Advertisement
Advertisement
Abn logo
Advertisement

HYD : ఎవరిది పాపం.. ఎవరిది శాపం.. రాత్రి పగలు లేకుండా ఏంటిది..!?

  • మద్యం మత్తు.. అతి వేగం
  • ప్రాణాలు తీస్తోన్న నిర్లక్ష్యం
  • హిల్స్‌లో ఇద్దరిని బలిగొన్న కారు 
  • గండిపేటలో భార్యాభర్తలు దుర్మరణం

- బంజారాహిల్స్‌ రోడ్‌ నంబరు 14.. ఆదివారం అర్ధరాత్రి 1.30. నైట్‌ డ్యూటీలో ఉన్న ఇద్దరు చిరుద్యోగులు టీ తాగి రోడ్డు దాటుతున్నారు. వేగంగా వచ్చిన ఖరీదైన కారు వారి ప్రాణాలను బలిగొంది. కారులో ఉన్న వారికి డ్రంకెన్‌ డ్రైవ్‌ టెస్ట్‌ నిర్వహించగా, ఒకరు 70 ఎంఎల్‌, మరొకరు 50 ఎంఎల్‌ తాగినట్లు రిజల్ట్‌ వచ్చింది.


- గండిపేట.. సోమవారం మధ్యాహ్నం.. భార్యాభర్తలు బ్యాంకు పని ముగించుకుని ఇంటికి వెళ్తున్నారు. కొద్ది దూరమే కాదా అని రాంగ్‌ రూట్‌లో వెళ్లడమే వారు చేసిన తప్పు. వేగంగా దూసుకొచ్చిన టయోటా క్వాలీస్‌ వాహనం వారి ప్రాణాలను తీసుకెళ్లింది. క్వాలీస్‌ డ్రైవర్‌కు శ్యాస పరీక్షలు నిర్వహించగా, 148/100 వచ్చింది.


- 2016 జూలై 11: పాఠశాల అడ్మిషన్‌ కోసం కుటుంబసభ్యులంతా కారులో బంజారాహిల్స్‌ నుంచి జూబ్లీహిల్స్‌ వైపు వెళ్తున్నారు.  ఫుల్‌గా మద్యం మత్తులో ఉన్న ముగ్గురు యువకులు ఎదురుగా కారులో వస్తున్నారు. వారి కారు డివైడర్‌ను ఢీ కొట్టి గాల్లో లేచి కుటుంబం ప్రయాణిస్తున్న కారుపై పడింది. కుటుంబసభ్యులు ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. ఇద్దరు క్షతగాత్రులు అయ్యారు. ఇందులో ఏడేళ్ల రమ్య కూడా ఉంది. కలకలం సృష్టించిన ఈ కేసు విచారణ ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది.

ఆరేళ్లు అయినా అందని న్యాయం..

‘‘నా కూతురు ప్రమాదవశాత్తూ చనిపోలేదు. నా బంగారు తల్లిని చంపేశారు. అవును. ఈ వ్యవస్థలోని నిర్లక్ష్యం, నిర్లిప్తత నా బిడ్డను పొట్టనపెట్టుకున్నాయి. నా తండ్రినీ, సోదరుడినీ మింగేశాయి. ప్రేమ, ఆప్యాయతలతో కలిసి మెలిసి ఉండే నా కుటుంబం ఆ ఒక్క దుర్ఘటనతో చెల్లాచెదురైంది. ‘నాన్న’ అని పలకడం కూడా రాని నా తమ్ముడి కుమారుడు రితేష్‌ తండ్రి ప్రేమకు దూరమయ్యాడు. నా మరదలికి జీవితకాల వేదన మిగిలింది. నా మరో తమ్ముడు ఇదివరకటిలా నడవలేకపోతున్నాడు. నా భార్య ఇప్పటికీ పూర్తిగా కోలుకోలేదు. ఇవన్నీ చూస్తున్న అమ్మ కళ్లు తడవని రోజులేదు. మరెవరో చేసిన తప్పునకు మేం  తీవ్రక్షోభను అనుభవిస్తున్నాం. మా కష్టం మరెవ్వరికీ రాకుండా చూడమని ప్రభుత్వాన్ని అర్థిస్తున్నాం.’’ పంజాగుట్ట రోడ్డుప్రమాదంలో తండ్రిని, తమ్ముడిని, కూతుర్ని పోగొట్టుకున్న పమ్మి వెంకట రమణ మనసు ఘోష ఇది. సమాజాన్ని ఉలిక్కిపడేలా చేసిన పంజాగుట్ట కారు ప్రమాదం జరిగి ఆరేళ్లు అవుతున్నా, ఇంతవరకు దోషులకు శిక్షపడకపోవడం, బాధితులకు తాత్కాలిక ఉపశమనం అందకపోవడం శోచనీయం.


