HYD : ధర కాస్త ఎక్కువైనా.. ఈ-బైక్‌.. యమా జోర్‌..!

ABN , First Publish Date - 2021-12-13T18:34:03+05:30 IST

పెట్రోలు, డీజిల్‌ ధరలు భారంగా మారడంతో ధరలు కాస్త ఎక్కువైనా ఎలక్ట్రిక్‌ బైక్‌లు, స్కూటీలు కొనేందుకు ప్రజలు ఆసక్తి చూపుతున్నారు...

HYD : ధర కాస్త ఎక్కువైనా.. ఈ-బైక్‌.. యమా జోర్‌..!

  • 2-4 యూనిట్ల కరెంట్‌తో..
  • 80-150 కిలోమీటర్ల పరుగులు
  • ఎలక్ట్రిక్‌ వాహనాలకు పెరుగుతున్న క్రేజ్‌
  •  రూ.15 వేలకే చార్జింగ్‌ స్టేషన్‌
  • రూ.75 వేలతో ఈ-ఆటోలుగా మారనున్న డీజిల్‌ ఆటోలు!
  • ‘గో ఎలక్ట్రిక్‌ క్యాంపెయిన్‌’లో ప్రత్యేక ఆకర్షణగా ఈవీలు

హైదరాబాద్‌ సిటీ : పెట్రోలు, డీజిల్‌ ధరలు భారంగా మారడంతో ధరలు కాస్త ఎక్కువైనా ఎలక్ట్రిక్‌ బైక్‌లు, స్కూటీలు కొనేందుకు ప్రజలు ఆసక్తి చూపుతున్నారు. కొవిడ్‌ ప్రభావంతో ఏడాదిగా ఎలక్ట్రిక్‌ వాహనాల(ఈవీ) తయారీలో కొంత స్తబ్దత నెలకొన్నా ఇటీవల భిన్న రకాల ఈవీలు మార్కెట్లోకి వస్తున్నాయి. 2 నుంచి 4 యూనిట్ల కరెంట్‌తో 80-150 కిలోమీటర్లు నడిచే ఈ-బైక్‌లు, స్కూటీలు కొనేందుకు నగర వాసులు ఆసక్తి చూపిస్తుండడంతో ఈవీలకు డిమాండ్‌ భారీగా పెరుగుతోందని డిస్ట్రిబ్యూటర్లు చెబుతున్నారు. 


ఈ-ఆటోలు, రవాణా వాహనాలతో పాటు కార్లు కొనేందుకు వస్తున్న వారి సంఖ్య పెరిగిందని నిర్వాహకులు చెబుతున్నారు. రూ.75 వేల ఖర్చుతో రెట్రోఫిట్‌ సంస్థ వారు ఒక్కరోజులో డీజిల్‌ ఆటోలను ఎలక్ట్రిక్‌ ఆటోలుగా మార్చేస్తున్నారు. బ్యాటరీకి అదనంగా డబ్బు తీసుకుంటామని నిర్వాహకులు చెబుతున్నారు. రూ.27 వేలకు పెట్రోల్‌తో నడిచే స్కూటీలను ఈ-స్కూటీలుగా మార్చేస్తామని, ప్రస్తుతం బెంగళూరులో వెయ్యికి పైగా వాహనాలను మార్చినట్లు తెలిపారు. హైదరాబాద్‌లో బుకింగ్స్‌ తీసుకుంటున్నామని జనవరి నుంచి ఈ విధానం అందుబాటులోకి తీసుకొస్తామని నిర్వాహకులు చెప్పారు. ఈ- బైక్‌లు, స్కూటీలతో పాటు ఆటోలు, కార్లు ‘గో ఎలక్ట్రిక్‌’ క్యాంపెయిన్‌లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.


రూ.15 వేలకే చార్జింగ్‌ స్టేషన్‌..

అపార్ట్‌మెంట్లు, గేటెడ్‌ కమ్యూనిటీలు, ఆఫీసుల్లో ద్విచక్ర, త్రిచక్ర వాహనాల కోసం వాల్టీ ఎన్‌ఎక్స్‌టీ ఎనర్జీ సంస్థ ప్రత్యేకంగా రూపొందించిన చార్జింగ్‌ స్టేషన్‌ను రూ.15 వేలకే అందుబాటులోకి తెచ్చారు. ఒక్క చార్జింగ్‌ స్టేషన్‌లో ఒకేసారి నాలుగు వాహనాలు చార్జ్‌ చేసుకునేలా రూపొందించారు. 3.3 కేవీ చార్జర్‌ కావడంతో వాటిని ఎక్కడైనా ఏర్పాటు చేసుకోవచ్చని నిర్వాహకులు చెబుతున్నారు. చార్జింగ్‌ స్టేషన్లలో విద్యుత్తు శాఖ ఒక్కో యూనిట్‌కు రూ.6 వసూలు చేస్తుండగా, ప్రైవేటు స్టేషన్లలో యూనిట్‌కు రూ.16 వరకు వసూలు చేస్తున్నారు.


