కేంద్ర బడ్జెట్‌పై గంపెడాశలు.. భాగ్యనగరానికి Bullet బండి వచ్చేనా..!?

ABN , First Publish Date - 2022-01-31T14:48:31+05:30 IST

కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టనున్న రైల్వే బడ్జెట్‌పై నగర వాసులు గంపెడాశలు పెట్టుకున్నారు...

కేంద్ర బడ్జెట్‌పై గంపెడాశలు.. భాగ్యనగరానికి Bullet బండి వచ్చేనా..!?

  • రైల్వే బడ్జెట్‌పై ఆశలు 
  • కేటాయింపులపై ఆసక్తి 
  • హైదరాబాద్‌ ‘మెట్రో’ను ఆదుకునేనా.. 
  • యాదాద్రికి ఎంఎంటీఎస్‌ పరిస్థితేంటో..

హైదరాబాద్‌ సిటీ : కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టనున్న రైల్వే బడ్జెట్‌పై నగర వాసులు గంపెడాశలు పెట్టుకున్నారు. పెండింగ్‌ ప్రాజెక్టులను పూర్తి చేయడంతో పాటు కొత్త రైళ్లు, నూతన పనులకు గ్రీన్‌సిగ్నల్‌ లభిస్తుందని వేచి చూస్తున్నారు. ప్రధానంగా దేశంలో వేగంగా అభివృద్ధి చెందుతున్న నగరాల్లో ఒకటిగా పేరొందిన హైదరాబాద్‌కు బుల్లెట్‌ రైలు పనులకు పచ్చజెండా ఊపుతారని అధికారులు భావిస్తున్నారు. ఇదే జరిగితే మరో పది నుంచి 15 ఏళ్లలో నగరం నుంచి హైస్పీడ్‌ రైలులో ఆర్థిక రాజధాని ముంబయికి వెళ్లి వచ్చే అవకాశం లభిస్తోంది.


నాలుగు నెలల క్రితం..

హైదరాబాద్‌  నుంచి ముంబయి వరకు బుల్లెట్‌ రైలును నడిపించాలని తెలుగు రాష్ర్టాలకు చెందిన పార్లమెంట్‌ సభ్యులు, వివిధ కార్మిక సంఘాల నాయకులు కొంతకాలంగా కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతున్నారు. ఇదే క్రమంలో నాలుగు నెలల క్రితం రెండు రాష్ర్టాల ఎంపీలతో ప్రత్యేకంగా నిర్వహించిన సమావేశంలో అప్పటి దక్షిణ మధ్య రైల్వే జనరల్‌ మేనేజర్‌ గజానన్‌ మాల్య దృష్టికి తీసుకొచ్చారు. నల్లగొండ ఎంపీ ఉత్తమ్‌ కుమార్‌రెడ్డి ఈ విషయంపై గట్టిగా మాట్లాడారు. ఇప్పటికే 2020 ఏప్రిల్‌లో ముంబయి - అహ్మదాబాద్‌ బుల్లెట్‌ రైలును కారిడార్‌ నిర్మాణానికి కేంద్రం శ్రీకారం చుట్టింది. మరో రెండేళ్లలో ఈ ప్రాజెక్టును పూర్తి చేసేందుకు సంస్థ అధికారులు కృషి చేస్తున్నారు. ఈ నేపథ్యంలో హైదరాబాద్‌కు బుల్లెట్‌ బండిపై ఆశలు చిగురిస్తున్నాయి. అది అందుబాటులోకి వస్తే ఇక్కడి నుంచి 650 కిలోమీటర్ల దూరాన ఉన్న ముంబయికి కేవలం 3.30 గంటల్లో వెళ్లే అవకాశం దుక్కుతుంది.


నిధులు కేటాయిస్తే..