హైదరాబాద్ సిటీ/బంజారాహిల్స్‌ : రాత్రి, పగలు తేడా లేకుండా కొందరు తాగి వాహనాలు నడుపుతున్నారు. వారి నిర్లక్ష్యం కొందరి ప్రాణాలను బలితీసుకుంటోంది. ఎందరినో క్షతగాత్రులుగా మార్చుతోంది. ప్రమాదాలు చేసిన వారిపై కేసులు నమోదు చేస్తున్నప్పటికీ బాధిత కుటుంబాలకు న్యాయం జరగడం లేదు.


తాజా ప్రమాదంలో కూడా..

ఆదివారం అర్ధరాత్రి జరిగిన రోడ్డు ప్రమాదానికి అతి వేగం, మద్యం మత్తే కారణమని పోలీసుల విచారణలో తేలింది. హిల్స్‌లో పబ్‌లు, బార్‌లకు కొదవ లేదు. వీకెండ్స్‌లో పోలీసులు విరివిగా డ్రంకెన్‌ డ్రైవ్‌లు నిర్వహిస్తూ ఉంటారు. మిగతా రోజుల్లో పెద్దగా తనిఖీలు ఉండవు. దీంతో మత్తులో వాహనాన్ని ఫుట్‌పాత్‌పైకి ఎక్కించడం, ట్రాఫిక్‌ సిగ్నల్స్‌, చెట్లను ఢీ కొట్టడం, కార్లు బోల్తా వంటి ఘటనలు తరచూ జరుగుతున్నాయి.

నిబంధనలు పాటించక..

హిల్స్‌ రోడ్లపై ట్రాఫిక్‌ పోలీసులు అనేక సంస్కరణలు చేపట్టారు. చౌరస్తాలు మూసివేసి యూ టర్న్‌లు ఏర్పాటు చేశారు. దీంతో ట్రాఫిక్‌ సమస్య కాస్త తగ్గినట్టు పోలీసులు చెబుతున్నారు. అయితే, రాత్రి సమయంలో చౌరస్తాలకు దూరంగా ఉన్న  యూ టర్న్‌లకు వెళ్లడం భారంగా భావిస్తున్న వారు రాంగ్‌రూట్లో వాహనాలను నడపటంతో ప్రమాదాలు జరుగుతున్నాయి.

డిజైన్‌లో లోపం..

బంజారాహిల్స్‌ రోడ్‌ నెంబరు 3 డిజైన్‌లో లోపం ఉందని గతంలో పోలీసులు, జీహెచ్‌ఎంసీ అధికారులు భావించారు. ఇందుకోసం గ్రీన్‌మాస్క్‌ ఎదురుగా ఉన్న రోడ్డును కాస్త వెడల్పు చేశారు. ఇది మరిన్ని సమస్యలను సృష్టిస్తోంది. ఎన్టీఆర్‌ ట్రస్టు భవన్‌ నుంచి వచ్చే వాహనదారులకు రోడ్డు మామూలుగానే కనిపిస్తుంది. షేక్‌పేట రెవెన్యూ కార్యాలయం దాటగానే మలుపు, దానికి తోడు దిగువ ప్రాంతం కావడంతో కొత్తగా వచ్చే వారు రోడ్డును అంచనా వేయడంలో విఫలమవుతున్నారు. గతంలో ఓ కారు అదుపుతప్పి పక్కనే ఉన్న ఫొటో స్టూడియోలోకి దూసుకుపోయింది. ఈ ఘటనలో ముగ్గురు అక్కడిక్కడే మృతి చెందారు. ముఖ్యమంత్రి కాన్వాయ్‌లోని డ్రైవర్లు కూడా ఈ రోడ్డు వద్ద ఇబ్బందులు పడుతున్నట్లు పోలీసు ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్లారు. కనీసం సూచన బోర్డులైనా ఏర్పాటు చేయాలని కోరారు. ఇంతవరకు అది కార్యరూపం దాల్చలేదు. బంజారాహిల్స్‌ రోడ్డు నెంబరు 3లోని ముఫకంజా కళాశాల నుంచి ఎన్టీఆర్‌ ట్రస్టు భవన్‌ వద్ద తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయి. జూబ్లీహిల్స్‌ రోడ్డు నెంబరు 36లో వైన్‌స్పాట్‌, చెక్‌పోస్టు, పెద్దమ్మ తల్లి దేవాలయం వద్ద, రోడ్డు నెంబరు 46/1 కూడలి వద్ద కూడా అధికంగా ప్రమాదాలు జరుగుతున్నాయి.

