పదమూడేళ్ల బుళ్లెట్

ABN , First Publish Date - 2021-04-05T05:12:25+05:30 IST

ఏకాగ్రత కోసం చిన్నమ్మాయికి షూటింగ్‌లో శిక్షణ ఇప్పించాలనుకున్నారు తల్లితండ్రులు. కానీ వెంట వెళ్లిన పెద్దమ్మాయి నేత్ర గన్‌ పట్టుకొనే నేర్పు చూసి... ఆమెను చేర్చుకున్నారు కోచ్‌. అనుకోకుండా షూ

పదమూడేళ్ల బుళ్లెట్

ఏకాగ్రత కోసం చిన్నమ్మాయికి షూటింగ్‌లో శిక్షణ ఇప్పించాలనుకున్నారు తల్లితండ్రులు. కానీ వెంట వెళ్లిన పెద్దమ్మాయి నేత్ర గన్‌ పట్టుకొనే నేర్పు చూసి... ఆమెను చేర్చుకున్నారు కోచ్‌. అనుకోకుండా షూటింగ్‌ రేంజ్‌లో అడుగుపెట్టిన ఆ అమ్మాయి... ఇప్పుడు చిన్న వయసులోనే పెద్ద విజయాలతో అదరగొడుతోంది. తమిళనాడు నుంచి జాతీయ చాంపియన్‌షిప్‌నకు ఎంపికైన అతిపిన్న వయస్కురాలిగా చరిత్ర సృష్టించిన పదమూడేళ్ల తెలుగు ‘బుల్లెట్‌’ ఆర్‌బీ నేత్ర ‘గన్‌ షాట్‌’ ఇది... 


నేత్ర షూటింగ్‌ మొదలు పెట్టినప్పుడు ఆమె వయసు పదకొండేళ్లు. సరిగ్గా రెండేళ్ల కిందట బరిలో దిగిన ఈ చిన్నారి అనితరసాధ్యమైన విజయాలతో దూసుకుపోతోంది. చెన్నైలోని ‘భవన్స్‌ రాజాజీ విద్యాశ్రమం’లో 8వ తరగతి చదువుతోంది. నేత్ర తల్లి డాక్టర్‌ ముప్పవరపు నిశ్చిత. టీటీడీ బోర్డు పాలకమండలి సభ్యురాలు. ఆమెకు ఇద్దరు కూతుళ్లు. పెద్దమ్మాయి నేత్ర పుస్తకాల పురుగు. పుస్తకంలో తలపెడితే పక్కన ఏం జరుగుతున్నా పట్టించుకోదు. ఏదైనా ఆటలు నేర్పిస్తే శారీరకంగానూ, మానసికంగానూ దృఢంగా ఉంటుందన్న ఉద్దేశం నేత్ర తల్లితండ్రులది. 


‘‘నేత్రను మానసికంగా, శారీరకంగా బలంగా చూడాలనే ఆలోచనతో ‘ఇండియన్‌ స్క్వాష్‌ అకాడమీ’లో చేర్పించాం. కష్టంగా ఏడాది వెళ్లింది. ఆ తరువాత తనకు స్క్వాష్‌ నచ్చలేదంది. మా చిన్నమ్మాయికి అప్పుడు ఆరేళ్లు. బాగా తెలివైన పిల్ల. ఏకసంధాగ్రాహి. నాలుగేళ్లప్పుడే దేశంలోని రాష్ట్రాలు, వాటి రాజధానులు, రకరకాల జంతువులు, పక్షులు... ఇలా అన్నింటి పేర్లూ తడుముకోకుండా చెప్పేది. మేమెవరం కూర్చోబెట్టి నేర్పింది లేదు. అయితే తను దేనిపైనా శ్రద్ధ పెట్టదు. షూటింగ్‌ నేర్పిస్తే ఏకాగ్రత బాగా కుదురుతుందనుకుని ‘సుమీత్స్‌ ఎయిర్‌గన్‌ స్పోర్ట్స్‌ అకాడమీ’కి తీసుకెళ్లాం’’ అంటూ నిశ్చిత చెప్పుకొచ్చారు.