స్పోర్ట్స్‌ బైక్‌.. 4 యూనిట్లతో 140 కి.మీ.

ఓహెచ్‌ఎం ఆటోమేటిక్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ ఈవీఓక్యూఐఎస్‌ స్పోర్ట్స్‌ బైక్‌ 4 యూనిట్ల ఖర్చుతో 140 కి.మీ. ప్రయాణించనుంది. దీన్ని 6 గంటలు చార్జ్‌ చేయాలి. 80-100 కి.మీ. వేగంతో వెళ్లనున్న ఈ బైక్‌ ఆన్‌రోడ్‌  ధర రూ.1.76 లక్షలుగా ఉంది. సింగిల్‌ ఫేస్‌ చార్జర్‌ కావడంతో ఎక్కడైనా ఈ బైక్‌ను చార్జ్‌ చేసుకోవచ్చు. ఇక ఓడీజీఈఎస్ఎస్ఈ ఆఫ్‌ ప్లస్‌ స్కూటీ 50 కి.మీ వేగంతో వెళ్తుంది. 4 గంటలపాటు చార్జ్‌ చే స్తే 3 యూనిట్ల ఖర్చుతో 150 కి.మీ. నడుస్తుంది. జూమ్‌ స్కూటీ 3 యూనిట్ల ఖర్చుతో 60 కి.మీ. ప్రయాణించనుంది. ఈవీలతో పాటు గో ఎలక్ట్రిక్‌ క్యాంపెయిన్‌లో సైకిళ్లు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి. 2 గంటలు చార్జ్‌ చేస్తే 2 యూనిట్ల ఖర్చుతో 60 కి.మీ. నడిచే సైకిళ్లను మోటో వోల్ట్‌ సంస్థ అందుబాటులోకి తీసుకొచ్చింది. చార్జింగ్‌ లేకపోతే పెడళ్లతో తొక్కే సౌకర్యం ఈ సైకిళ్లకు ఉంది.


వన్‌ ఈ-బైక్‌ ధర రూ.1.45 లక్షలు

వన్‌ ఈ-బైక్‌ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. నేరుగా బ్యాటరీని టైర్లకు లింక్‌ చేయడంతో ఈ బైక్‌ 90 కి.మీ. వేగంతో దూసుకెళ్తుంది. ఆన్‌రోడ్‌ ధర 1.45 లక్షలని, ఒక్కసారి చార్జ్‌ చేస్తే 2 యూనిట్ల ఖర్చుతో 120 కి.మీ. వెళ్తుందని నిర్వాహకులు చెబుతున్నారు.


అథెర్‌ స్మార్ట్‌ స్కూటీ..

నగర రోడ్లపై 1500 పైగా అథెర్‌ స్కూటీలు పరుగులు పెడుతున్నాయి. 5 గంటలు చార్జింగ్‌ అయితే 3 యూనిట్ల విద్యుత్తు ఖర్చుతో 85 కి.మీ. వెళ్లనుంది. స్మార్ట్‌ టెక్నాలజీ వినియోగించి చార్జింగ్‌ ఎంతవరకు ఉందో ముందే తెలుసుకోవచ్చు. చార్జింగ్‌ స్టేషన్లు ఎక్కడ ఉన్నాయి? ఎంత సేపు చార్జి అయితే ఎన్ని యూనిట్ల కరెంటు ఖర్చయ్యిందో కూడా తెలుసుకోవచ్చు. ఈ స్కూటర్‌పై మూడేళ్ల వారంటీ ఇస్తున్నారు.


చార్జింగ్‌ స్టేషన్లతో యువతకు ఉపాధి..

రాబోయే రోజుల్లో పెద్ద ఎత్తున అందుబాటులోకి వచ్చే ఎలక్ర్టిక్‌ చార్జింగ్‌ స్టేషన్లతో యువతకు ఉపాధి అవకాశాలు పెరుగుతాయని ఎమ్మెల్సీ సురభి వాణీదేవి తెలిపారు. ఖైరతాబాద్‌ పీపుల్స్‌ప్లాజాలో టీఎస్‌ రెడ్కో ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న గో ఎలక్ర్టికల్‌ క్యాంపెయిన్‌ను ఆదివారం ఆమె పరిశీలించారు. పలు ఎలక్ర్టిక్‌ వాహనాల వివరాలు, వాటి ప్రత్యేకతలను స్టాల్స్‌ నిర్వాహకులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ డీజిల్‌, పెట్రోల్‌తో నడుస్తున్న ఆటోలు, టూవీలర్స్‌ను ఎలక్ర్టిక్‌ వాహనాలుగా మార్చుకునే అవకాశాలున్నాయని వాటిని సద్వినియోగం చేసుకోవాలన్నారు. కార్యక్రమంలో టీఎస్‌ రెడ్కో ప్రాజెక్ట్‌ డైరెక్టర్‌ డి.వి. రామకృష్ణ పాల్గొన్నారు.



Updated Date - 2021-12-13T18:34:03+05:30 IST