నేతాజీ: ఆరని అగ్నిజ్వాల

ABN , First Publish Date - 2022-01-23T07:34:27+05:30 IST

రెండువందల సంవత్సరాల పారతంత్ర్యం, వంద సంవత్సరాల పోరాటాల ఫలితంగా...

నేతాజీ: ఆరని అగ్నిజ్వాల

రెండువందల సంవత్సరాల పారతంత్ర్యం, వంద సంవత్సరాల పోరాటాల ఫలితంగా స్వతంత్రం సాధించుకున్న దేశానికి సరైన దిశానిర్దేశం చేయగల సమర్థ నాయకత్వం అవసరం. అకుంఠిత దేశభక్తి, ప్రజల సమస్యల గురించి సమగ్ర అవగాహన, పరిష్కారానికి తగు ప్రణాళికలు, అమలు చేయగల దృఢచిత్తత ఆ నాయకత్వానికి ఉండాలి. ఈ లక్షణాలన్నింటినీ పుణికిపుచ్చుకున్న మహోన్నత వ్యక్తిత్వం నేతాజీ సుభాష్ చంద్రబోస్. స్వాతంత్ర్య ఫలసిద్ధి కనుచూపు మేరలో ఉండగానే ఆ మహానాయకుడు ప్రపంచ యవనిక నించి అదృశ్యమవడం భారతీయుల దురదృష్టం.


1897 జనవరి 23న జన్మించిన నేతాజీ సుభాష్ చంద్రబోస్ 1919లో ఐసీఎస్ పరీక్షల నిమిత్తం ఇంగ్లాండ్ వెళ్ళాడు. అది చాలా కఠినమైన పరీక్ష. సుభాష్ ఆ పరీక్షలో ఉత్తమశ్రేణిలో ఉత్తీర్ణుడయ్యాడు. తండ్రి బలవంతంపై వెళ్ళాడేగానీ సుభాష్‌కు ఐసీఎస్‌పై ఆసక్తి లేదు. గుండెల్నిండా దేశభక్తి నింపుకున్న సుభాష్ బ్రిటీష్ ప్రభుత్వ ఆజ్ఞలను ఔదలదాల్చి తనవారినే పీడించే ఉద్యోగం చేయడానికి ఇష్టపడతాడా? భారతదేశానికి తిరిగి వచ్చిన సుభాష్ నేరుగా చిత్తరంజన్‌దాస్‌ను కలిశాడు. ఐసీఎస్ హోదాను తృణీకరించిన ధీరోదాత్తుడుగా అప్పటికే సుభాష్ పేరు ప్రఖ్యాతమైంది. అలా తిరస్కరించిన మొదటి వ్యక్తిగా చరిత్ర సృష్టించాడు. బ్రిటీష్ అధికారానికి, రాజరికానికి అతడు విసిరిన పెద్ద సవాల్ అది. ఆనాటినుంచే అతనిపై బ్రిటీష్ ప్రభుత్వ నిఘావర్గాల దృష్టి పడింది. 


1921లో స్వదేశానికి తిరిగివచ్చిన సుభాష్, 1941లో శాశ్వతంగా దేశం విడిచి వెళ్ళేవరకూ రెండు దశాబ్దాల పాటు అలుపూ, విశ్రాంతి యెరుగడు. స్వదేశంలో అడుగుపెట్టడంతోనే రాజకీయరంగ ప్రవేశం చేసిన సుభాష్ ఆదిలోనే సంచలన నాయకుడిగా అందరిదృష్టీ ఆకర్షించాడు. హరిపుర కాంగ్రెస్ సభల్లో నెహ్రూ నుంచి అధ్యక్ష పగ్గాలు అందుకొని తనదైనశైలిలో పార్టీని నడిపించాడు. స్వతంత్రసాధన తరువాత ప్రభుత్వం ముందున్న ప్రధాన కర్తవ్యాలు దారిద్ర్యనిర్మూలన, కుటుంబనియంత్రణ అని నొక్కిచెప్పాడు. తరువాతి కాలంలో సుభాష్ అతివాదవైఖరి అతనికి, కాంగ్రెస్ వృద్ధ నాయకులకు మధ్య విభేదాలను తీవ్రం చేసింది. రెండవసారి కాంగ్రెస్ అధ్యక్షపదవికి పోటీచేయాలన్న సుభాష్ నిర్ణయాన్ని గాంధీజీ వ్యతిరేకించారు. తన అభ్యర్థిగా భోగరాజు పట్టాభిసీతారామయ్యను పోటీకి దింపాడు. సీతారామయ్యపై సుభాష్ 203 ఓట్ల తేడాతో విజయం సాధించాడు కానీ కార్యనిర్వాహకవర్గం ఏర్పాటులో గాంధీజీ సహకరించకపోవడంతో ఏర్పడిన ప్రతిష్టంభన కారణంగా రాజీనామా చేయక తప్పలేదు.


