ఐదేళ్లలో కరోనా బలహీనం?

ABN , First Publish Date - 2021-04-05T07:55:28+05:30 IST

కరోనా ముప్పు ఎప్పటికి తగ్గుతుంది? చాలా మందిని వేధిస్తున్న సందేహాలివి. కానీ.. భయపడాల్సిన అవసరం లేదని, మన శరీరాల్లోని రోగనిరోధక శక్తి కరోనాను ఎదుర్కొనే శక్తిని సంతరించుకుంటుందని.. వచ్చే ఐదేళ్ల

ఐదేళ్లలో కరోనా బలహీనం?

  • దగ్గు, జలుబు మాత్రమే కలిగించేలా
  • శక్తిహీనమయ్యే అవకాశం

కరోనా ముప్పు ఎప్పటికి తగ్గుతుంది? చాలా మందిని వేధిస్తున్న సందేహాలివి. కానీ.. భయపడాల్సిన అవసరం లేదని, మన శరీరాల్లోని రోగనిరోధక శక్తి కరోనాను ఎదుర్కొనే శక్తిని సంతరించుకుంటుందని.. వచ్చే ఐదేళ్లలో కరోనా మామూలు జలుబులాగా మారిపోతుందని శాస్త్రజ్ఞులు భరోసా ఇస్తున్నారు. ఇందుకు ఉదాహరణగా.. 1889లో ప్రపంచవ్యాప్తంగా 10 లక్షల మంది ప్రాణాలు బలిగొన్న వైరస్‌ (అది కూడా కరోనా కుటుంబానికి చెందిన వైరసేనని 2020లో తేల్చారు) ఆ తర్వాత క్రమంగా శక్తిహీనమైపోయిన విషయాన్ని వారు గుర్తుచేస్తున్నారు. 1889లో ప్రపంచాన్ని చుట్టేసిన ఆ వైరస్‌.. ఆ తర్వాత రెండేళ్లపాటు అక్కడక్కడా ప్రబలి క్రమంగా బలహీనమైంది. ప్రజల శరీరాల్లోని రోగనిరోధక శక్తి ఆ వైర్‌సను సమర్థంగా ఎదుర్కోవడం ప్రారంభించాక సాధారణ జలుబు స్థాయికి చేరింది.


మొత్తం 7 రకాలు..

కరోనా అనగానే చాలా మంది ఇదేదో కొత్తగా మానవాళి పాలిట ముప్పుగా సంక్రమించిన వైరస్‌ అనుకుంటున్నారు. కానీ, కాదు. మనుషుల్లో ఇన్‌ఫెక్షన్‌కు కారణమయ్యే కరోనా వైర్‌సలను 1960ల్లో శాస్త్రజ్ఞులు గుర్తించారు. ప్రస్తుత వైరస్‌ సహా.. కరోనా కుటుంబంలో ఇప్పటిదాకా గుర్తించిన వైర్‌సలు ఏడు రకాలు. అందులో మొదటి నాలుగు రకాలూ సాధారణ జలుబును కలిగించేవి. ప్రపంచవ్యాప్తంగా ఏటా నమోదయ్యే జలుబు కేసుల్లో 25-30 శాతం కేసులకు ఈ వైర్‌సలే కారణం. అవి.. 229ఈ, ఎన్‌ఎల్‌63, ఓసీ43, హెచ్‌కేయు1 రకాలు. ఐదోది.. 2002-03లో ప్రపంచవ్యాప్తంగా సార్స్‌ (సివియర్‌ ఎక్యూట్‌ రెస్పిరేటరీ సిండ్రోమ్‌)కు కారణమైన కరోనా వైరస్‌. 2012లో ప్రబలినది మెర్స్‌ (మిడిల్‌ ఈస్ట్‌ రెస్పిరేటరీ సిండ్రోమ్‌) వైరస్‌. ఇక ఏడోది.. అత్యంత శక్తిమంతమైనది.. ప్రస్తుతం ప్రపంచాన్ని వణికిస్తున్న మహమ్మారి ‘సార్స్‌-కొవ్‌-2’ వైరస్‌. మొదటి నాలుగు రకాలూ సాధారణ జలుబు కలిగించే స్థాయికి బలహీన పడిపోయాయి. సార్స్‌, మెర్స్‌ తీవ్రత కూడా తగ్గిపోయింది. వాటి కోవలోనే ప్రస్తుత కరోనా కూడా మరో ఐదేళ్లలో పాండెమిక్‌ స్థాయి నుంచి ఎండెమిక్‌ స్థాయికి పడిపోతుంది. పాండెమిక్‌ అంటే ప్రపంచవ్యాప్తంగా ప్రబలే వైరస్‌, ఎండెమిక్‌ అంటే.. కొన్ని ప్రాంతాలకు, కొన్ని కేసులకు పరిమితమైపోయేది.



సున్నా కేసులు సాధ్యమేనా?

మశూచి పేరు వింటేనే ఒకప్పుడు వణికిపోయేవారు. అలాంటిది మశూచిని శాస్త్రజ్ఞులు పూర్తిగా అరికట్టగలిగారు. కరోనా విషయంలో కూడా అలాగే జరిగితే దాన్ని ‘జీరో కొవిడ్‌’ స్థితిగా పేర్కొనవచ్చు. కానీ అది ఎప్పుడు సాధ్యమంటే.. కరోనా ఇన్ఫెక్షన్‌ వల్ల, వ్యాక్సిన్ల వల్ల వచ్చే రోగనిరోధక శక్తి చాలా కాలం ఉన్నప్పుడు. వైరస్‌ మన రోగనిరోధక శక్తి కళ్లుగప్పలేని స్థాయికి బలహీనపడినప్పుడు. గబ్బిలాల వంటి ఇతర జీవుల్లో వైరస్‌ దాక్కోలేనప్పుడు. వాటిలో మొదటి రెండూ జరిగే అవకాశం ఉందేమోగానీ, వైరస్‌ ఇతర జీవులకు సోకకుండా ఆపలేం. వాటి నుంచి మనకు సోకే ముప్పునూ అరికట్టలేం. కాబట్టి జీరో కొవిడ్‌ దాదాపు అసాధ్యమే. అందుకే.. నేచర్‌ జర్నల్‌ నిర్వహించిన ఒక సర్వేలో 90ు మంది వైద్య నిపుణులు, శాస్త్రజ్ఞులు కరోనా మరో ఐదేళ్లలో సాధారణ జలుబు, దగ్గు మాత్రమే కలిగించే స్థాయికి బలహీనమైపోతుందని పేర్కొన్నారు.   - సెంట్రల్‌ డెస్క్‌

Updated Date - 2021-04-05T07:55:28+05:30 IST