Abn logo
Feb 3 2020 @ 13:42PM

ప్రచురణ రంగంలో నిశ్శబ్ద విప్లవం హెచ్‌బిటి

‘‘గ్రంథ ప్రచురణ, పఠనం, వినిమయం, తదితర అకడమిక్‌ అంశాల పట్ల, రెండు తెలుగు రాష్ట్రాల ఉదాసీన వైఖరివల్ల ఆశాభంగం చెందుతున్నాను.’’

గీత రామస్వామి 

ప్రాథమిక స్థాయిలో తెలుగు ప్రచురణలు మిషనరీల చొరవతో వెలువడ్డాయి. సాహిత్య, సామాజిక, రాజ కీయ, మత, ఐతిహాసిక గ్రంథాలు ఇరవయ్యో శతాబ్దపు తొలి దశాబ్దాల్లో అచ్చుకు నోచుకున్నాయి. అప్పటి ప్రముఖ ప్రచు రణ సంస్థలు వావిళ్ళ, వేదం వారు. ఆంధ్ర ప్రచారిణీ గ్రంథ మాల, విజ్ఞాన చంద్రికా గ్రంథ మండలి, ఆంధ్ర భాషాభి వర్ధనీ సమాజం, విశ్వ సాహిత్య గ్రంథమాల (ముంగండ), ఆదర్శ గ్రంథమండలి, దేశి కవితా మండలి, యం. శేషాచలం అండ్‌ కో, నవోదయ, ప్రజాశక్తి, విశాలాంధ్ర, అణా గ్రంథ మాల... మరెన్నో సంస్థలు తెలుగు ప్రచురణలను సుసంపన్నం చేశాయి. 

ఈ కోవకు చెంది, ప్రగతిపూర్వక లక్ష్యాలతో, సామాజిక స్ఫూర్తితో మొదలైన సంస్థ హైదరా బాద్‌ బుక్‌ ట్రస్ట్‌ (హెచ్‌.బి.టి). సి.కె.నారాయణ రెడ్డి (సి.కె), సిరిల్‌ తదితరులు ట్రస్టీలుగా, తెలుగు భాష పరిచయంలేని, తెలుగు ప్రచురణల గూర్చి, తెలుగువారి జీవనశైలితో పరిచయం లేని, తమిళనాడుకు చెందిన గీత మేనేజింగ్‌ ట్రస్టీగా, యస్‌.ఆర్‌. శంకరన్‌, సి. పద్మనాభరెడ్డి, మహీధర రామమోహనరావు, కంభంపాటి సత్యనారాయణ, బొజ్జా తారకం, షరీఫ్‌ లాంటి పెద్దల సలహా సంప్రదింపులతో, ట్రస్టు పని చేయడం మొదలైంది. క్రమేపీ తెలుగు చద వడం, రాయడం నేర్చుకుని, ప్రచురణ ప్రక్రియలో ఓనమాలు దిద్దుకుని, ఊరూరా తిరిగి, తెలుగు భాషాసంస్కృతులపై అవగాహనతో ప్రచురణ లను మొదలుపెట్టారు గీత. ఆంగ్లంలో బహుళ ప్రాచుర్యం పొంది, తెలుగు పాఠకులకు అందు బాటులోలేని సాహిత్య ప్రక్రియల్లోని గ్రంథాలను తెలుగులోకి అనువదించి, ప్రచురించడం మొదలుపెట్టారు. 

1980లో మొదలైన ప్రచురణ ప్రక్రియలో భాగంగా, ఆ సంవత్సరం వెలువడ్డ అనువాద నవలలు ‘రక్తాశ్రువులు’, ‘స్పార్టకస్‌’, ‘ఏడుతరాలు’, ‘కూలీగింజలు’. చరిత్ర విభాగంలో అనువాదాలు ‘చరిత్ర అంటే ఏమిటి’ (ఇ.హెచ్‌.కార్‌), ‘చరిత్రలో ఏం జరిగింది’ (గార్డన్‌ చైల్డ్‌) వచ్చాయి. ఇంకా డి.డి. కొశాంబి, రొమిలా థాపర్‌, బిపిన్‌ చంద్ర, వెండీ డొనిగర్‌, కంభంపాటి లాంటి చరిత్రకారులతోపాటు, యువ చరిత్రకారులు భాంగ్యా భూక్యా, అడపా సత్యనారాయణల గ్రంథాలూ వెలువడ్డాయి.

