Abn logo
Sep 21 2021 @ 00:14AM

హరిహరులకు విశేష పూజలు

చరమూర్తులకు ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్న అర్చకుడు

యాదాద్రి టౌన్‌, సెప్టెంబరు 20: గుట్ట లక్ష్మీనరసింహస్వామి సన్నిధి లో హరిహరులకు సోమవారం విశేష పూజలు శాస్త్రోక్తంగా కొనసాగాయి. వేకువజామున సుప్రభాతం, అనంతరం నిత్యారాధనలు సంప్రదాయరీతిలో నిర్వహించారు. బాలాలయంలోని కవచమూర్తులను సువర్ణ పుష్పాలతో అ ర్చించిన అర్చకులు మండపంలో ఉత్సవమూర్తులను పంచామృతాలతో అభిషేకించారు. అనంతరం సుదర్శన హోమం, నిత్య తిరుకల్యాణ పర్వాలు ఆగమశాస్త్ర రీతిలో వైభవంగా కొనసాగాయి. ఆలయంలో సువర్ణపుష్పార్చనలు, అష్టోత్తర పూజలు కొనసాగాయి. అనుబంధ శివాలయంలో రామలింగేశ్వరుడికి,దర్శన క్యూకాంప్లెక్స్‌లో కొలువుదీరిన చరమూర్తులకు నిత్యపూజాకైంకర్యాలు శైవాగమ పద్ధతిలో నిర్వహించారు.అష్టోత్తర శతరుద్రాభిషేకం, బిల్వార్చన నిర్వహించారు. కాగా, స్వామి వారికి భక్తుల ద్వారా రూ.8,29,355 ఆదా యం సమకూరింది. యాదాద్రిక్షేత్రంలో సాయంత్రం కురిసిన ముసురుతో ఆలయ పునర్నిర్మాణ పనులకు ఆటంకం ఏర్పడింది. పట్టణ రోడ్లు, ఘాట్‌రోడ్‌ ప్రాంతాలు వరదతో నిండటంతో భక్తులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు.