ఇంజనీరింగ్‌ సీట్లకు ప్రత్యేక కౌన్సెలింగ్‌.. ఎప్పటినుంచి అంటే..!

ABN , First Publish Date - 2021-11-15T13:58:31+05:30 IST

రాష్ట్రంలోని వివిధ కాలేజీల్లో మిగిలి ఉన్న..

ఇంజనీరింగ్‌ సీట్లకు ప్రత్యేక కౌన్సెలింగ్‌.. ఎప్పటినుంచి అంటే..!

ప్రస్తుతం అందుబాటులో 19,797 సీట్లు 


హైదరాబాద్: రాష్ట్రంలోని వివిధ కాలేజీల్లో మిగిలి ఉన్న ఇంజనీరింగ్‌ సీట్ల భర్తీ కోసం ఈ నెల 20 నుంచి ప్రత్యేక రౌండ్‌ కౌన్సెలింగ్‌ను నిర్వహించాలని అధికారులు నిర్ణయించారు. రెండు దశల కౌన్సెలింగ్‌ ముగిసిన తర్వాత కన్వీనర్‌ కోటాలో సుమారు 24,002 సీట్లు మిగిలి ఉన్నాయి. ఇందులో ఇంజనీరింగ్‌ కోర్సుల్లో 19,797 సీట్లు మిగలగా, ఫార్మసీ కోర్సుల్లో మరో 4,205 సీట్లు మిగిలి ఉన్నాయి. కాగా, ప్రస్తుతం సీట్లు దక్కించుకున్న అభ్యర్థులు వద్దనుకుంటే ఈనెల 18వ తేదీలోపు దానిని వదులుకోవాల్సి ఉంటుంది. మిగిలిన సీట్ల భర్తీ కోసం ఈ నెల 20వ తేదీ నుంచి ప్రత్యేక రౌండ్‌ కౌన్సెలింగ్‌ను నిర్వహించాలని నిర్ణయించారు.


ఇందులో భాగంగా ఈ నెల 20, 21వ తేదీల్లో అభ్యర్థులు వెబ్‌ ఆప్షన్లను నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. ఈ నెల 24న సీట్లను కేటాయిస్తారు. సీటు పొందిన అభ్యర్థులు ఈ నెల 24 నుంచి 26 లోపు ఫీజును చెల్లించి, రిపోర్ట్‌ చేయాల్సి ఉంటుంది. అప్పటికీ ఇంకా సీట్లు మిగిలితే...ఆయా కాలేజీలు ఈ నెల 25న స్పాట్‌ అడ్మిషన్లు నిర్వహించుకోవడానికి అధికారులు అనుమతి ఇచ్చారు. 

Updated Date - 2021-11-15T13:58:31+05:30 IST