Abn logo
Sep 25 2021 @ 00:26AM

పాటల సుమగంధం

పాలలా స్వచ్ఛమైన మనస్సున్న బాలు, కోదండపాణి వద్ద నేర్చావు సంగీత ఓనమాలు. ఆ గొంతులో పలుకుతాయి ఎన్నో గమకాలు, నీవు పాడే స్వరాలు నవరస రసరమ్య గీతాలు. ఆందుకే చెప్పలేము నీకు వీడ్కోలు. నీ పాట మాకు బాగా చేరువ యింది, నీవు లేవన్న మాట విని మా గుండె చెరువయింది. దివారాత్రాల గానం అది. మా ఎదుట లేవు నీవు. ఈ పూట మా ఎదలో సృతిపథమై వినిపిస్తుంది నీ పాట. ఆ గానమాధుర్యంలో ఉంది మహత్తు, ప్రతి పాటలో ఏదో గమ్మత్తు. సప్తస్వరాలు నీ సొత్తు, సాధన ద్వారానే సాధించావు ఎంతో విద్వత్తు. పాటల పల్లకీలో గానాల గీర్వాణిని ఊరేగించావు, పాటల పంచామృతంతో అభిషేకించావు.


తొలిసంధ్య వేళలో తొలిపొద్దు పొడుపులో, తెలవారే తూరుపులో వినిపించే రాగం భూపాలం.. ఆ పాట తెలుగింట సుప్రభాతం. లాలి జో లాలి జో ఊరుకో పాపాయి, అంటూ సాగే ఆ జోల పాట, కుర్రాళ్ళోయ్ కుర్రాళ్ళు వెర్రెక్కి ఉన్నోళ్ళు కళ్ళాలే లేనోళ్ళు కవ్వించే సోగ్గాళ్ళు అనే కుర్రాళ్ల పాట అందమైన అనుభవంలా పాడటం నీకే సంభవం. నవ్వింది మల్లెచెండు నచ్చింది గర్ల్ ఫ్రెండు దొరికెరా మజాగ ఛాన్స్ జరుపుకో భలే రొమాన్స్ యురేకా అంటూ రోమియోల అభిలాషను తీర్చావు. నేనొక ప్రేమ పిసాసిని అంటూ భగ్నప్రేమికుల దాహం తీర్చావు. సిరిమల్లె నీవే అంటూ స్వర మల్లెల జల్లును కురిపించావు. మానసవీణపై మధుగీతాలను పలికించావు. మల్లెలతో మంతనమాడి కాటుకలంటుకున్న కౌగిలి వింతలను వినిపించావు.


వీణ వేణువైన మధురిమలను సంగీతసంసారానికి అందిచావు. ఇందువదన కుందరదన మందగమన మధుర వచనాలను, మాటరాని చిన్నదాని మనసు పలికే ఊసులను గుక్కతిప్పకుండా పాడిన నీకు ఎన్నో అభినందనలు. ఇదే పాట ప్రతీ చోట ఇలాగే పాడుకుంటాను పలుకలేని వలపులన్నీ పాటలో దాచుకుంటాను అని నీ పంథాను ప్రకటించావు. పాడుతా తీయగా అంటూ పాటల పాఠశాలలో పండితుడివై ఎన్నో పాటలను వల్లె వేయించావు, భావి గాయనీ గాయకులను తీర్చిదిద్దావు. నీ పాటను ఎంత ఆస్వాదించాం. పాట వెనుక దాగున్న అ ముచ్చట్లను అంత శ్రద్దగా ఆలకించాం. లయ రాజు ఇళయరాజా, జానకిలతో జత కలసిన ప్రతిసారి సంచలనమే. రెహమాన్ సంగీతంలో స్వరతుఫాన్. బాలుడిలా సుశీలమ్మతో పాడినా, జానకమ్మతో గళం కలిపినా, వాణీజయరాంతో కొత్త బాణీలు పాడినా, చిలకమ్మ చిటికేయంగా అంటూ చిత్రతో పాడినా ఆ యుగళగీతానికి అధిపతి నువ్వే. లలితంగా లతామంగేష్కర్ తోనూ, సున్నితంగా సునీతతోనూ, మాధుర్యంగా గీతామాధురితోనూ, రాగమాళవీయంగా మాళవికతోనూ, మనోహరంగా మనోతోనూ నీవు సాగించిన స్వరాభిషేకం అమోఘం.


కవి భావన లోంచి పల్లవించిన ప్రతి పదానికి ఒక ఆరాటం బాలు గొంతులో పల్లవై వినిపించాలని. మాటకు ప్రాణం పోస్తావు, స్పటికమంత స్వచ్ఛంగా ఉచ్చరిస్తావు, గానాన్ని ఉన్నతంగా తీర్చిదిద్దుతావు, వినమ్రుడివై వినిపింపజేస్తావు. తేరే మేరే బీచ్ మే కైసా హై ఎ బంధన్ అంటూ ఉత్తరాది శ్రోతలకు రాగబంధం వేశావు. పెహలా పెహలా ప్యార్ హై ఆంటూ ప్రేమను పంచావు. సాతియా తుమ్‌ నే కమాల్ కర్ దియా. కరోనా కాటు వల్ల మరోలోకం అయింది నీకు మజిలీ. శ్రుతిలయలను జననీ జనకులుగా భావించి రాగం తానం పల్లవి నీ మదిలో కదలాడి కడతేరినవి. ఏ దివిలో విరిసిన పారిజాతానివో ఈ భువిలో మెరిసిన పాటల సుమగంధానివి. ఆ జీవితాలాపన అక్షరాల గవాక్షాల గుండా దిగంతాల వరకు వ్యాప్తి చెందింది. సామవేద మంత్రంలా సాగే ఆ స్వరఝరి ఆగిపోయింది. తెలుగు పాట మూగబోయింది.


శ్రీధర్ వాడవల్లి

నేడు బాలసుబ్రహ్మణ్యం ప్రథమ వర్ధంతి