 జీవిత చరిత్రలు, జ్ఞాపకాల విభాగంలో, ప్రధాన స్రవంతితో పాటు, ముఖ్యంగా స్త్రీల చరిత్రలు -- ప్రధాన స్రవంతిలో లేని -- రేవతి (ట్రాన్స్‌జెండర్‌), నళిని (సెక్స్‌ వర్కర్‌), పూలన్‌ దేవి- వీరేగాక, బొజ్జా తారకం, సి.కె. నారాయణరెడ్డి, కొండపల్లి కోటేశ్వరమ్మ, చేగువేరా, సావిత్రీఫూలే, మార్టిన్‌ లూథర్‌ కింగ్‌-- వ్యక్తిపర జీవిత కథల నుండి, రాజకీయ నాయకుల జీవిత వర్ణనల వరకూ, అంతవరకూ తెలుగు పాఠకులకు అందని మరెన్నో గ్రంథాలు వెలువరించారు. 

సమాజాన్ని ముక్కలు ముక్కలుగా చీల్చి, వేధిస్తున్న కుల వ్యవస్థ గూర్చి అంబేడ్కర్‌ రచనల నుండి సేకరించి, ప్రచు రించడం ద్వారా, కుల వ్యవస్థలోని అగ్రకుల ఆధిపత్యాన్ని, కుళ్ళును బహిర్గతం చేసి, సమకాలీనంగా జరుగుతున్న, కులాధిపత్య వ్యతిరేక ఉద్యమాలకు ఊతం కలిపించారు. 

స్వయం సహాయక రంగానికి సంబంధించి, ఆరోగ్యం (‘వైద్యుడు లేని చోట’), పౌర హక్కులు, స్త్రీల అధ్యయనాలు, పిల్లల పెంపకం, చదువులు ‘‘వీటిలో మేమే ముందున్నాం’’ అంటున్నారు గీత. 

కాల్పనిక సాహిత్యంలో, ప్రఖ్యాత నవలాకారులు, మహాశ్వేతాదేవి, జయ కాంతన్‌, శివరామకారంత్‌, బిభూతి భూషణ్‌ బంధోపాధ్యాయ, ఇస్మత్‌ చుగ్‌ తాయ్‌, కేశవరెడ్డి తదితర ప్రఖ్యాత నవలాకారుల అనువాదాలను, తెలుగు ఒరిజినల్స్‌ను ప్రచురించారు.

 జీవిత చరిత్రలు, స్వీయ చరిత్రల విభాగం విస్తృతిని, వైవిధ్యాన్ని సంతరించుకుంది. 

స్వల్ప పెట్టుబడితో, యితరేతర సంస్థల, రాజకీయ పక్షాల ప్రమేయం లేకుండా, తాను ప్రచురిస్తున్న గ్రంథాల పట్ల పెరుగుతున్న ఆసక్తి, అభిమానాలతో, రెండు దశాల్లో నాలుగు వందల గ్రంథాలను బుక్‌ ట్రస్ట్‌ ప్రచురించింది. సగటున సంవత్సరానికి ఇరవై గ్రంథాలు. వాసిలో ఘనతర మైనా రాశిలో యీ సంఖ్య పేరొందిన ప్రచురణ సంస్థలతో సరితూగదు.

