స్త్రీ శక్తి భవనాలకు స్థలం సమస్య

ABN , First Publish Date - 2021-05-11T05:20:37+05:30 IST

స్త్రీశక్తి భవనాల నిర్మాణానికి స్థలం సమస్య ఎదురైంది.

స్త్రీ శక్తి భవనాలకు స్థలం సమస్య
అద్దె భవనంలో చాగలమర్రి వెలుగు కార్యాలయం

  1. అద్దె భవనాల్లో నిర్వహణ 
  2. పట్టించుకోని అధికారులు 


చాగలమర్రి, మే 10: స్త్రీశక్తి భవనాల నిర్మాణానికి స్థలం సమస్య ఎదురైంది. దీంతో భవనాల నిర్మాణానికి మంజూరైన నిధులు వెనక్కి వెళ్లాయి. ఈ నిధులు తిరిగి పొందాలంటే గ్రామాల పంచాయతీలు 10 శాతం నిధులను చెల్లించాలి. లేకుంటే నిధులు మంజూరు కావు. దీంతో పొదుపు మహిళలు తమ ఆర్థిక వ్యవహారాలను అద్దె భవనాల్లో కొనసాగిస్తున్నారు. అద్దె భవనాల్లో  వసతులు లేక  వెలుగు అధికారులు, సిబ్బంది ఇబ్బంది  పడుతున్నారు. 2011లో అప్పటి ప్రభుత్వం స్త్రీ శక్తి భవన నిర్మాణానికి శ్రీకారం చుట్టింది. నియోజకవర్గంలోని 5 మండలాలకు స్త్రీ శక్తి భవనాలు మంజూరయ్యాయి. ఆళ్లగడ్డలో అప్పటి ఎమ్మెల్యే శోభానాగిరెడ్డి భవనాల నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఒక్కో  భవనానికి రూ.25 లక్షలు నిధులు కేటాయించారు. రుద్రవరం, దొర్నిపాడు, శిరివెళ్ల మండలాల్లో భవన పనులు పూర్తి కాగా చాగలమర్రి, ఆళ్లగడ్డ, ఉయ్యాలవాడ మండలాల్లో స్థల సమస్య కారణంగా నిర్మాణం ఆగిపోయింది. ఇందులో ఆళ్లగడ్డ మండలంలోని పేరాయిపల్లె వద్ద భవన నిర్మాణానికి రెవెన్యూ అధికారులు స్థలం కేటాయించారు. అయితే భవన నిర్మాణ పనులు ఆలస్యం కావడంతో నిధులు వెనక్కి మళ్లాయి. ఇంత వరకు భవన పనులు ప్రారంభించలేదు. చాగలమర్రి గ్రామంలో స్థలాన్ని చూపించారే కానీ పీఆర్‌ శాఖకు అప్పగించక పోవడంతో పనులు చేపట్టలేదు. గోస్పాడులో భవన నిర్మాణం మధ్య లో ఆగిపోయింది. అధికారులు అద్దె భవనాల్లోనే పని చేస్తున్నారు. ఐదు మండలాల్లో 4,200 పొదుపు గ్రూపులు ఉన్నాయి. వీటి ద్వారా రూ.76 కోట్ల వరకు ఆర్థిక లావాదేవిలు జరుగుతున్నాయి. స్త్రీశక్తి భవనాలు నిర్మించాలని పొదుపు మహిళలు కోరుతున్నారు. 


స్త్రీ శక్తి భవనం నిర్మించాలి

స్త్రీ శక్తి భవనాలు లేని కారణంగా పొదుపు మహిళల సమావేశం నిర్వహించేందుకు ఇబ్బందులు పడుతున్నాం. అద్దె భవనాల్లో సౌకర్యాలు లేవు. రెవెన్యూ అధికారులు స్థలాన్ని చూపించి భవన నిర్మాణం చేపట్టేలా చూడాలి. 

- లక్ష్మీదేవి, ఐక్య సంఘ లీడర్‌, చిన్నబోదనం


భవనాలు నిర్మించాలి

 భవన నిర్మాణాలకు స్థల సమస్య ఉంది. ఆళ్లగడ్డకు పేరాయిపల్లె గ్రామంలో స్థలం చూపించారు. చాగలమర్రి, ఉయ్యాలవాడ గ్రామాల్లో స్థలాలు చూపించలేదు. రుద్రవరంలో భవనం పూర్తయింది. గోస్పాడులో భవన నిర్మాణం ఆగింది. అధికారులు స్పందించి స్థలాలు చూపించాల్సి ఉంది.

 - దానం, వెలుగు ఏరియా కో-ఆర్డినేటర్‌ 

Updated Date - 2021-05-11T05:20:37+05:30 IST