కుచ్‌ ‘కరోనా’.. ఒంటరి మహిళల ఆలోచనలు మారిపోయాయ్!

ABN , First Publish Date - 2021-05-17T16:54:09+05:30 IST

దీప (పేరు మార్పు) ఓ యోగా స్టూడియోలో ఇన్‌స్ట్రక్టర్‌. పదేళ్ల కాపురానికి గుర్తుగా ఓ పాప.

కుచ్‌ ‘కరోనా’.. ఒంటరి మహిళల ఆలోచనలు మారిపోయాయ్!

  • ఒంటరి... చేయూత ఏది మరి...
  • బయటకు వెళ్తే భయం... ఇంట్లో ఉండలేక సతమతం
  • తోడుకోసం వెతుకుతున్న నిన్నటి తరం
  • అర్థవంతమైన బంధాలుంటే చాలంటున్న నేటి తరం

హైదరాబాద్‌ సిటీ : దీప (పేరు మార్పు) ఓ యోగా స్టూడియోలో ఇన్‌స్ట్రక్టర్‌. పదేళ్ల కాపురానికి గుర్తుగా ఓ పాప. పొరపొచ్చాలు రావడంతో మూడేళ్లగా ఒంటరిగానే తన పాపతో పాటు ఉంటోంది. తమ మాట వినలేదని తల్లిదండ్రులు కూడా ఈమెకు దూరంగా ఉన్నారు. తన కాళ్లమీద తాను నిలబడగలనని సవాల్‌ చేసిన దీప, అందరికీ దూరంగా ఓ సంవత్సరం హ్యాపీగానే గడిపేసింది. గత సంవత్సరం వచ్చిన కరోనా... వెను వెంటనే లాక్‌డౌన్‌, కాస్త కష్టమైనా తట్టుకోగలిగింది. కానీ పాపను ఇంట్లో వదిలి వెళ్లడం ఆమెకు పెద్ద సమస్య అయింది. ఇప్పుడు సెకండ్‌ వేవ్‌... తన వర్క్‌పై మళ్లీ ప్రభావం. ఆన్‌లైన్‌ క్లాస్‌లు తీసుకోవడంతో డబ్బులు వస్తున్నాయి. కానీ ఏదో భయం. తనకు ఏమైనా అయితే ఏమిటన్న ఆందోళన. తన జీవితంలో శూన్యత ఆవరించిందన్న అనుమానం. తన మనసు ఏదో కోరుకుంటుందన్న ఆందోళన... గత మూడు నాలుగు నెలలుగా విభిన్నమైన ఆలోచనలు. ఇప్పుడు ఎలాంటి గొడవలూ లేకుండా ఉండే బంధం కావాలని కోరుకుంటోంది. ఆ తోడు కోసం ఇప్పుడు ఆన్‌లైన్‌లో వెతుకుతోంది.


ఇది ఒక్క దీప విషయంలో మాత్రమే కాదు, చాలామంది ఒంటరి మహిళల ఆలోచనలను మార్చింది కరోనా. కరోనా భయాలతో చుట్టుపక్కల వారు చూసేందుకూ రావడం లేదు. అయిన వారూ మొహం చాటేస్తున్నారు. స్నేహితులనూ సాయం అడిగే పరిస్థితి లేదు. ఇలాంటి పరిస్థితులలో ‘తోడు’ ఉంటేనే మంచిదని ఒంటరి మహిళలు భావిస్తున్నారు. దీనికోసం మాట్రిమోనీ సైట్‌లు మొదలు డేటింగ్‌సైట్ల వరకూ వెతుకుతున్నారు. కరోనా అనంతర కాలంలో డేటింగ్‌ సైట్లకు విపరీతంగా డిమాండ్‌ పెరిగిపోయింది. ఇటీవల కాలంలో బంబెల్‌ దేశవ్యాప్తంగా నిర్వహించిన అధ్యయనంలో ప్రతి ముగ్గురు ఒంటరులలో ఒకరు కమిటెడ్‌ రిలేషన్‌షిప్‌ ఈ సంవత్సరం సాధ్యమవుతుందని చెబుతుంటే, గతంలోలా కాకుండా అర్థవంతమైన చాటింగ్‌ ఇప్పుడు జరుగుతుందని యాప్‌ల ప్రతినిధులు అంటున్నారు. ఈ కరోనా కాలంలో వీడియో కాల్స్‌ గణనీయంగా జరుగుతున్నాయంటూనే ఒకరికొకరు కలుసుకునే ముందు తెలుసుకోవడానికి మార్గంగా దీనిని ఒంటరులు భావిస్తున్నారని కూడా వెల్లడిస్తున్నాయి. ఇక మరికొంతమంది మాత్రం తమ ఒంటరితనం నుంచి బయటపడేందుకు సేవా కార్యక్రమాల వైపూ దృష్టి మళ్లిస్తున్నారు.


