‘మా కళ్లను మేమే నమ్మలేకపోయాం.. నేను ఈ స్థాయికి రావడానికి వాళ్లే కారణం..’

ABN , First Publish Date - 2020-09-24T18:12:20+05:30 IST

కాళేశ్వరం నుంచి గోదావరి జలాలను ఎత్తిపోయడానికి నిర్మించిన ప్రాజెక్టే కాళేశ్వరం. 100 మీటర్ల ఎత్తు నుంచి 618 మీటర్ల ఎత్తుకు నీటి ఎత్తిపోయడం దీని ప్రత్యేకత. దాదాపు 300 కిలోమీటర్ల జల ప్రయాణం. అయితే దీనిపై చాలా మందికి అవగాహన లేదు. ఎంతో మంది తమ మాటలతో, చేతలతో, వీడియోల

‘మా కళ్లను మేమే నమ్మలేకపోయాం.. నేను ఈ స్థాయికి రావడానికి వాళ్లే కారణం..’

కాలేశ్వరం షో.. ప్రాజెక్టును కళ్లకు కట్టినట్లు చూపించిన అనిల్‌ జీల

మేడిగడ్డ నుంచి కొండపోచమ్మ సాగర్‌ వరకు..

వీడియోలతో దర్గపల్లి యువకుడి ప్రతిభ

యూట్యూబ్‌లో లక్షలాది మంది వీక్షణ

అనిల్‌ వ్లాగ్స్‌ పేరిట ‘మైవిలేజ్‌షో’ ఫేం ప్రయత్నం


సిద్దిపేట(ఆంధ్రజ్యోతి ప్రతినిధి) : కాళేశ్వరం నుంచి గోదావరి జలాలను ఎత్తిపోయడానికి నిర్మించిన ప్రాజెక్టే కాళేశ్వరం. 100 మీటర్ల ఎత్తు నుంచి 618 మీటర్ల ఎత్తుకు నీటి ఎత్తిపోయడం దీని ప్రత్యేకత. దాదాపు 300 కిలోమీటర్ల జల ప్రయాణం. అయితే దీనిపై చాలా మందికి అవగాహన లేదు. ఎంతో మంది తమ మాటలతో, చేతలతో, వీడియోల ద్వారా కాళేశ్వరం ప్రాజెక్టు గురించి చెప్పే ప్రయత్నం చేశారు. కానీ ఏదోమూలన సందేహాలు కూడా ఉంటాయి. అయితే తాజాగా సిద్దిపేట జిల్లా నంగునూరు మండలం దర్గపల్లికి చెందిన అనిల్‌ జీల అనే యువకుడు తీసిన కాళేశ్వరం వీడియోలు లక్షలాది మందిని అలరిస్తున్నాయి.  పది రోజుల వ్యవధిలో మూడు వీడియోలు చిత్రీకరించి యూట్యూబ్‌లో అప్‌లోడ్‌ చేయగా సుమారు 10 లక్షల మంది వీక్షించడం విశేషం. 


అనిల్‌ వ్లాగ్స్‌ పేరిట వీడియోలు..

తెలంగాణతోపాటు ఇతర రాష్ర్టాల్లో ‘మై విలేజ్‌ షో’ పల్లె వీడియోలకు ఉన్న ఆదరణ అంతాఇంతా కాదు. ఈ షో ద్వారా పరిచయమైన గంగవ్వ ప్రస్తుతం బిగ్‌బా్‌సకు ఎంపికైంది. ఈ వీడియోల్లో ప్రధాన పాత్రధారి అయిన అనిల్‌ జీల సైతం చాలామందికి చిరపరిచితుడు. తన హాస్యం, నటనతో ఆకట్టుకుంటున్నాడు. ఇప్పటికి నాలుగు సినిమాల్లో నటించాడు. దాదాపు 300వీడియోల్లో తన ప్రతిభ చాటాడు. అయితే తాజాగా మై విలేజ్‌ షో ఆధ్వర్యంలోనే అనిల్‌ వ్లాగ్స్‌ పేరిట వినూత్నమైన వీడియోలను స్వయంగా రూపొందిస్తున్నాడు. అనతికాలంలోనే ఇవి యూట్యూబ్‌లో మంచి ఆదరణ పొందాయి. కాగా కామెడీ, ఎమోషన్స్‌ అనే ప్రస్తావన లేకుండా సామాజిక కోణంలో వీడియోలు చిత్రీకరించి కొత్త ప్రయత్నానికి తెరతీశాడు. అంతేగాకుండా క్రియేటివ్‌ కంటెంట్‌గా, సినిమాటోగ్రాఫర్‌గా, ఎడిటింగ్‌, యాక్టింగ్‌లోనూ రాణిస్తున్నాడు. 


