బీజేపీలో వింత పరిణామం.. ఈటెల, రఘునందన్, రాజాసింగ్.. ముగ్గురిలోనూ సేమ్ సీన్ రిపీట్..!

ABN , First Publish Date - 2021-11-02T22:09:28+05:30 IST

హుజూరాబాద్ ఉప ఎన్నికల ఫలితాలు తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారాయి. ఒకటి రెండు రౌండ్లు మినహా ప్రతీ రౌండ్‌లోనూ బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్‌కే మెజార్టీ ఉండటంతో కాషాయ పార్టీ నేతలు సంబరాలు చేసుకుంటున్నారు. ఇప్పటికే తాము విజయం సాధించేశామని

బీజేపీలో వింత పరిణామం.. ఈటెల, రఘునందన్, రాజాసింగ్.. ముగ్గురిలోనూ సేమ్ సీన్ రిపీట్..!

హుజూరాబాద్ ఉప ఎన్నికల ఫలితాలు తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారాయి. ఒకటి రెండు రౌండ్లు మినహా ప్రతీ రౌండ్‌లోనూ బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్‌కే మెజార్టీ ఉండటంతో కాషాయ పార్టీ నేతలు సంబరాలు చేసుకుంటున్నారు. ఇప్పటికే తాము విజయం సాధించేశామని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ వ్యాఖ్యానించారు. ఈటల రాజేందర్ ఇంటి వద్ద అభిమానుల సంబరాలు మిన్నంటాయి. అయితే ఈ ఫలితాలపై తెలంగాణ రాజకీయాల్లో ఓ ఆసక్తికర చర్చ నడుస్తోంది. రాష్ట్ర బీజేపీలో జరుగుతున్న ఆసక్తికర పరిణామాల గురించి హాట్ టాపిక నడుస్తోంది. రాజాసింగ్, రఘునందన్‌రావ్, రాజేందర్ కేంద్రంగా నెట్టింట పోస్టులు వైరల్ అవుతున్నాయి.


ఆర్ఆర్ఆర్.. నిన్నమొన్నటి వరకు ఈ పదం ఏపీ రాజకీయాలకో, రాజమౌళి సినిమాకో పరిమితమై ఉండేది. ఇప్పుడు ఆ పదం కాస్తా తెలంగాణ రాజకీయాల్లోకి కూడా ఎంట్రీ ఇచ్చింది. రాజాసింగ్, రఘునందన్ రావు, రాజేందర్ త్రయం గురించి పేర్కొంటూ బండి సంజయ్ ఈ పదాన్ని వాడారు. ముగ్గురివీ వేర్వేరు మనస్థత్వాలు. మాట తీరు కూడా ఒకరికొకరికి పూర్తి భిన్నంగా ఉంటుంది. కానీ ఎన్నికల్లో గెలుపు విషయంలో మాత్రం ముగ్గురిదీ ఒకటే దారి. పార్టీ బలం వల్ల గెలిచే వాళ్లు చాలా మంది ఉంటారు. కానీ వ్యక్తిగత బలం, బలగం వల్ల గెలిచే నేతలు మాత్రం కొందరే ఉంటారు. ఆ కొందరిలోనే ఈ ముగ్గురు నేతలు కూడా ఉన్నారనడంలో ఏమాత్రం అతిశయోక్తి లేదు. వ్యక్తిగత ప్రతిష్ట, బలం, బలగం వల్లే బీజేపీలోని ఈ ముగ్గురు నేతలకు విజయం సాధ్యం అయింది.


