టీఆర్ఎస్‌కు మరో అగ్నిపరీక్ష

ABN , First Publish Date - 2021-03-03T23:44:09+05:30 IST

తెలంగాణ రాష్ట్ర సమితి ఎదుర్కొంటున్న మరో అగ్ని పరీక్ష నల్గొండ, ఖమ్మం, వరంగల్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నిక. సిట్టింగ్ ఎమ్మెల్సీ సిద్ధంగా ..

టీఆర్ఎస్‌కు మరో అగ్నిపరీక్ష

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర సమితి ఎదుర్కొంటున్న మరో అగ్ని పరీక్ష నల్గొండ, ఖమ్మం, వరంగల్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నిక. సిట్టింగ్ ఎమ్మెల్సీ సిద్ధంగా ఉన్నా చివరి నిమిషం వరకు అభ్యర్థిని ప్రకటించకుండా టీఆర్ఎస్ అధినేత మీనమేషాలు లెక్కించారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో అర్థబలంతోనే గెలవమనే అభిప్రాయంతో చివరికి మళ్లీ సిట్టింగే టికెట్ ఇచ్చారు. అయితే ఆ గెలుపు నల్లేరుపై నడకలా లేదు. ఆ ఎన్నిక అధికార పార్టీ తేలిగ్గా పరిస్థితి లేదు. 


సిట్టింగ్ ఎమ్మెల్సీ అర్థికంగా బలవంతుడే అయినా ఆయన గడిచిన పదవీకాలంలో ప్రజలకు చేసిందేమీ లేదనే విమర్శలు బలంగా ఉన్నాయి. పైగా ఆయన కేసీఆర్‌కు దగ్గరే కానీ ప్రజలకు ఏనాడూ దగ్గరగాలేరనే ఆరోపణలు ఉన్నాయి. నిజానికి కూడా పల్లా రాజేశ్వర్‌ రెడ్డి విద్యా, వ్యాపారవేత్తగా సుపరిచితుడే అయినా ప్రజలకు గానీ, కార్యకర్తలకు గానీ ఆయన చేసింది శూన్యం. అయితే కేసీఆర్‌కు అత్యంత విశ్వసనీయుడిగా ఉంటూ అధినేత అప్పజెప్పే పార్టీ పనులను సమర్థవంతంగా చక్కబెట్టే నేతగా పేరు తెచ్చుకున్నారు రాజేశ్వర్‌ రెడ్డి. 


అయితే ఎమ్మెల్సీగా గెలిచిన తర్వాత ఆయన బాధ్యత లేని ప్రజా ప్రతినిధిగా వ్యవహరించారనే విమర్శలు ఇప్పుడు ప్రత్యర్థుల చేతిలో అస్త్రాలు. ఇంత వ్యతిరేకతలోనూ రాజేశ్వర్‌ రెడ్డి‌కి కలిసి వచ్చే కీలకమైన అంశం ఏదైనా ఉందంటే అది ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలిపోవడం. ఇక్కడ బరిలో విపక్షాలతో పాటు ప్రొఫెసర్ కోదండరాం, రాణీరుద్రమ, తీన్మార్ మల్లన్న వంటి సుపరిచితులు పోటీ పడుతున్నారు. దీంతో టీఆర్ఎస్‌ను ఓడించాల్సిన ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలికలు, పేలికలై పోతోంది. దీంతో సొంత ఓటు బ్యాంకును కాపాడుకోగలిగితే చాలు తన గెలుపు సులభం అని టీఆర్ఎస్ భావిస్తోంది. 


Updated Date - 2021-03-03T23:44:09+05:30 IST