కాళేశ్వరాన్ని కళ్లకు కట్టేలా..

కాళేశ్వరం ప్రాజెక్టు గురించి యావత్‌ తెలంగాణతోపాటు చుట్టుపక్కల రాష్ర్టాల్లో తెలియనివారుండరు. గోదావరి జలాలను ఎత్తిపోసే బృహత్తరమైన ప్రాజెక్టు ఇది. భూపాలపల్లి జయశంకర్‌ జిల్లాలోని కాళేశ్వరం దేవాలయ సమీపం నుంచి పెద్దపల్లి, కరీంనగర్‌, జగిత్యాల, సిరిసిల్ల జిల్లాల మీదుగా సిద్దిపేట జిల్లా వరకు గోదావరిని పరవళ్లు తొక్కించే వినూత్నమైన ప్రాజెక్టుగా పేర్కొనవచ్చు. ప్రస్తుతం  మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలు, ఎల్లంపల్లి, మిడ్‌మానేరు, అనంతగిరి, రంగనాయకసాగర్‌, కొండపోచమ్మ సాగర్‌ రిజర్వాయర్లు గోదావరి జలాలతో కళకళలాడుతున్నాయి. కోనసీమ అందాలను తలపించేలా, పాపికొండలను మైమరిపించేలా జలసవ్వడులు తొణికిసలాడుతున్నాయి. ఓపెన్‌ కాలువలు, భూగర్భ సొరంగాలు, సర్జిపూల్‌లు, భారీ బావులు, హెడ్‌ రెగ్యులేటర్లు ఇలా అన్నింటినీ అధునాతనంగా నిర్మించారు. తొలిబీజం పడిన మేడిగడ్డ నుంచి కొండపోచమ్మసాగర్‌ రిజర్వాయర్‌ 618 మీటర్ల ఎత్తులో 300 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. అక్కడి  నుంచి ఇక్కడిదాకా ప్రతీ అంశాన్ని కళ్లకు కట్టేలా అనిల్‌ జీల తన సహచరులు చందు, మధుతో కలిసి ఈ వీడియోలు చిత్రీకరించారు. 


నా బృందమే నా బలం

మా మైవిలేజ్‌ షో టీం సభ్యులు శ్రీకాంత్‌, శివ, అంజిమామ, చందు, రాజు, మధుతోపాటు బిగ్‌బాస్‌లో ప్రవేశించిన మా గంగవ్వలే నాబలం. వారి సహకారంతోనే ఈ స్థాయికి వచ్చాను. యువతలో ఎన్నో కళలు ఉంటాయి. వాటిని అందిపుచ్చుకొని ముందుకెళ్లడంలోనే సక్సెస్‌ ఉంటుంది. దీనినే మేము ఆచరించాం. కాళేశ్వరం ప్రాజెక్టు గొప్పతనాన్ని ప్రపంచవ్యాప్తంగా చాటి చెప్పాలని చేసిన మా ప్రయత్నానికి మంచి స్పందన లభించింది. ఈ ప్రాజెక్టు ఒక ఇంజనీరింగ్‌ అద్భుతం. మా కళ్లను మేమే నమ్మలేకపోయాం. అంత బాగా నిర్మించారు.

-అనిల్‌ జీల, యూట్యూబ్‌ స్టార్‌


నాలుగు లింక్‌లు.. 17ప్యాకేజీలు

మేడిగడ్డ నుంచి కొండపోచమ్మసాగర్‌ వరకు నాలుగు లింక్‌లు, 17 ప్యాకేజీలు ఉంటాయి. ఈ నాలుగు లింక్‌లకు సంబంధించి వేర్వేరుగా వీడియోలు రూపొందించారు. ఇందులోనే ఆయా ప్యాకేజీలకు సంబంధించిన అంశాలను వివరించారు. అన్నింటికి మించి భూగర్భ సొరంగాలు, పంప్‌హౌస్‌లను అద్భుతంగా చూపించారు. కాళేశ్వరం ప్రాజెక్టును ఇప్పటికే చాలామంది చూశారు. ఇంకా చూడని వారు ఎందరో ఉన్నారు. తాజా కరోనా పరిస్థితుల కారణంగా 6 నెలలుగా  ఇళ్లకే పరిమితమయ్యారు. ఈ ప్రాజెక్టును చూడలేకపోయామనే వారికి ఈ వీడియోలు ఎంతగానో ఉపయోగడపతాయి. సొరంగాల్లోకి వెళ్లలేకపోయినవారు కూడా ఈ వీడియోలతో మంచి అనుభూతిని ఆస్వాదించవచ్చు. 

Updated Date - 2020-09-24T18:12:20+05:30 IST