యాదగిరి లక్ష్మీనర్సింహాస్వామి ఆలయానికి లోకల్‌ రైలు ప్రయాణం కలగానే మిగులుతోంది. ఏపీలోని తిరుమల తిరుపతి దేవస్థానం మాదిరిగా వందల కోట్లతో సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతున్న స్వామి చెంతకు నగరవాసులు సులువుగా వెళ్లి వచ్చేందుకు మల్టీమోడల్‌ ట్రాన్స్‌పోర్ట్‌ సిస్టమ్‌ (ఎంఎంటీఎస్‌) రైళ్లను అందుబాటులోకి తీసుకొస్తామని చెబుతున్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ పాలకుల మాటలు నీటిమూటలవుతున్నాయి. ఎంఎంటీఎస్‌ రెండో దశ పనుల్లో భాగంగా 2012లో సికింద్రాబాద్‌ నుంచి రాయగిరి రైల్వేస్టేషన్‌ వరకు 33 కిలోమీటర్ల వరకు డబ్లింగ్‌, విద్యుద్దీకరణ పనులు చేపట్టేందుకు నిర్ణయించారు. ఈ మేరకు రైల్వే అధికారులు 2016లో రూ.330 కోట్లతో పనులకు అంచనా వేశారు. నేటి వరకు కార్యరూపం దాల్చలేదు. 


అంచనా వ్యయం 2018లో రూ.414 కోట్లకు చేరుకుంది. అంచనా వ్యయం పెరిగిన విషయంపై రాష్ట్ర ప్రభుత్వానికి రైల్వే అధికారులు లేఖ రాసినా పట్టించుకోకపోవడంతో టెండర్లు రద్దయ్యాయి. దీంతో యాదాద్రికి ఎంఎంటీఎస్‌ రైలు సేవల పనులు అర్థంతరంగా నిలిచిపోయాయి. సికింద్రాబాద్‌ స్టేషన్‌ నుంచి రాయగిరి రైల్వేస్టేషన్‌ వరకు ఎంఎంటీఎస్‌ రైళ్లను అందుబాటులోకి తీసుకొస్తే జంట నగరాలతోపాటు శివారు ప్రాంతాల ప్రజలు రూ. 20 నుంచి రూ.30 టికెట్‌ ధరతో యాదాద్రి వెళ్లే అవకాశం దక్కుతుంది.


మెట్రోను ఆదుకోవాలి..

హైదరాబాద్‌ మెట్రో రైలుకు 2021-22 బడ్జెట్‌లో కేంద్రం మొండిచేయి చూపించింది. పైసా కూడా విద్చలేదు. కరోనా, ఇతర కారణాలతో ప్రస్తుతం రోజుకు రూ.80 లక్షల నుంచి రూ.కోటి నష్టం వస్తుండడంతో నిర్వహణ భారాన్ని సంస్థ  మోయలేక పోతోంది. గత బడ్జెట్‌లో చెన్నై మెట్రో ఫేజ్‌-2కు రూ.63,246 కోట్లు, బెంగళూరు మెట్రోకు రూ.14,788 కోట్లు, కొచ్చి మెట్రో ఫేజ్‌-2కు రూ.1,957 కోట్లు కేటాయించిన కేంద్రం హైదరాబాద్‌ మెట్రో రెండో దశ పనులను పూర్తి చేసేందుకు రూపాయి కూడా అందించలేదు. మెట్రో నియో, లైట్‌ ప్రాజెక్టుల ప్రస్తావన లేదు. ఈ బడ్జెట్‌లో అయినా తగిన ప్రాధాన్యం ఇవ్వాలని నగరవాసులు కోరుతున్నారు. కేంద్రం నిధులు మంజూరు చేస్తే ఇప్పటికే డీపీఆర్‌ సిద్ధం చేసుకుని సిద్ధంగా ఉన్న శంషాబాద్‌ ఎయిర్‌పోర్టు పనులకు కూడా మోక్షం లభిస్తోందని పేర్కొంటున్నారు. అలాగే, హైదరాబాద్‌ నుంచి విజయవాడకు జాతీయ రహదారి వెంట హైస్పీడ్‌ రైలు ప్రాజెక్టుకు, సికింద్రాబాద్‌ రైల్వే  స్టేషన్‌, చర్లపల్లి టెర్మినల్‌ అభివృద్ధి పనులకు నిధులు మంజూరు చేయాల్సి ఉంది.

Updated Date - 2022-01-31T14:48:31+05:30 IST