గోషామహల్ ఎమ్మెల్యేగా కంటే.. గో సంరక్షణ కోసం పోరాటం చేసే వ్యక్తిగానే ఎక్కువ మందికి తెలుసు. ఆయన రాజకీయ జీవితం తెలుగుదేశం పార్టీతోనే ప్రారంభమయింది. 2009వ సంవత్సరంలో జీహెచ్ఎంసీ ఎన్నికల్లో పోటీ చేశారు. 2014వ సంవత్సరం వరకు కార్పొరేటర్‌గా పనిచేశారు. ఆ తర్వాత 2014 ఎన్నికల్లో బీజేపీలో చేరారు. బీజేపీ టికెట్‌పై పోటీ చేసి కాంగ్రెస్ సీనియర్ నేత ముఖేష్ గౌడ్‌పై 46వేల పై చిలుకు ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. 2018 ఎన్నికల్లో కూడా టీఆర్ఎస్ అభ్యర్థి ప్రేమ్ సింగ్ రాథోడ్‌పై 17 వేల ఓట్ల మెజార్టీతో గెలిచారు. అప్పుడప్పుడు వివాదాస్పద వ్యాఖ్యలు చేసి వార్తల్లో ఉండే రాజాసింగ్‌కు గోషామహల్‌లో భారీ అభిమానగణం ఉంది. పార్టీ బలం కంటే ఆయన వ్యక్తిగత బలగమే ఆ నియోజకవర్గంలో ఎక్కువ. అందుకే.. అప్పుడప్పుడు కోపం వచ్చినప్పుడల్లా సొంత పార్టీకే రాజీనామా చేస్తున్నానంటూ ప్రకటనలు ఇస్తుంటారు. పార్టీ రాష్ట్ర నాయకత్వం కూడా ఓ మెట్టు దిగొచ్చి మరీ రాజాసింగ్‌‌ను బుజ్జగిస్తూ వస్తుంటుంది.


ఇక 2020లో జరిగిన దుబ్బాక ఉఫ ఎన్నికల్లో బీజేపీ నుంచి పోటీ చేసిన రఘునందనరావు విజయం సాధించారు. టీఆర్ఎస్ ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి మరణంతో ఖాళీ అయిన దుబ్బాక అసెంబ్లీ స్థానానికి గతేడాది నవంబర్ నెలలోనే ఉప ఎన్నికలు జరిగాయి. ఈ నేపధ్యంలో రఘునందనరావు ఎన్నికల బరిలోకి దిగారు. అయితే అప్పటికే బీజేపీ తరపున 2014, 2018 ఎన్నికల్లో పోటీచేసిన రఘునందనరావు మూడో స్థానంతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. 2001లో టీఆర్ఎస్ పార్టీ ద్వారా రఘునందన్ రావు రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చారు. మెదక్ జిల్లా సిద్ధిపేటకు చెందిన రఘునందనరావు వృత్తిరీత్యా న్యాయవాది, జర్నలిస్టుగానూ పనిచేశారు.  2001లో రఘునందనరావు టీఆర్ఎస్‌లో చేరారు. తక్కువకాలంలోనే టీఆర్ఎస్ పొలిట్‌బ్యూరో మెంబర్‌గా ఎదిగారు. మంచి వాగ్ధాటి గల నాయకుడిగా పేరున్న రఘునందనరావు అప్పట్లో పార్టీలో కీలకంగా వ్యవహరించారు. అయితే, 2013లో ఆయన టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడును కలిశారన్న ఆరోపణలతో టీఆర్ఎస్ ఆయనను పార్టీ నుంచి బహిష్కరించింది. రఘునందనరావు ఈ ఆరోపణలను ఖండించారు. ఆ తరువాత ఆయన బీజేపీలో చేరారు. అప్పటి నుంచి పార్టీ కోసం నిరంతరం పనిచేశారు. 2014, 2018లలో బీజేపీ నుంచి పోటీ చేసి ఓటమి పాలయ్యారు. ఈ రెండు ఎన్నికల్లోనూ దుబ్బాక నుంచి సోలిపేట రామలింగారెడ్డి విజయం సాధించారు. ఓటమి పాలయినా సరే నియోజకవర్గంలోనే ఉంటూ ప్రజా సమస్యలపై పోరాడుతూ మంచి పేరు తెచ్చుకున్నారు. ఫలితంగా 2020లో జరిగిన దుబ్బాక ఉపఎన్నికల్లో రఘునందనరావు విజయం సాధించారు. దుబ్బాకలో కూడా బీజేపీ ఇమేజ్ కంటే.. రఘునందన్ రావు ఇమేజ్ కారణంగానే ఆ ఎన్నికల్లో కమలనాథులు విజయకేతనం ఎగురవేశారు. దుబ్బాకలో బీజేపీ బలం కంటే.. రఘునందన్‌రావుపై సానుభూతి, ఆయన వ్యక్తిగత ఇమేజ్ వంటివే ఎన్నికల్లో విజయానికి కారణమయ్యాయని రాజకీయ విశ్లేషకులు తేల్చిచెబుతున్నారు. ఎన్నికల్లో ఒకటికి రెండు సార్లు ఓడిపోయినా నియోజకవర్గ అభివృద్ధి కోసం పోరాడిన తీరు, ఆయనపై బనాయించిన అక్రమ కేసుల వంటివి రఘునందన్‌రావు వ్యక్తిగత ఇమేజ్ బలపడటానికి కారణమయ్యాయని స్పష్టం చేస్తున్నారు.