పల్టీలు కొట్టిన ఆటో.. 

మద్యం మత్తులో ఆటోను నడిపిన ఓ యువకుడు ముందు వెళ్తున్న వాహనాన్ని ఓవర్‌టేక్‌ చేయబోయాడు. ఈ క్రమంలో ఆటో అదుపుతప్పి రోడ్డుపై పల్టీలు కొట్టింది. ఆ సమయంలో ఆటోలో ఎవరూ లేకపోవడంతో ప్రమాదం తప్పింది. ఎస్‌ఐ కోటేశ్వరరావు వివరాల ప్రకారం.. ఫతేనగర్‌కు చెందిన శివ (30) తన ఆటోలో అమీర్‌పేట వైపు బయలుదేరాడు. బల్కంపేటలోని ఓ వైన్‌షాపులో మద్యం తాగాడు. ఆ మత్తులో వాహనాన్ని వేగంగా నడిపిస్తూ రోడ్లు భవనాల శాఖ కార్యాలయం వద్ద ముందు వెళ్తున్న వాహనాన్ని ఓవర్‌టేక్‌ చేయబోయాడు. ఈ క్రమంలో ఆటో అదుపు తప్పింది. నడిరోడ్డుపై మూడు పల్టీలు కొట్టింది. ఓ పాదచారికి తగలడంతో స్వల్ప గాయాలు అయ్యాయి. స్థానికుల సమాచారం మేరకు సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు ఆటో డ్రైవర్‌ను అదుపులోకి తీసుకుని పోలీ‌స్‌ స్టేషన్‌కు తరలించారు.


మరో ప్రమాదంలో ఇద్దరికి గాయాలు

మద్యం మత్తులో ఆదివారం అర్ధరాత్రి బైక్‌పై వెళ్తున్న ఇద్దరు వ్యక్తులు ఎదురుగా వెళ్తున్న కారును ఢీ కొట్టారు. నార్సింగ్‌ పోలీసుల కథనం ప్రకారం.. శివ (23), కృష్ణమూర్తి (23) పల్సర్‌ బైక్‌పై గచ్చిబౌలి నుంచి నార్సింగ్‌వైపు సర్వీసు రోడ్డులో వెళ్తున్నారు. పుప్పాలగూడ టోల్‌గేట్‌ వద్దకు రాగానే రత్నదీప్‌ సూపర్‌ మార్కెట్‌ వద్ద కారును ఢీ కొట్టారు. దీంతో వారికి తీవ్రమైన గాయాలయ్యాయి. కారు డ్రైవర్‌ వివేక్‌ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

కారు ఢీ కొని..

మద్యం మత్తులో ముగ్గురు వైద్యులు కారులో వెళ్తూ నలుగురు పాదచారులను ఢీ కొట్టారు. మాదాపూర్‌ ఎస్‌ఐ రామ్మోహన్‌రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. నిఖిల్‌రెడ్డి(26), అఖిల్‌, అరుణ్‌ ఎంబీబీఎస్‌ పూర్తి చేశారు. వీరు ఆదివారం రాత్రి ఓ రెస్టారెంట్‌లో మద్యం తాగి దుర్గంచెరువు ఇనార్బిట్‌మాల్‌ నుంచి కారులో గచ్చిబౌలి వైపు వస్తున్నారు. మద్యం మత్తులో వేగంగా కారు నడుపుతూ నిఖిల్‌ రెడ్డి రోడ్డుపై వెళ్తున్న పాదచారులను ఢీ కొట్టాడు. దీంతో నలుగురికి గాయాలయ్యాయి. క్షతగాత్రులు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. కేసు దర్యాప్తులో ఉంది.

Advertisement
Advertisement