ప్రత్యేక రాష్ట్ర ప్రకటన నాడే విముక్తి పండగ

ABN , First Publish Date - 2021-09-16T06:14:25+05:30 IST

డెబ్భైఐదు వసంతాల స్వతంత్ర భారతదేశంలో ఒక్కో ప్రాంతానికి ఒక్కో చరిత్ర, ఒక్కో చరిత్ర వెనుక మరపురాని జ్ఞాపకాలు ఎన్నో ఉన్నాయి. అలాంటి వాటిలో నిత్య పోరాటాల గడ్డ, తిరుగుబాటుకు దిక్సూచి మన తెలంగాణ. బ్రిటిష్ వలసవాదుల ప్రత్యేక పాలనకు దూరంగా, నిజాం నిరంకుశత్వ పాలనలో హైదరాబాద్...

ప్రత్యేక రాష్ట్ర ప్రకటన నాడే విముక్తి పండగ

డెబ్భైఐదు వసంతాల స్వతంత్ర భారతదేశంలో ఒక్కో ప్రాంతానికి ఒక్కో చరిత్ర, ఒక్కో చరిత్ర వెనుక మరపురాని జ్ఞాపకాలు ఎన్నో ఉన్నాయి. అలాంటి వాటిలో నిత్య పోరాటాల గడ్డ, తిరుగుబాటుకు దిక్సూచి మన తెలంగాణ. బ్రిటిష్ వలసవాదుల ప్రత్యేక పాలనకు దూరంగా, నిజాం నిరంకుశత్వ పాలనలో హైదరాబాద్ రాష్ట్రంగా ప్రస్థానం మొదలుపెట్టి ఆంధ్రా ఆధిపత్య వలసవాదుల చెర నుంచి విముక్తి పొంది స్వతంత్ర తెలంగాణ రాష్ట్రంగా అవతరించే వరకు నిత్యం ఎన్నో అవమానాలకు గురై నిత్య బానిసత్వంలో మగ్గిన తెలంగాణ సమాజపు వెతల చరిత్ర వర్ణనాతీతం. వక్రీకరించిన తెలంగాణ ప్రజల విమోచనలో కొన్ని కీలక ఘట్టాలు మనకు వాస్తవిక తెలంగాణ ప్రజల విమోచనను గుర్తుచేస్తాయి.


18వ శతాబ్దం తొలినాళ్ళలో అంటే 1724 సంవత్సరం మొదలుకుని 20వ శతాబ్దం అర్ధభాగం, 1948 సెప్టెంబరు వరకు స్వయం ప్రతిపత్తి కలిగిన స్వతంత్ర హైదరాబాద్ రాష్ట్రంగా నిజాం నిరంకుశత్వ పాలనలో తెలంగాణ ప్రజలు పడిన అవస్థలు గోసలు ఎన్నో తిరుగుబాటు పోరాటాలకు స్ఫూర్తిగా నిలిచాయి‌. నిజాం పరిపాలనలో మొత్తంగా 19 జిల్లాలు ఉండేవి. తరువాతి కాలంలో పరిపాలన సౌలభ్యం కొరకు హైదరాబాద్ రాష్ట్రాన్ని 4 డివిజన్లుగా, 16 జిల్లాలుగా విభజించారు. అందులో తెలంగాణ ప్రాంతంలో 9 జిల్లాలు, కర్ణాటక ప్రాంతం నుంచి 3 జిల్లాలు, మహారాష్ట్ర నుంచి 4 జిల్లాలు మొత్తంగా 16 జిల్లాలు ఉండేవి. 


