ఇకనైనా స్పందన వస్తుందా?.. వెబ్‌సైట్లో దరఖాస్తు చేసుకున్నా రాని అనుమతి

ABN , First Publish Date - 2020-08-05T19:50:52+05:30 IST

దేవుడు వరమిచ్చినా పూజారి కరుణించలేదన్న చందంగా తయారైంది ఇతర రాష్ట్రాల్లోని జిల్లా వాసుల పరిస్థితి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు దశల వారీగా లాక్‌డౌన్‌ నిబంధనలు సడలిస్తూ వస్తున్నాయి.

ఇకనైనా స్పందన వస్తుందా?.. వెబ్‌సైట్లో దరఖాస్తు చేసుకున్నా రాని అనుమతి

పాసుల కోసం ఇతర రాష్ట్రాల్లోని నెల్లూరు జిల్లా వాసుల అవస్థలు

రాష్ట్ర ప్రత్యేకాధికారి ఆదేశాలతోనైనా ఉపశమనం లభించేనా?


నెల్లూరు (ఆంధ్రజ్యోతి) : దేవుడు వరమిచ్చినా పూజారి కరుణించలేదన్న చందంగా తయారైంది ఇతర రాష్ట్రాల్లోని జిల్లా వాసుల పరిస్థితి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు దశల వారీగా లాక్‌డౌన్‌ నిబంధనలు సడలిస్తూ వస్తున్నాయి. ఏ రాష్ట్రాలకు చెందిన వారు ఆ రాష్ట్రాలకు వెళ్లేందుకు కేంద్ర ప్రభుత్వం అనుమతిచ్చింది. ఎవరైనా అత్యవసర పనులపై ఇతర రాష్ట్రాలకు వెళ్లి వచ్చేందుకు ఎలాంటి ఆంక్షలు లేవు. అయితే అధికారుల అనుమతి తీసుకోవడం తప్పనిసరి. ఇతర రాష్ట్రాల్లోని వారు జిల్లాకు రావాలంటే స్పందన వెబ్‌సైట్లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంది. అలాగే జిల్లా నుంచి ఇతర రాష్ట్రాలకు వెళ్లాలనుకున్నప్పుడు అక్కడి ప్రభుత్వ నిబంధనల ప్రకారం దరఖాస్తు చేసుకోవాలి. వీటిని పరిశీలించిన తర్వాత అధికారులు ఆన్‌లైన్లోనే పాసులు జారీ చేస్తారు. అయితే ఈ  పాసుల విషయంలో ఇతర రాష్ట్రాల్లోని జిల్లా వాసులకు కష్టాలు తప్పడం లేదు. స్పందన వెబ్‌సైట్లో దరఖాస్తు చేసుకుంటున్నా అనుమతులకు తీవ్ర జాప్యం జరుగుతోంది. దరఖాస్తులన్నీ నెల్లూరు జిల్లా జేసీ వద్ద పెండింగ్‌లో ఉన్నట్లు వెబ్‌సైట్లో చూపిస్తోంది. దీంతో అత్యవసరమైన వారు చాలా ఇబ్బందులు పడుతున్నారు. సకాలంలో అధికారుల నుంచి స్పందన రాకపోవడంతో ఎలాగోలా తంటాలు పడి జిల్లాకు చేరుకుంటున్నారు. ఇంకా చాలామంది స్పందన వెబ్‌సైట్లో పాసుల కోసం ఎదురుచూస్తున్నారు. 


ఈ నేపథ్యంలో ఇకపై ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే వారు స్పందన వెబ్‌సైట్లో దరఖాస్తు చేసుకుంటే ఆటోమేటిక్‌గా వెంటనే ఈ - పాస్‌ జారీ అవుతుందని కొవిడ్‌ రాష్ట్ర ప్రత్యేకాధికారి ఎంటీ కృష్ణబాబు ప్రకటించారు. మరి ఇకనైనా ఇతర రాష్ట్రాల్లోని జిల్లా వాసులకు కష్టాలు తీరుతాయో లేదో చూడాలి. అలాగే ఇప్పటి వరకు ‘స్పందన’లో దరఖాస్తు చేసుకుని పెండింగ్‌లో ఉన్న వారు మళ్లీ దరఖాస్తు చేసుకోవాలా.. అక్కర్లేదా.. అన్న సందేహాలను నివృత్తి చేయాల్సిన బాధ్యత అధికారులపై ఉంది. 


వారం  క్రితం నెల్లూరుకి చెందిన ఓ కుటుంబం వారి బంధువు చనిపోతే హైదరాబాద్‌కు వెళ్లాల్సి వచ్చింది. ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకున్న ఒక్క రోజులోనే తెలంగాణ నుంచి అనుమతి లభించింది. అయితే హైదరాబాద్‌ నుంచి జిల్లాకు తిరిగి వచ్చేందుకు దరఖాస్తు చేసుకోగా అనుమతి రాలేదు. ఎన్నిరోజులు ఎదురుచూసినా వెబ్‌సైట్లో పెండింగ్‌ అని చూపిస్తుండడంతో ఇక చేసేది లేక ఆ కుటుంబం పాస్‌ లేకుండానే హైదరాబాద్‌ నుంచి పయనమైంది. రాష్ట్ర సరిహద్దు వరకు ఒక కారులో వచ్చి అక్కడి నుంచి రాష్ట్రంలోకి నడక మార్గాన ప్రవేశించి అక్కడి నుంచి మరో కారులో నెల్లూరుకు చేరుకుంది. 


మరో వ్యక్తి తమిళనాడు నుంచి జిల్లాకు వచ్చేందుకు ‘స్పందన’లో దరఖాస్తు చేసుకున్నాడు. ఎన్ని రోజులు చూసినా పెండింగ్‌ అని చూపిస్తుండడంతో ఆ వ్యక్తి రాష్ట్ర సరిహద్దుల్లో జాతీయ రహదారిపై కాకుండా పక్క గ్రామాల గుండా జిల్లాకు చేరుకున్నాడు. ఇలాంటి సంఘటనలు వందల సంఖ్యలోనే ఉన్నట్లు సమాచారం.

Updated Date - 2020-08-05T19:50:52+05:30 IST