నిజానికి కరోనా సెకండ్‌ వేవ్‌లో పనిచేస్తున్న ఒంటరి మహిళలకు ఈ కష్టాలు ఇంకాస్త ఎక్కువనే చెప్పాలన్నది కొందరి భావన. ఉద్యోగ విధులను ఇంటి నుంచి నెరవేర్చడంతో పాటు ఇంటి పనులు చేయడం వంటి అంశాలతో నలిగిపోతున్నామని చెబుతున్నారు కొంతమంది మహిళలు. కానీ ఎక్కువ మంది మాత్రం ఈ రోజు ఎలా గడుస్తుందన్న ఆందోళనే తమను వేధిస్తుందంటున్నారు. అన్నీ సక్రమంగా ఉంటే ఒంటరి తనం వేధించదని, పైగా అది ఆనందాన్నీ ఇస్తుందని మోడల్‌ అను(పేరు మార్పు) చెబుతూ ఈ కరోనా కాలంలో మాత్రం కాస్త ఇబ్బందిగానే ఉంది అని చెప్పుకొచ్చింది. బయటకు వెళ్లలేం. ఇంట్లో ఉండలేం. ఫోన్లలో ఎంత సేపని మాట్లాడతాం. అందుకే తోడు కావాలనుకుంటున్నాను..’ అని అన్నారు. కరోనా, లాక్‌ డౌన్‌ కాలంలో ఒంటరిగా ఉన్న వారు ఆ భావనలను దరి చేరనీయకుండా ఉండాలంటే తమను తాము బిజీ చేసుకోవడమూ ఓ మార్గం అని అంటున్నారు సైకాలజి్‌స్టలు. సమయాన్ని అర్థవంతంగా ఉపయోగించుకోవాలని సైకాలజిస్ట్‌ సుజాత చెబుతూ మీ చుట్టుపక్కల వారితో స్నేహంగా ఉండడంతో పాటు ఇతరులకు సహాయడటంలో సమయాన్ని వెచ్చించుకోవచ్చు. అలాగే సోషల్‌ మీడియా ప్లాట్‌ఫామ్స్‌ ద్వారా ఇతరులను కనెక్ట్‌ కావొచ్చు. జీవితంలో ప్రతి క్షణాన్నీ ఆస్వాదించేందుకు ప్రయత్నిస్తే ఒంటరి తనం దరి చేరదు’ అని అన్నారు.


మద్దతుగా నిలిచే వ్యవస్థ ఏదీ..

తనను తాను ఇంట్రోవర్ట్‌గా అభివర్ణించుకునే రాగిణి(పేరు మార్పు) మాట్లాడుతూ ‘ఇండియాలో ఒంటరి మహిళలకు మద్దతుగా నిలిచే వ్యవస్థ ఏదీ లేదు. పైగా ఒంటరి మహిళలంటే చులకన! ఎందుకు ఒంటరిగా బతుకుతున్నామని తోటి మహిళలు కూడా ఆలోచించరు. గత లాక్‌డౌన్‌ తనకు జీవితం మీద విరక్తి కలిగించింది. దాని నుంచి బయటపడి ముందుకు వెళ్తున్నామనుకుంటే సెకండ్‌ వేవ్‌... మళ్లీ లాక్‌ డౌన్‌. గతానుభవాలతో తట్టుకోగలననే అనుకుంటున్నాను. మరి తోడు కోసం ఆలోచించడం లేదా అని అంటే, అప్పుడప్పుడూ అనిపిస్తుంటోంది. మనకు కూడా ఓ ఫ్యామిలీ ఉంటే బాగుంటుంది కదా అని, కానీ జీవితంలో మోసపోయిన వారికి ఆ దిశగా ఆలోచించడం అవసరమా అని సర్ధి చెప్పుకుంటుంటా. మరి కాలక్షేపం ఎలా అని అంటే, బుక్స్‌, ఓటీటీ, ఫ్రెండ్స్‌తో చాటింగ్‌...’ అని అన్నారు. ఒంటరి మహిళలకు ఆపన్నహస్తం అందించే వారిప్పుడు తక్కువే! పలు ఎన్‌జీవోలు వారికి సహాయపడేందుకు సాధారణ సమయాలలో ముందుకు వస్తున్నా కరోనా సమయంలో మాత్రం కాస్త వెనుకబడే ఉన్నాయి. ఏదైనా హెల్ప్‌లైన్‌ ఉంటే బాగుంటుందని మరికొంతమంది చెప్పుకొస్తున్నారు.