 బుక్‌ ట్రస్ట్‌ నిర్వహించడంలో గీత కొన్ని అనుభవాలను పంచుకొంది. ‘‘రచయితలు రాసిందే వేదమని అనుకొంటారు. ఇందులో అసహజమేముంది? వారి గ్రంథాలను సమ రచ యితల చేత బేరీజు వేయడాన్ని నిరాకరిస్తారు. ఇంతకంటె ముఖ్యం గ్రంథ ప్రచురణ, పఠనం, వినిమయం, తదితర అకడమిక్‌ అంశాల పట్ల, రెండు తెలుగు రాష్ట్రాల ఉదాసీన వైఖరివల్ల ఆశాభంగం చెందుతున్నాను,’’ అని గీత విచారం వ్యక్తంచేశారు. గ్రంథాలయ ఉద్యమంలో భాగంగా సంబంధిత ప్రభుత్వ శాఖలతో నాలుగు దశాబ్దాలుగా తనకున్న చేదు అనుభవాన్ని వెలిబుచ్చారు. వాస్తవాలను జీర్ణించుకోవడంలో గీతకు కొన్ని సమస్యలున్నాయి.

 గ్రంథాలయాలు, ప్రసిద్ధమై నవి గూడ, నిధులు లేక, అంకిత భావంతో పనిచేసేవారు కరువై అనాధలయ్యాయి. ఒకప్పుడు అధ్యయన వెలుగులు విరజిమ్మిన సంస్థలను ఆదుకునే నాధుడు లేడు. నిత్య పఠనం, ఆరోగ్యకర చర్చలు, విజ్ఞాన వినిమయం లేని యాంత్రిక సమాజంలో ఉన్నామని గీతకూ తెలుసు. పైగా పొరుగున వున్న కర్నాటక, తమిళనాడు ప్రభుత్వాలతో పొల్చి చూస్తే, నిరాశే మిగులుతున్నదని ఆమె అభిప్రాయం. అలసి, విసిగి వేసారి దాదాపు ఒంటరిగా హెచ్‌బిటి భారం మోసిన గీత ప్రస్తుతం నిరాసక్తంగా వున్నారనిపిస్తుంది. చదువరుల సంఖ్య తగ్గి, గ్రంథ ప్రచురణ ప్రక్రియ తట్టుకోలేని నష్టాలకు దారి తీస్తున్నందుకా? మార్కెట్‌లోకి క్రమేపీ చొరబడుతున్న ఈబుక్స్‌ వల్లనా? 

హెచ్‌బిటి చేపట్టి, సాగించిన కృషికి ఆలంబనం భారతీయ సమాజంలోని వైవిధ్యం (diversity) అంటున్నారు గీత. ఒక తమిళ అమ్మాయి, తెలుగు ప్రాంతానికి వచ్చి, తెలుగు చదవడం రాయడం నేర్చుకొని, ప్రచురణ ప్రక్రియలో ఓనమాలు దిద్దుకొని, పట్టణాలకు, పల్లెలకూ తిరిగి, రద్దీ ప్రాంతాల్లో, బస్‌స్టాండుల్లో, పుస్తకాలు అమ్మి, ఉత్తములూ సౌజన్యవంతుల నేతృత్వంలో సాధించిన కృషి గురించి ఆమె ఇలా అంటున్నారు: ‘‘నేను చేసినదేదో గొప్ప కృషి అనుకోవడం లేదు. ఆది నాకొక ఆర్తిని, మానసిక ధైర్యాన్ని కలిగించి, ఆపద సమయాలను ఎదుర్కొనే టట్టు చేసింది. 

పఠనాసక్తి తగ్గుతోంది. జ్ఞానాభివృద్ధికి దోహదం చేసే సామాజిక వర్గాలు, విద్యావంతులు ఆ కృషి చేస్తున్నారా? నా కృషిలో ఇంతవరకూ సంస్థాపర (establishment) ఆటంకాలు లేవు. ప్రస్తుతం దేశంలో భయ వాతావరణం నెలకొని వుంది. డిజిటల్‌ మీడియం వేగంగా చోటు చేసు కుంటున్నది. నా శక్తి మేరకు కృషి చేశానన్న సంతృప్తి వుంది. ఇప్పటి వరకూ లభించిన ప్రోత్సాహం, సహాయ సహకా రాలు, భవిష్యత్‌లో కొనసాగుతాయన్న నమ్మకం ఉంది’’.

 

వకుళాభరణం రామకృష్ణ

(హైదరాబాద్‌ బుక్‌ ట్రస్ట్‌

నాలుగు దశాబ్దాలు పూర్తి చేసుకున్న సందర్భంగా)

Advertisement
Advertisement
Advertisement