 


ఊహించని మలుపు... 

అయితే స్పోర్ట్స్‌ అకాడమీకి వెళ్లాక నేత్ర తల్లితండ్రులు ఊహించింది ఒకటి... అక్కడ జరిగింది మరొకటి. చెల్లితో పాటు ఆ రోజు నేత్ర కూడా అకాడమీకి వెళ్లింది. ‘‘ఆ సమయంలో అక్కడున్న గన్స్‌ చూసి పిల్లలిద్దరూ ముచ్చటపడ్డారు. చిన్నమ్మాయితో పాటు నేత్ర కూడా ఓ గన్‌ చేతిలోకి తీసుకుంది. తను గన్‌ పట్టుకున్న తీరు చూసి కోచ్‌ సుమీత్‌ సంఘ్వీ అబ్బురపడ్డారు. ముందు నేత్రకే శిక్షణ ఇస్తానన్నారు. చిన్నమ్మాయికి వయసు సరిపోదు కాబట్టి, తరువాత చూద్దామన్నారు. నేత్ర కూడా అమితాసక్తి చూపడంతో కాదనలేదు’’ అంటారు నిశ్చిత.


మూడు నెలల్లోనే... 

సరదాగా శిక్షణ ప్రారంభించిన నేత్ర షూటింగ్‌ ‘రేంజ్‌’ రెండు నెలల్లోనే పెరిగిపోయింది. ‘తమిళనాడు-పుదుచ్చేరి ఇంటర్‌స్టేట్‌ చాంపియన్‌షిప్‌’ గెలుచుకుంది. అందులోని సబ్‌యూత్‌, యూత్‌, విమెన్‌ విభాగాల్లో స్వర్ణం, రజతం, కాంస్య పతకాలు గెలుచుకుంది. 15 ఏళ్ల లోపు వయసువారు సబ్‌యూత్‌లో, 18 ఏళ్ల లోపువారు యూత్‌లో, 18 ఏళ్లు పైబడినవారు మహిళల విభాగంలో పోటీ పడతారు. స్కోరును బట్టి కూడా ఆయా విభాగాలు మారుతుంటాయి. అయితే నేత్ర ఎప్పుడూ మంచి స్కోర్‌ సాధిస్తుండడంతో మహిళా విభాగంలోనే పోటీపడేది. ‘‘నేత్ర విజయాలు చూస్తుంటే ఇప్పటికీ మాకు ఆశ్చర్యంగానే ఉంటుంది. కొన్నాళ్లకు కోయంబత్తూర్‌ చాంపియన్‌షి్‌పలో రజత పతకం సాధించింది. ఆ తరువాత ఢిల్లీలో జరిగిన జాతీయ స్థాయి పోటీల్లోనూ పాల్గొంది. కెనడా, జర్మనీల్లో జరిగే వివిధ చాంపియన్‌షి్‌పలకు ఎంపికైంది. కానీ కరోనా వల్ల అవన్నీ వాయిదా పడ్డాయి’’ అంటూ కుమార్తె విజయాలు గుర్తు చేసుకున్నారు నిశ్చిత. విశేషమేమంటే... షూటింగ్‌ రేంజ్‌లోనే కాదు... స్కూల్లో మార్కుల రేస్‌లోనూ ముందుంటుంది నేత్ర. 


జాతీయ పోటీలకు...  