ఇక వాళ్లిద్దరి కోవలోనే ఈటల రాజేందర్‌ కూడా వ్యక్తిగత ఇమేజ్‌తోనే హుజూరాబాద్ ఎన్నికల్లో విజయతీరాలకు దూసుకెళ్తున్నారు. వాస్తవానికి ఈ ఉప ఎన్నికల్లో ఈటలను ఎలాగైనా ఓడించాలన్న పంతంతో కేసీఆర్ వ్యూహరచన చేశారు. రాత్రికి రాత్రే లక్షలు కురిపించే పథకాలకు రూపకల్పన చేశారు. కానీ ఆ ఎత్తులేమీ హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో పారలేదు. టీఆర్ఎస్ ప్రభుత్వం తాము అమలు చేస్తున్న పథకాలతో పాటు హుజూరాబాద్‌లో అమలు చేస్తున్న దళితబంధు పథకం ద్వారా ఓట్లు రాబట్టుకోవాలని భావించింది. అయితే దశాబ్దానికి పైగా నియోజకవర్గానికి తాను చేసిన సేవలను గుర్తు చేస్తూ ఈటల రాజేందర్ ప్రజలను ఆకట్టుకునే ప్రయత్నం చేశారు. తనను టీఆర్ఎస్ ప్రభుత్వం ఏవిధంగా అవమానాలపాలు చేసిందో బహిరంగంగా వెల్లడించారు. అలాగే తెలంగాణలో కేసీఆర్ కుటుంబ పాలన ఏ విధంగా ఉందో చెబుతూ ప్రజలను తనవైపు తిప్పుకునే ప్రయత్నాన్ని ఈటల చేశారు. నిజానికి హుజూరాబాద్ ఉప ఎన్నికను కేసీఆర్ వర్సెస్ ఈటల రాజేందర్ అన్నట్టుగా మార్చాలని ఈటల భావించారు. అయితే టీఆర్ఎస్ మాత్రం ఈ ఎన్నికను బీజేపీ వర్సెస్ టీఆర్ఎస్ అన్నట్టుగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని ప్రణాళిక వేసింది. టీఆర్‌ఎస్ పార్టీ నుంచి ఈటల బయటపడిన తరువాత ఎంతో ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకున్నాయి. ఈ నేపధ్యంలో ఈటలను.. కేసీఆర్ సర్కారు వేధింపులకు గురిచేస్తున్నదనే సంకేతం ప్రజల్లోకి వెళ్లింది. దీనికి‌తోడు పార్టీలో కీలకంగా వ్యవహరించిన ఈటల తనకు జరిగిన అవమానాలను ప్రజల ముందు వెళ్లగక్కడంతో సానుభూతి మరింత పెరిగింది. పైగా గత నాలుగు దఫాల అసెంబ్లీ ఎన్నికల్లో హుజురాబాద్ నుంచి ఈటల గెలుపొందడం ఆయన వ్యక్తిగత ఇమేజ్‌కు అద్దం పడుతుంది. అలాగే ఈటల తన నియజవర్గం అభివృద్ధికి ఎంతనాగో పాటుపడ్డారనే భావన ప్రజల్లో నాటుకుంది. నిజానికి చెప్పుకోవాలంటే హుజూరాబాద్ నియోజకవర్గంలో బీజేపీ బలం నామమాత్రమే. 2018 ఎన్నికల్లో ఇక్కడ ఆ పార్టీ అభ్యర్థికి 1683 ఓట్లు పోలయ్యాయి. బీజేపీ అభ్యర్థి కంటే స్వతంత్ర అభ్యర్థికి, నోటాకే ఎక్కువ ఓట్లు వచ్చాయి. తాజా ఉప ఎన్నికల్లో పార్టీ బలం వల్ల ఈటల గెలుస్తున్నారా..? లేక వ్యక్తిగత ఇమేజ్ కారణంగా విజయం సాధిస్తున్నారా..? అన్నది చెప్పడానికి ఈ ఒక్క ఉదాహరణే చాలు. 

Updated Date - 2021-11-02T22:09:28+05:30 IST