బ్రిటిష్ వలసవాదులపై నిరంతర పోరాటాలతో భారతదేశ ప్రజలకు ఎట్టకేలకు 1947 ఆగష్టు 15వ తేదీన స్వాతంత్ర్యం సిద్ధించినా, హైదరాబాద్ రాష్ట్ర ప్రజలు మాత్రం నిజాం కనుసన్నల్లో బానిసలుగానే బతికారు. నిజాం నియంతృత్వ పాలన నుంచి, ఆయన ప్రత్యేక సైన్యమైన రజాకార్ల అరాచకాల నుంచి హైదరాబాద్ రాష్ట్ర ప్రజల విముక్తి కోసం నాటి భారత ఉప ప్రధాని సర్దార్ వల్లభభాయ్ పటేల్ ఆధ్వర్యంలో జెఎన్ చౌదరి నేతృత్వంలో ‘ఆపరేషన్ పోలో–1948’ జరిగింది. సెప్టెంబరు 13 నుంచి సెప్టెంబరు 18 వరకు జరిగిన పోలీస్ యాక్షన్‌తో నిజాం మీర్ ఉస్మాన్ అలీఖాన్ సెప్టెంబరు 17న భారత ప్రభుత్వానికి లొంగిపోతున్నట్టుగా ప్రకటించారు. దానితో, నిజాం చర నుంచి విముక్తి దొరికినా, తరువాత జరిగిన పరిణామాలతో మీర్ ఉస్మాన్ అలీఖాన్‍కు రాజప్రముఖ్‍గా గుర్తింపునిచ్చారు. ‘ఆపరేషన్ పోలో’లో కీలక భూమిక పోషించిన జెఎన్ చౌదరి మిలిటరీ గవర్నర్ హోదాలో డిసెంబరు 1, 1949 వరకు హైదరాబాదు రాష్ట్రాన్ని పరిపాలించారు. తరువాత స్వతంత్ర భారతదేశంలో ఎన్నిక ద్వారా గాక కేంద్రప్రభుత్వం ద్వారా నియమితుడైన తొలి, చివరి ముఖ్యమంత్రి యం.కె. వెల్లోడి నేతృత్వంలో మార్చి 6, 1952 నుంచి సుమారుగా 770 రోజులు హైదరాబాద్ రాష్ట్ర పరిపాలన కొనసాగింది.


ఉద్యోగ ఉపాధి అవకాశాలలో స్థానికులకే అధిక ప్రాధాన్యం ఇవ్వాలని, తక్షణమే ముల్కీ నిబంధనలు అమలు జరపాలనే డిమాండ్‌తో రాజుకున్న ముల్కి ఉద్యమాన్ని తప్పుదోవ పట్టించే క్రమంలో ఆధిపత్య రాజకీయ ఎత్తుగడలు సాగాయి. ఫలితంగా 1953లో ప్రత్యక్ష ఎన్నికల విధానంలో ఎన్నికైన బూర్గుల రామకృష్ణారావు హైదరాబాద్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా అక్టోబరు 31, 1956 వరకు  కొనసాగారు. అదే సమయంలో 1953లో మద్రాసు నుంచి రాయలసీమ, కోస్తాంధ్రలోని 11 జిల్లాలు విడిపోయి ఆంధ్ర రాష్ట్రం ఏర్పాటు జరిగింది. టంగుటూరి ప్రకాశం పంతులు ఆ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వర్తించారు. డిసెంబరు 1953లో కేంద్రప్రభుత్వం ఫజల్ అలీ నేతృత్వంలో భాషా ప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటు కోసం ఫజల్ అలీ కమిషన్ను నియమించింది. ఆ కమిషన్ నివేదిక ఆధారంగా రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ చట్టం 1956 పరిమితులకు లోబడి హైదరాబాద్ రాష్ట్రంలోని తెలంగాణ తొమ్మిది జిల్లాలను ఆంధ్రరాష్ట్రంలోని రాయలసీమ, కోస్తాంధ్ర జిల్లాలతో కలిపి నవంబర్ 1, 1956లో తేదీన ఆంధ్రప్రదేశ్ ఏర్పడింది.


ఆ తర్వాత తెలంగాణ జిల్లాల మీద ఆంధ్ర వలసవాదుల ఆధిపత్యం కొనసాగుతూనే వచ్చింది. తెలంగాణ ప్రజలు వలసవాదుల విముక్తి కోసం మరో ఉద్యమం అనివార్యం అని భావించారు. తెలంగాణ ప్రజాసమితి నేతృత్వంలో 1969 నుంచి 1971 వరకు సుమారు 360 మంది ఉద్యమకారులు తుపాకీ తూటాలకు ఎదురొడ్డి రక్తతర్పణతో పోరాటం చేశారు. 1971లో జరిగిన పార్లమెంటు ఎన్నికలలో తెలంగాణలోని 12 పార్లమెంటు నియోజకవర్గాలలో పదకొండింటిలో నియోజక వర్గాలలో తెలంగాణ ప్రజా సమితి గెలుపొందింది. కానీ, రాజకీయ స్వప్రయోజనాల కోసం నాయకులు చేసిన మోసంతో అది నీరుగారి పోయింది‌.