ఈ 20సంవత్సరాల కాలంలో సుభాష్ 11సార్లు జైలుపాలయ్యాడు. 7సంవత్సరాలు భారతీయ జైళ్ళలోనూ, 4సంవత్సరాలు దేశాంతరవాసంలోనూ గడిపాడు. ఆరోగ్యం బాగా క్షీణించింది. క్షయ వ్యాధి, గాల్‌బ్లాడర్ సమస్య ఉన్నట్లు బ్రిటీష్ డాక్టర్లే నిర్ధారించారు. తక్షణ చికిత్స చేయించకపోతే ప్రాణానికే ప్రమాదమని నివేదిక ఇచ్చారు. ‘విడుదల చేస్తాం. కానీ అతడు భారత భూభాగంలో ఉండకూడద’ని బ్రిటిష్ ప్రభుత్వం షరతు పెట్టింది. చివరిసారిగా 1940 డిసెంబరులో జైలు నుంచి విడుదలయ్యాక, ఇక దేశంలో ఉండి తాను చెయ్యగలిగింది ఏమీలేదని నిర్ణయానికి వచ్చాడాయన.  


ప్రపంచ చరిత్రలో అదొక అద్భుత సాహసయాత్ర. బ్రిటీష్ పోలీసుల, గూఢచారుల కండ్లుగప్పి, భయంకర యుద్ధవాతావరణంలో, క్షీణించిన ఆరోగ్యంతో 16 జనవరి 1941న కలకత్తా నుంచి బయలుదేరిన సుభాష్ నాలుగు నెలలు కఠిన ప్రయాణం చేసి బెర్లిన్ చేరుకున్నాడు. హిట్లర్‌ను కలిసి, తాను నిర్వహించబోయే సాయుధ పోరాటానికి సహాయం కోరాలని అనుకున్నాడు. అయితే, జర్మనీ చేరిన ఏడాది తరువాత గాని హిట్లర్‌ను కలిసే అవకాశం లభించలేదు. హిట్లర్‌కు భారతీయుల స్థితిపట్ల సానుభూతేమీలేదు. ‘భారతీయు లకు పరిపాలనా సామర్థ్యం లేదు. వారిని బ్రిటీష్ వారు పాలించడమే సబబు. లేదంటే బ్రిటీష్‌ను తరిమి మేమైనా పాలించాలి’ అనే భావం ఉండేది. అయితే హిట్లర్ చేసిన ఒక మహోపకారం- సుభాష్‌ను జర్మనీ నుంచి తూర్పు ఆసియా చేర్చడానికి సహకరించడం. ఈ జెట్ యుగంలో బెర్లిన్ టోక్యోల మధ్య ప్రయాణకాలం 20 గంటలు. కానీ ఆ రోజుల్లో సుభాష్‌కు పట్టిన సమయం 90 రోజులు. భయంకర యుద్ధవాతావరణంలో, శత్రువిమానాల, నౌకల నిరంతర పహరా మధ్య, అంతటి సాహసయాత్రకు రూపకల్పన గావించిన జర్మనీ, జపాన్ మిలిటరీ అధికారులు అభినందనీయులు.


1943 మే నెలలో జపాన్ చేరిన సుభాష్ సమయం వృథా చేయలేదు. 13,000 మంది సైనికులను, అధికారులను కలిగిన ఇండియన్ నేషనల్ ఆర్మీకి నాయకుడయ్యాడు. నవంబర్‌లో అండమాన్, నికోబార్ దీవులను వశం చేసుకుని, తన దళాలను బర్మాకు పంపాడు. అక్కడి నుంచి ఇంఫాల్‌ను వశం చేసుకుని ముందుకు సాగాలని పథకం. ఈలోగా ప్రపంచ రాజకీయ చిత్రం మారింది.జర్మనీ, జపాన్ లొంగుబాటుతో నేతాజీ పథకాలు తారుమారయ్యాయి. చివరి యత్నంగా సోవియట్ రష్యా సహాయం కోరడానికి జపాన్ యుద్ధవిమానంలో బయలుదేరాడు. 1945 ఆగస్టు 18న మధ్యాహ్నం తైపీ నుంచి బయలుదేరిన ఆ విమానం కూలిపోయింది. ఇదే నేతాజీకి సంబంధించి మనకు తెలిసిన ఆఖరు సమాచారం. నేతాజీ మరణించాడా, రష్యాకు బందీ అయ్యాడా, నిరాశా నిస్పృహలకు లోనై ఆధ్యాత్మికమార్గం ఎన్నుకున్నాడా, గుమ్నామీ బాబాగా మారాడా?- అన్నీ జవాబు తేలని ప్రశ్నలే. స్వతంత్ర భారత ప్రభుత్వాలు ఏవీ కూడా ఆయన ఉనికిని కనుగొనడానికి నిజాయితీతో కృషి చేయలేదు.


నేతాజీ సారథ్యంలో స్వతంత్ర భారతంలో మొదటి ప్రజాప్రభుత్వం ఏర్పడివుంటే,- జర్మన్ జీవితచరిత్రకారుడు అలెగ్జాండర్ రెత్ భావించినట్లు భారతదేశ స్థితి ప్రస్తుతానికి భిన్నంగా, బహుశ అమెరికా స్థానంలో ప్రపంచాన్ని శాసించే స్థితిలో ఉండేదేమో!


ఇంద్రకంటి వేంకటేశ్వర్లు

(నేడు నేతాజీ 125వ జయంతి)

Updated Date - 2022-01-23T07:34:27+05:30 IST