తోడు కోసం పరితపించేలా...

కరోనా అందరికీ కష్టాలనే తీసుకొచ్చింది. కానీ కొంతమందికి ఇంకా ఎక్కువ కష్టాలు తీసుకొచ్చింది. అలాంటి వారిలో ముందు వరుసలో ఉన్నది ఒంటరి మహిళలు. ఆర్థికంగానే కాదు మానసికంగానూ ఒంటరి మహిళలపై కరోనా తీవ్ర ప్రభావమే చూపుతుందిప్పుడు. ఇలాంటి మహిళలు గతంలో ఎలా భావించారో కానీ ఇప్పుడు మాత్రం ఓ తోడు ఉంటే బాగుంటుందనే ఆలోచనలోనే ఉన్నారు. ఇదే విషయమై ఓ స్టార్టప్‌ కంపెనీ వ్యవస్థాపక ఫౌండర్లలో ఒకరైన సుధ (పేరు మార్పు) మాట్లాడుతూ ‘ఒంటరి మహిళల జీవితం పూల పాన్పు ఏమీ కాదు. వారి జీవితం నిత్యం పోరాటంతోనే సాగిపోతుంటుంది. మరీ ముఖ్యంగా భద్రత, ఆర్థిక భరోసా, మానసిక ఆరోగ్యం పరంగా! కరోనా తీసుకొచ్చిన భయాలకు తోడు ఇప్పుడు లాక్‌డౌన్‌... తాము ఒంటరి అనే భావనను మరింతగా పెంచుతోంది. అదే ఇప్పుడు తోడు కోసం పరితపించేలా చేస్తోంది. శారీరక సౌఖ్యం కోసం కాదు, మనిషికి మనిషి ఆలంబన కోసమే’ అనిచెప్పుకొచ్చారు. ఈ కరోనా కాలంలో ఎంత జాగ్రత్తగా ఉన్నా వైరస్‌ బారిన పడకుండా ఉంటామనే భరోసా లేదు.  తాము ఈ వైరస్‌ బారిన పడితే తమ యోగక్షేమాలు చూసుకునే వారెవరంటూ ఆందోళన చెందుతున్నారు ఈ ఒంటరిలలో చాలామంది. 


ఆలోచనలను కట్టిపెట్టాలి.. ఆచరణపై దృష్టిపెట్టాలి..!

కరోనా ఇప్పుడు ప్రతి ఒక్కరినీ ఆందోళనకు గురిచేస్తోంది. సున్నితమనసత్త్వం కలిగినవారిని డిప్రెషన్‌లో పడేస్తోంది. మరీ ముఖ్యంగా మహిళలపై ఈ కరోనా ప్రభావం మానసిక కోణంలో చూసినప్పుడు చాలా ఎక్కువగానే ఉంది. అందునా ఒంటరి మహిళలపై ఈ ప్రభావం సుస్పష్టంగా కనబడుతుందంటున్నారు సైకాలజిస్ట్‌లు.


ఓ ప్రైవేట్‌ ఆస్పత్రిలో కన్సల్టెంట్‌ సైకాలజిస్ట్‌గా చేస్తోన్న శైలజ మాట్లాడుతూ ‘గత సంవత్సరం కరోనా, అనంతర లాక్‌డౌన్‌ వచ్చిన నాటి నుంచి ఒంటరి మహిళలు చాలా సమస్యలు ఎదుర్కొంటున్నారు. మరీ ముఖ్యంగా ఉద్యోగాలలో ఉన్నవారిలో అయితే ఒత్తిడి విపరీతంగా పెరిగిపోయింది. ఉద్యోగ  భద్రత లేకపోవడం ఒకటైతే, పిల్లల ఫీజులు, ఆన్‌లైన్‌ క్లాస్‌లు, ఒకవేళ కరోనా తమకు సోకితే.. అన్న భయాలకు తోడు సమాజం పెద్దగా వారికి సహకరించకపోవడం వారిలో ఆందోళన కలిగిస్తున్నాయి. వారికి ధైర్యం చెబుతూనే వారిలో డిప్రెషన్‌ ఛాయలు కనబడకుండా ఉండేందుకు తగిన కౌన్సిలింగ్‌ ఇస్తున్నాం. ఒకటి మాత్రం చెప్పగలను. బంధాల విలువను చాలామంది తెలుసుకుంటున్నారు. కరోనా తీసుకొచ్చిన గొప్పమార్పు అది. అదే సమయంలో బంధాలను విచ్ఛిన్నం చేసుకుంటున్నవారూ ఉన్నారు..’ అని అన్నారు.

Updated Date - 2021-05-17T16:54:09+05:30 IST