వలసవాదుల ఆరాచకాలపై పోరాడుతూ, నిత్యం ప్రజాక్షేత్రంలో మమేకమై తమ‌ ఆటపాటలతో ప్రజా చైతన్యానికి దారులు వేస్తూ, తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఆకాంక్షను ప్రజల ఆలోచనల్లో భాగం‌ చేస్తూ‌ ప్రజా చైతన్య రథసారథులుగా వెలుగొందిన బెల్లి లలితక్క, మారోజు వీరన్న లాంటి అనేక మంది ఉద్యమకారులు, కళాకారులను అతికిరాతకంగా హత్య చేశాయి వలసవాద ఆధిపత్య వర్గాలు. ఈ కుట్రలపై తెలంగాణ ప్రజానీకం ఉలిక్కిపడి కన్నెర్ర జేసింది‌. అలా రాజుకున్న ప్రత్యేక రాష్ట్ర ఆకాంక్ష దావానంలా వ్యాపించింది. డిసెంబరు 9, 2009న కేంద్ర మంత్రి పి.చిదంబరం ప్రకటనతో కొంత ఉపశమనం కలిగింది. కానీ, మళ్ళీ ఆధిపత్య రాజకీయ ఎత్తుగడలు ఆజ్యం పోసుకున్నాయి. అప్పుడే ఆట పాట మాట, ఉద్యమ తూటాలతో, ఆత్మబలిదానాలతో, త్యాగధనుల నిర్విరామ కృషితో తెలంగాణలో స్వరాష్ట్ర కాంక్ష ఉప్పెనై ఎగసింది. 2014 సంవత్సరంలో ఫిబ్రవరి 18న లోక్‌సభలోనూ, ఫిబ్రవరి 20న రాజ్యసభలోనూ తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు బిల్లుకు ఆమోదం లభించింది. మార్చి 1న గెజిట్ ప్రకటన విడుదల ద్వారా వలసవాదుల నుంచి తెలంగాణకు విముక్తి లభించింది. మార్చి 4న కేంద్ర ప్రభుత్వం జూన్ 2వ తేదీని తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవంగా జరుపుకోవాలని డిక్లరేషన్ ఇచ్చింది.


ఇలా హైదరాబాద్ రాష్ట్రం పేరిట నిజాం నిరంకుశత్వం నుంచి, భాషా ప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటు పేరిట ఆంధ్రా వలస దోపిడీ వరకు నిత్యం ఎవరో ఒకరి కింద తెలంగాణ ప్రజా జీవితం బానిస బతుకే అయింది. చివరికి తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైనట్లు ఆనాటి రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఆమోద ముద్రతో గెజిట్ ప్రకటన వెలువడిన మార్చి 1వ తేదీనే వలసవాదుల నుంచి తెలంగాణ ప్రజలకు నిజమైన విముక్తి లభించింది. కాబట్టి ఆ ప్రకటన తేదీనే తెలంగాణ ప్రజల విముక్తి దినోత్సవంగా జరపాలి. అదే తేదీని తెలంగాణ అమరవీరుల దినోత్సవంగా ప్రతి ఏటా నిర్వహించాలి. కేంద్ర ప్రభుత్వం జూన్ 2 తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం జరుపుకోవాలని డిక్లరేషన్ ఇచ్చిన మార్చి 4ను తెలంగాణ ఉద్యమకారులు, త్యాగధనుల దినోత్సవంగా నిర్వహించాలి.

గాదె ఇన్నయ్య

మాద శ్రీధర్

Updated Date - 2021-09-16T06:14:25+05:30 IST