారతదేశంలో ఏలియన్స్‌ అడుగుపెడితే ఎలా ఉంటుందో చూపించనున్నారు. ఇప్పటిదాకా భారతీయ సినిమాల్లో ఎవరూ టచ్‌ చేయని సబ్జెక్ట్‌ కావడం ఈ సినిమాపై ఆసక్తిని పెంచింది. అంతరిక్షం నుంచి భూమిపైకి వచ్చిన ఏలియన్స్‌ను కాపాడే వ్యక్తి పాత్రలో తాప్సీ కనిపిస్తారా?, లేదా ఏలియన్‌గా నటిస్తారా  అనేది ప్రస్తుతానికి సస్పెన్స్‌. గ్రహాంతరవాసులపై వచ్చిన పలు హాలీవుడ్‌ చిత్రాలు ఘన విజయాన్ని అందుకున్నాయి. అందుకే ఈ చిత్రంపై వాటి ప్రభావం లేకుండా స్ర్కిప్ట్‌లో జాగ్రత్తలు తీసుకొన్నారు. విజువల్‌ ఎఫ్‌క్ట్స్‌కు ప్రాధాన్యం ఇస్తున్నారు. పలు దక్షిణాది భాషల్లో ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నారు. 

స్కైలాబ్‌ ఎఫెక్ట్‌

అంతరిక్షంలో జరిగిన ఆకస్మిక సంఘటన ... దానికి ఎలాంటి సంబంధం లేని కొందరి వ్యక్తుల జీవితాలను ఎలా ప్రభావితం చేసిందనే ఇతివృత్తంతో ఆద్యంతం వినోదాత్మకంగా తెరకెక్కుతోన్న చిత్రం ‘స్కైలాబ్‌’. సత్యదేవ్‌, నిత్యామీనన్‌, రాహుల్‌ రామకృష్ణ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. 1979లో అమెరికా అంతరిక్ష సంస్థ ప్రయోగించిన అంతరిక్ష కేంద్రం స్కైలాబ్‌ను నిర్ణీత కక్ష్యలో ప్రవేశపెట్టడంలో విఫలమవుతుంది. తెలుగు రాష్ట్రంలో బండ లింగంపల్లి అనే గ్రామంలో ఉండే ముగ్గురి జీవితాల్లో స్కైలాబ్‌ వల్ల ఎలాంటి పరిణామాలు తలెత్తాయనేది కథ. 

మాధవన్‌ రాకెట్రీ 

మాజీ భారతీయ అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) శాస్త్రవేత్త నంబి నారాయణన్‌ జీవిత కథతో తెరకెక్కుతున్న చిత్రం ‘రాకెట్రీ: నంబి ఎఫెక్ట్‌’. తమిళ నటుడు మాధవన్‌ టైటిల్‌పాత్రలో నటిస్తూ దర్శకత్వం వహిస్తున్నారు. హిందీ, తమిళ, ఆంగ్ల భాషల్లో తెరకెక్కుతోంది. ఇస్రో తలపెట్టిన క్రయోజనిక్‌ ఇంజిన్‌ తయారీ ప్రాజెక్ట్‌కు నారాయణన్‌ నేతృత్వం వహించారు.  రాకెట్‌ సాంకేతిక పరిజ్ఞానాన్ని ఆయన విదేశాలకు అమ్మారంటూ పోలీసులు కేసు పెట్టి, అరెస్ట్‌ చేశారు. దీనివల్ల క్రయోజనిక్‌ ఇంజిన్లను దేశీయంగా అభివృద్ధి చేసే ప్రక్రియ రెండు దశాబ్దాల ఆలస్యం అవడంతో పాటు నంబి నాయర్‌ వ్యక్తిగత జీవితంలో ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వచ్చింది. ఆ తర్వాత ఆయన నిర్దోషిగా విడుదలై మళ్లీ ఇస్రోలో చేరి అంతరిక్ష రంగంలో భారత్‌కు తన సేవలను అందించారు. 

ప్రభాస్‌ నాగ్‌ అశ్విన్‌ సైన్స్‌ఫిక్షన్‌

భారతీయ ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న చిత్రాల్లో నాగ్‌అశ్విన్‌ దర్శకత్వంలో ప్రభాస్‌ కథానాయకుడిగా నటిస్తున్న సినిమా ఒకటి. అంతరిక్షం నేపథ్యంలో సాగే సైన్స్‌ ఫిక్షన్‌ కథాంశంతో ఈ చిత్రం తెరకెక్కుతోంది. ఇప్పటికే ప్రీ ప్రొడక్షన్‌ వర్క్‌ ప్రారంభమైంది. కరోనా లాక్‌డౌన్‌తో సెట్స్‌పైకి వెళ్లడంలో జాప్యం జరిగింది. 


దీపికా పడుకోన్‌ కథానాయిక. ముఖ్యపాత్రలో అమితాబ్‌బచ్చన్‌ నటిస్తున్నారు. సీనియర్‌ ద ర్శకులు సింగీతం శ్రీనివాసరావు స్ర్కీన్‌ప్లే పర్యవేక్షణ చేస్తున్నారు. అంతర్జాతీయ స్థాయి టెక్నీషియన్లు ఈ సినిమాకు పని చేస్తున్నారు. 


భారతీయ భాషల్లో అంతరిక్షం నేపథ్యంలో వచ్చిన చిత్రాలు, విజయాల శాతం రెండూ తక్కువే. తెలుగులో వరుణ్‌ తేజ్‌ కథానాయకుడిగా నటించిన ‘అంతరిక్షం’ ఫలితం నిరాశపరిచింది. బాలీవుడ్‌లో అక్షయ్‌కుమార్‌ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ‘మిషన్‌ మంగళ్‌’ గతేడాది విడుదలై మంచి వసూళ్లను రాబట్టింది.