రెండేళ్ల కిందట పిస్టల్‌ పట్టిన నేత్ర ఇప్పుడు ఉన్నత శిఖరాలే లక్ష్యంగా దూసుకుపోతోంది. ఇటీవల చెన్నైలో జరిగిన 25 మీటర్ల స్పోర్ట్స్‌ పిస్టల్‌ స్టేట్‌ చాంపియన్‌షి్‌పలో ప్రతిభ కనబరిచి... 12వ ‘సౌత్‌జోన్‌ షూటింగ్‌ చాంపియన్‌షి్‌ప’కు అర్హత సాధించిందీ చిన్నారి. అంతేకాదు... త్వరలో ఢిల్లీలో జరగనున్న ‘జాతీయ పిస్టల్‌ షూటింగ్‌ చాంపియన్‌షి్‌ప’లో తమిళనాడు నుంచి ప్రాతినిధ్యం వహించనుంది. తద్వారా తమిళనాడు రాష్ట్రం నుంచి ఈ పోటీల్లో పాల్గొంటున్న అతిపిన్న వయస్కురాలైన క్రీడాకారిణిగా నేత్ర రికార్డులకెక్కింది. ఢిల్లీలోనే జరగనున్న ‘ఎయిర్‌ పిస్టల్‌ మహిళల నేషనల్‌ చాంపియన్‌షి్‌ప’లో సబ్‌యూత్‌, యూత్‌, జూనియర్‌ విభాగాలకూ ఎంపికైందీ షూటర్‌. 


పక్కనవేవీ కనిపించవు... 

చెల్లితో స్పోర్ట్స్‌ అకాడమీకి వెళ్లే వరకు నిజమైన పిస్టల్‌ ఎలా ఉంటుందో కూడా తెలియదు నేత్రకు. అలాంటిది నేడు గన్‌తో ఓ ఆట ఆడుకుంటోంది. ‘‘అంతకముందెన్నడూ నేను పిస్టల్‌ని దగ్గరి నుంచి కూడా చూడలేదు. కానీ అకాడమీలో తుపాకీని పట్టుకున్న క్షణం నుంచే ఇష్టం ఏర్పడింది. ఒక్కసారి బరిలో నిలబడి పిస్టల్‌ పట్టుకొంటే... దృష్టంతా టార్గెట్‌ మీదే. మిగిలినవేవీ కనిపించవు’’ అంటున్న నేత్ర ప్రస్తుతం జాతీయ స్థాయి పోటీల కోసం నిరంతర సాధన చేస్తోంది.


అస్సలు ఊహించలేదు...

‘‘పిస్టల్‌ ధర మూడు లక్షల నుంచి నాలుగు లక్షల రూపాయలు ఉంటుంది. షూస్‌ రూ.50 వేలు. కళ్లజోడు రూ.70 వేలు... ఇలా ఖర్చు ఎక్కువే ఉంటుంది. దీంతో పాటు కోచింగ్‌ వ్యయం. ఇక్కడ ప్రభుత్వ అకాడమీలు చాలానే ఉన్నాయి. నేత్రను తమ అకాడమీల్లో చేర్పించమని వారంతా అడిగారు. అయితే ముందు నుంచీ తను సుమీత్‌ దగ్గరే శిక్షణ తీసుకొంటోంది. అందుకే మార్చదలచుకోలేదు. ఏదేమైనా మా అమ్మాయి ఈ స్థాయిలో పోటీపడుతుందని మేము అస్సలు ఊహించలేదు’’ అంటూ భావోద్వేగంతో చెబుతారు నిశ్చిత.


ప్రస్తుతం ఎయిర్‌పిస్టల్‌, స్పోర్ట్స్‌ పిస్టల్‌లో శిక్షణ తీసుకొంటున్నాను. స్కూల్‌ అయిపోగానే సాయంత్రం కోచింగ్‌కు వెళతాను. వారాంతాల్లో ఉదయం పూట అకాడమీకి వెళతా. చదువుకు ఎప్పుడూ ఇబ్బంది అనిపించలేదు. స్విమ్మింగ్‌, చెస్‌ అన్నా కూడా నాకు ఇష్టమే. చెస్‌లో జిల్లా స్థాయి పోటీల్లో పాలొన్నాను. ప్రస్తుతం నా దృష్టంతా షూటింగ్‌ పైనే. ఎప్పటికైనా భారత్‌ తరఫున ఒలింపిక్స్‌లో పాల్గొనాలన్నదే నా లక్ష్యం.

Updated Date - 2021-04-05T05:12:25+05:30 IST