సమస్యాత్మక ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి

ABN , First Publish Date - 2021-08-01T05:48:53+05:30 IST

హుజూరాబాద్‌లో జరుగబోయే ఎన్నికను దృష్టిలో ఉంచుకొని సమస్యాత్మక ప్రాంతాలపై, పాత నేరస్థులపై ప్రత్యేక నిఘా పెట్టామని సీపీ వి సత్యనారాయణ అన్నారు

సమస్యాత్మక ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి
సీపీ సత్యనారాయణకు పుష్పగుచ్ఛం అందజేసి శుభాకాంక్షలు తెలుపుతున్న అధికారులు

- సీపీ వి సత్యనారాయణ

హుజూరాబాద్‌ రూరల్‌, జూలై 31: హుజూరాబాద్‌లో జరుగబోయే ఎన్నికను దృష్టిలో ఉంచుకొని సమస్యాత్మక ప్రాంతాలపై, పాత నేరస్థులపై ప్రత్యేక నిఘా పెట్టామని సీపీ వి సత్యనారాయణ అన్నారు.  కరీంనగర్‌ సీపీగా బాధ్యతలు చేపట్టిన అనంతరం హుజూరాబాద్‌కు వచ్చిన ఆయనకు ఏసీపీ కోట్ల వెంకట్‌రెడ్డితో పాటు పోలీస్‌ అధికారులు పుష్పగుచ్ఛం అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా హుజూరాబాద్‌ పోలీస్‌స్టేషన్లో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ సీపీగా బాధ్యతలు తీసుకున్న అనంతరం జిల్లాలో ఉన్న అన్ని విషయాలను అవగాహన చేసుకొని పోలీస్‌ అధికారులతో సమావేశం ఏర్పాటు చేశామన్నారు. నియోజకవర్గంలో ఎటువంటి ఘర్షణ వాతావరణం లేకుండా, సామాన్య ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నామన్నారు. ప్రజలు సోషల్‌ మీడియాలో వచ్చే తప్పుడు వార్తలను నమ్మవద్దని సూచించారు. ప్రజలు శాంతియుత వాతావరణంలో పండుగలు జరుపుకునేలా కృషి చేస్తామన్నారు. శాంతియుత వాతావరణంలో ఎన్నికలు నిర్వహించేందుకు ప్రజలు పోలీసులకు సహకరించాలని ఆయన కోరారు. సమావేశంలో ఏసీపీ కోట్ల వెంకట్‌రెడ్డి, సీఐలు వి శ్రీనివాస్‌, ఎర్రల కిరణ్‌, వివిధ స్టేషన్ల సీఐలు, ఎస్‌ఐలు పాల్గొన్నారు.

ఫ నేరస్థుల కదలికలపై నిఘా కొనసాగించాలి

- డీజీపీ ఎం మహేందర్‌రెడ్డి

కరీంనగర్‌ క్రైం, జూలై 31: అలవాటుపడిన నేరస్థుల కదలికలపై నిఘా కొనసాగిస్తూ నేరాలను నియంత్రించేందుకు పోలీసులు కృషి చేయాలని డీజీపీ ఎం మహేందర్‌రెడ్డి అన్నారు. శనివారం డీజీపీ కమిషనరేట్లు, జిల్లాలకు చెందిన పోలీసు అధికారులతో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. పెండింగ్‌ కేసుల పరిష్కారం, దర్యాప్తులో నాణ్యతాప్రమాణాలు పాటించడం, వివిధ విభాగాల పనితీరుపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పెండింగ్‌ కేసులను పరిష్కరించడమే లక్ష్యంగా పోలీసు అధికారులు ముందుకు సాగాలన్నారు. బాలికలపై జరిగే అఘాయిత్యాలకు సంబంధించిన కేసులను రెండు నెలల వ్యవధిలో దర్యాప్తును పూర్తి చేసి, న్యాయస్థానాల్లో ఛార్జిషీట్‌ను దాఖలు చేయడంతోపాటు వీలైనంత త్వరగా సీసీ నంబర్లను తీసుకోవాలని అన్నారు. పోలీసు ఠాణాలలో వివిధ విభాగాల పనితీరును ప్రతిరోజు పరిశీలించాలని ఆదేశించారు. కరీంనగర్‌ కమిషనరేట్‌లోని చొప్పదండి స్టేసన్‌ జాతీయ స్థాయిలో ఎనిమిదో స్థానం, జమ్మికుంట స్టేషన్‌ 10 స్థానాలను సాధించడం గర్వకారణమని డీజీపీ అన్నారు. సీపీ వి సత్యనారాయణ మాట్లాడుతూ నిందితులకు శిక్షలు పడేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. పాతనేరస్తుల కదలికలపై నిరంతరం నిఘా కొనసాగించడంతోపాటు వారిలో సత్ప్రవర్తన తీసుకువచ్చేందుకు చర్యలను తీసుకుంటామని చెప్పారు. కార్యక్రమంలో అడిషనల్‌ డీసీపీలు చంద్రమోహన్‌, అశోక్‌, ఏసీపీ మదన్‌లాల్‌, కమ్యునికేషన్‌ డీఎస్‌పీ శ్రీనివాస్‌, సీసీఆర్‌బీ సీఐ రవి, సైబర్‌ ఫోరెన్సిక్‌ ల్యాబ్‌, ఐటీ సెల్‌ ఇన్‌చార్జి తోట మురళి, ఇతర అధికారులు పాల్గొన్నారు. 


Updated Date - 2021-08-01T05:48:53+05:30 IST